అనకాపల్లి హాట్ గురూ.. వైసీపీలో నాకంటే నాకే!
మరోవైపు... ఓ పదిస్థానాల్లో మాత్రం ఇద్దరు నుంచి ముగ్గరు, నలుగురు వరకు నాయకులు తలపడుతున్నారు.
By: Tupaki Desk | 2 Jan 2024 5:40 AM GMTవచ్చే ఎన్నికల్లో పోటీ కోసం.. అందునా వైసీపీ తరఫున బరిలో నిలిచేందుకు చాలా మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దాదాపు 175 సీట్లలో 130 సీట్లకు ఇద్దరు చొప్పున బరిలో ఉన్నారు. సిట్టింగులను కాదంటే తమకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇక, సిట్టింగులు కూడాతమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. మరోవైపు... ఓ పదిస్థానాల్లో మాత్రం ఇద్దరు నుంచి ముగ్గరు, నలుగురు వరకు నాయకులు తలపడుతున్నారు.
సీటు ను దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. దీంతో ఆయా సీట్లు హీటెక్కాయి. ఇలా పోటీ చేస్తామని ముందుకు వస్తున్నవారిలో ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నవారు.. సామాజిక వర్గాల పరంగా బలంగా ఉన్నారు.. ఆర్థికంగా మెలితిరిగిన వారు.. ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఇలాంటివారి పోటీతో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి నియోజకవర్గం రాజకీయాలు వేడెక్కాయి. ఈ టికెట్‌ను దక్కించుకోవడం కోసం.. సిట్టింగ్ నేత సహా మరో ముగ్గురు దూకుడుగా ముందుకు సాగుతున్నారు.
అనకాపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అమర్‌నాథ్ మరోసారి తనకే టికెట్ కేటాయించాలని బలంగా కోరుతున్నారు. బలమైన గళం వినిపించడంతోపాటు.. కాపు నాయకుడు కావడం.. ఆయనకు ప్లస్‌గా ఉంది. అయితే.. టీడీపీ, జనసేనల నుంచి బలమైన నేత ఇక్కడ పోటీకి దిగితే.. సిట్టింగుపై ఉన్న వ్యతిరేకత బలంగా పనిచేస్తే.. అనే సందేహాల నడుమ.. ఈ సారి ఆయనను ఇక్కడ నుంచి మార్చేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది.
దీంతో గుడివాడకు టికెట్ ఇవ్వకపోతే.. తమకు ఇవ్వాలంటూ.. మరో ముగ్గురునాయకులు క్యూ కట్టారు. వీరిలో కశింకోటకు చెందిన మలసాల భరత్ ముందు వరుసలో ఉన్నారు. ఈయన ఆర్థికంగా బలంగా ఉన్న నాయకుడు. మరోవైపు దాడి రత్నాకర్ కూడా ఈ టికెట్‌ను కోరుతున్నారు. ఈయన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తనయుడు కావడం, నియోజకవర్గంలో ఈ కుటుంబానికి బలమైన పట్టు ఉండడం గనమార్హం.
దీంతో టికెట్ ఇస్తే.. గెలిచి చూపిస్తానని దాడి రత్నాకర్ అంటున్నారు. ఇదిలావుంటే.. ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్న భీశెట్టి వెంకటసత్యవతి కూడా అనకాపల్లి సీటు కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సారి ఎంపీగా వద్దన్న ఆమె.. అనకాపల్లి ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో అనకాపల్లి సీటు హాట్ కేక్‌గా మారపోయింది. మరి వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.