Begin typing your search above and press return to search.

'ఆనం' వారి ఆవేద‌న ఇదేనా..!

అయితే.. ఈ విష‌యాన్ని ఆయ‌న రోడ్డున పెట్ట‌డ‌మే రాజ‌కీయంగా చ‌ర్చ అయింది.

By:  Tupaki Desk   |   24 Oct 2024 12:13 PM GMT
ఆనం వారి ఆవేద‌న ఇదేనా..!
X

మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న ప్రాణాల‌కు ముప్పు ఉంద‌ని ఆయ‌న తేల్చారు. త‌న‌కు లైసెన్స్‌డ్ గ‌న్ కావాల‌ని కూడా కోరారు. త‌న‌ను చంపేందుకు కుట్ర చేశార‌ని కూడా సంచ‌ల‌న వ్యాఖ్య‌లే చేశారు. అయితే.. అస‌లు ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి ఆవేద‌న ఏంటి? ఆయ‌న ఏం కోరుకుంటున్నారు? నిజంగానే ఆయ‌న ప్రాణాల‌కు ముప్పు ఉందా? అనేది ప్ర‌శ్న‌. రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గ‌వ‌చ్చు. దేనినీ సున్నితంగా తీసి పారేయ‌లేం. కాబ‌ట్టి ఆనం వారి ఆవేద‌న‌లో అర్థం ఉంద‌నే అనుకుందాం. అయితే.. ఈ విష‌యాన్ని ఆయ‌న రోడ్డున పెట్ట‌డ‌మే రాజ‌కీయంగా చ‌ర్చ అయింది.

ఆనం చేసిన వ్యాఖ్య‌ల‌ను గ‌మ‌నిస్తే.. ఇవి ప్ర‌తిప‌క్షాల‌కు మంచి ఆయుధాల‌ను అందించాయి. ఒక మంత్రి కార్య‌క్ర‌మంలోకి, అందునా సొంత ఇంట్లోనే పెట్టుకున్న కార్య‌కర్త‌ల స‌మావేశంలోకి ఒక ఆగంత‌కుడు ప్ర‌వేశించ‌డం వంటివి అంత తేలిక‌గా తీసుకునే విష‌యాలు కావు. నిజానికి మంత్రి ఇంట్లోకి వేరేవారు ప్ర‌వేశించారంటేనే పెద్ద నేరం. అందునా స‌మావేశంలోకి వేరేవారు వ‌చ్చారం టే.. భ‌ద్ర‌తా ప‌రంగా ఎక్క‌డో లోపాలు ఉన్నాయ‌నేది ఆయ‌న చెప్ప‌ద‌లుచుకున్న విష‌యం. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కూడా ఈ వ్యాఖ్య‌లు ప్ర‌శ్నించేలా ఉండ‌డం మ‌రో కోణం.

అయితే.. ఇవ‌న్నీ మంత్రి ఆనంకు తెలియ‌వా? తాను చెప్పిన విష‌యం స‌ర్కారుకు ఇబ్బంది క‌లిగిస్తుంద‌న్న‌ది ఆయ‌న తెలియ దా? అంటే తెలుసు. తెలిసి కూడా ఇలా ఎందుకు వ్యాఖ్యానించారు? అనేది ప్ర‌శ్న‌, దీనికి స‌మాధానమే రాజ‌కీయంగా ఆయ‌న‌లో ఉన్న ఆవేద‌న‌. ఈ విష‌యాన్ని ఆయ‌న ప‌రిష్క‌రించ‌లేక పోతున్నారు. ఆది నుంచి కూడా ఆయ‌న వేరే శాఖ‌ను ఇవ్వాల‌ని కోరుతున్నారు. కానీ, ఇది సాధ్యం కావ‌డం లేదు. దీంతోనే దాదాపు మూడు నెల‌ల పాటు అస‌లు మంత్రిప‌ద‌విని కూడా ఆయ‌న స్వీక‌రించ‌లేదు. ఇక‌, ఇది కూడా తీసుకోక‌పోతే.. క‌ష్ట‌మ‌ని బావించి.. ఆయ‌న తీసుకున్నారు.

అయితే.. దేవ‌దాయ శాఖ‌లో ఆయ‌న‌కు పెద్ద‌గా ప‌నిలేదు. ఉన్నా.. ఆయ‌న అభిమ‌తానికి, ఆయ‌న దూకుడుకు దేవ‌దాయ శాఖ పెద్ద‌గా క‌లిసి రావ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటూ.. నియోజ‌క‌వ‌ర్గంలోనే ప‌రిమితం అవు తున్నారు. ఇక‌, కేబినెట్ స‌మావేశాల‌కు కూడా ఆయ‌న‌కు ఆహ్వానం లేదు. ఈ ప‌రిణామాలే.. రాజ‌కీయంగా ఆనంకు ఇబ్బందిగా మారాయి. అయితే.. వీటిని ఆయ‌న చెప్ప‌లేదంటే పొర‌పాటే.. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు చంద్ర‌బాబు చెవిలో వేస్తూనే ఉన్నారు. అయినా అనుకున్న‌ట్టుగా ప‌నులు జ‌ర‌గ‌డం లేదు. ఈ ఆవేద‌న‌కు తోడు నిజంగానే ఓ వ్య‌క్తి చేసిన హ‌ల్చ‌ల్ తోడై.. మొత్తానికి ఆనం వారు.. అతి సౌమ్యంగా విష‌యాన్ని మీడియా ముందు పెట్ట‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. తాము అనుకున్న‌వి సాధించేందుకు ఏ దారినైనా ఎంచుకుంటారు!!