Begin typing your search above and press return to search.

అమరావతి రాజధానికి కేంద్రం ఇచ్చేది ఇంతే !

ఆ 15000 కోట్లకు కేంద్రం కేవలం పూచీకత్తుగా ఉంటుందని స్పష్టం చేసింది. అంటే కేంద్రం ఈ రుణాలు తీర్చదన్న మాట.

By:  Tupaki Desk   |   11 March 2025 4:00 AM IST
అమరావతి రాజధానికి కేంద్రం ఇచ్చేది ఇంతే !
X

ఏపీకి అమరావతి రాజధానిగా నిర్మించాల్సి ఉంది. అది బృహత్తరమైన ప్రణాళికగా ఉంది. ఏకంగా లక్ష కోట్లకు పైగా బడ్జెట్ అని వైసీపీ నేతలు అంటే అలా కాదు మేము కట్టి చూపిస్తామని టీడీపీ కూటమి నేతలు చెబుతున్నారు. మరో వైపు చూస్తే అమరావతి కోసం చేస్తున్న అప్పులను భూములు అమ్మి తీరుస్తామని సెల్ఫ్ ఫైనాన్స్ కేపిటల్ అని మంత్రి నారాయణ అంటున్నారు.

ఇంతకీ అమరావతికి వచ్చే అప్పులు ఎన్ని, కేంద్రం ఇచ్చే గ్రాంట్స్ ఎన్ని అన్నది కనుక చూస్తే అమరావతి కోసం 2014 నుంచి 2019 మధ్యలో కేంద్రం 2,500 కోట్ల రూపాయల నిధులను ఇచ్చింది. ఇది గ్రాంట్ అన్న మాట. దీనిని తీర్చాల్సిన పని లేదు. మౌలిక వసతుల కల్పనకు ఈ నిధులు వెచ్చించాలని ఇచ్చినట్లుగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు పార్లమెంట్ లో వైసీపీ ఎంపీ గురుమూర్తి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకమైన సమాధాంగా ఇచ్చింది.

ఈ నిధులతో రాజ్ భవన్, అసెంబ్లీ, సచివాలయం వంటివి నిర్మించాలని పేర్కొంటూ ఇచ్చింది. ఇక 2024 నుంచి 2029 మధ్యలో కేంద్రం ఏమి ఇస్తుంది అంటే మరో 1500 కోట్ల రూపాయలు గ్రాంట్స్ గా ఇస్తుంది అని కేంద్రం పేర్కొంది. ప్రపంచ బ్యాంక్, అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాకులు ఏపీ రాజధాని కోసం 15000 కోట్ల రూపాయలను అప్పుగా ఇస్తున్నాయని తెలిపింది.

ఆ 15000 కోట్లకు కేంద్రం కేవలం పూచీకత్తుగా ఉంటుందని స్పష్టం చేసింది. అంటే కేంద్రం ఈ రుణాలు తీర్చదన్న మాట. వాటిని ఏపీ ప్రభుత్వమే తీర్చుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ నిధులలో కేవలం 10 శాతం అంటే 1500 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్రం గ్రాంట్స్ గా ఇస్తుంది అని అంటున్నారు.

ఇక 2025 జనవరి 22 నుంచి ప్రపంచ బ్యాక్, అలాగే 2025 ఫిబ్రవరి 10 నుంచి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అప్పులు అన్నవి అమలులోకి వస్తాయని కేంద్రం తెలిపింది. అయితే ఈ అప్పులకు సంబంధించి ఈ రోజుకీ నిధులు ఏవీ ఈ రెండు సంస్థలూ మంజూరు చేయలేదని కూడా కేంద్రం స్పష్టం చేసింది. మరో వైపు అప్పులు తెచ్చి కట్టినా అమరావతి నిర్మాణం పనులను కేంద్రం పర్యవేక్షిస్తుంది అని పేర్కొనడం విశేషం. మొత్తానికి చూస్తే కేంద్రం నుంచి గ్రాంట్స్ నాలుగు వేల కోట్ల రూపాయలు అమరావతి రాజధాని కోసం వస్తాయన్న మాట.

ఇదీ కేంద్రం ఇచ్చే సాయం. విభజన హామీలను చూస్తే కనుక కేంద్రమే రాజధానిని నిర్మించి ఇవ్వాలి. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం అప్పుల వైపు చూస్తోంది. వాటికి అయ్యే వడ్డీలు అన్నీ కలిపి తడిసి మోపెడు అవుతాయి. ఎలా తీరుస్తారు అంటే భూములు అమ్మి అని అంటున్నారు. కానీ అప్పటికి అమరావతి భూములకు ఎంత రేటు పలికినా దానికి మించేలా ఈ అప్పులూ వడ్డీలు కూడా జమ కూడితే ఇక అమరావతి సెల్ఫ్ ఫైనాన్షియల్ కేపిటల్ ఎలా అవుతుందో కూటమి పెద్దలే చెప్పాలని అంటున్నారు. మొత్తానికి చాలా లెక్కలను కాగితాల మీద వేసుకుని ఏపీ సర్కార్ రాజధాని వంటి భారీ ప్రాజెక్ట్ ని టేకప్ చేస్తోంది. మరి ఇది ఏ విధంగా ముందుకు సాగుతుంది అన్నది చూడాల్సి ఉంది. కేంద్రం అయితే తాను ఇచ్చే నిధుల విషయంలో పక్కా క్లారిటీతో ఉండడం గమనార్హం.