Begin typing your search above and press return to search.

దేవుడి మంత్రి ఆనం సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా ?

దీనిని ఎవరు అధిష్టించినా వారి తరువాత పొలిటికల్ కెరీర్ అన్నది సాఫీగా సాగింది లేదు అని పొలిటికల్ హిస్టరీ తెలియచేస్తోంది.

By:  Tupaki Desk   |   11 Aug 2024 5:30 PM GMT
దేవుడి మంత్రి ఆనం సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా ?
X

కొన్ని మంత్రిత్వ శాఖలతో పాటు కొన్ని పదవుల విషయంలో యాంటీ సెంటిమెంట్ అలా కొనసాగుతూ వస్తోంది. ఉదాహరణకు స్పీకర్ పదవి.దీనిని ఎవరు అధిష్టించినా వారి తరువాత పొలిటికల్ కెరీర్ అన్నది సాఫీగా సాగింది లేదు అని పొలిటికల్ హిస్టరీ తెలియచేస్తోంది. ఒకరిద్దరు తప్ప దాదాపుగా అంతా తెర వెనక్కే వెళ్లిపోయారు. మాజీ స్పీకర్లుగా మిగిలిపోయారు.

అలాంటిదే దేవాదాయ శాఖ మంత్రి పదవి. ఈ పదవి వరించిన వారికి ఆ తరువాత పొలిటికల్ గా కెరీర్ క్లోజ్ అని కూడా ఉంది. దానికి కూడా చెప్పుకుంటే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన నెల్లూరు పెద్దారెడ్డి ఆనం రామనారాయణరెడ్డి విషయానికి వస్తే ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. దాంతో తన అనుభవానికి బ్రహ్మాండమైన శాఖ దక్కుతుందని ఆశించారు.

కానీ దేవాదాయ శాఖ ఇచ్చారు. ఆ శాఖ మంత్రిగా ఆయన అయితే ఇప్పటిదాకా తనకు కేటాయించిన చాంబర్ లోక్ అడుగుపెట్టలేదు. అక్కడ తన బాధ్యతలను స్వీకరించలేదు. ఎందుకంటే గత రెండు నెలలుగా జ్యేష్టం ఆషాడ మాసాలు ఉన్నాయి. ఆషాడం శూన్య మాసం. కానీ దానికి ముందున్న జ్యేష్ఠ మాసం కొంతవరకూ ఫరవాలేదు. కానీ ఆనం వారు అపుడు ఛాంబర్ లోకి ప్రవేశించలేదు. దానిని ఈలోగా ఆధునీకరించారు. దాంతో ఆయన ఇపుడు చాంబర్ లో అడుగు పెట్టారు.

ఆయన శుభాలకు దివ్యమైన మాసంగా పేరు గడించిన శ్రావణ మాసం వచ్చేవరకూ ఆగారు. ఆయన ఆదివారం సప్తమి నక్షత్ర శుభ ముహూర్తాన తన శాఖకు సంబంధించిన చాంబర్ లోకి అధికారికంగా ప్రవేశించారు. ఈ శాఖ మంత్రిగా తనకు సక్సెస్ ఫుల్ గా అంతా జరగాలని యాంటీ సెంటిమెంట్ ఏదీ తన కెరీర్ కి అడ్డు రాకుండా ఉండాలని బహుశా ఆయన ఈ శుభ ముహూర్తాన్ని ఎంచుకునట్లుగా ఉంది.

ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. 113 కోట్ల రూపాయల సిజిఎఫ్ నిధులతో ఏపీలోని 160 దేవాలయాల ఆధునీకరణ పనులను చేపడుతున్నామన్నారు. ధూప దీప నైవేద్యాలకు ప్రస్తుతం ఇచ్చే 5 వేల రూపాయలను 10 వేలకు పెంపు చేస్తున్నామన్నారు. రెవిన్యూ సదస్సుల్లో దేవాదాయ భూములపై కూడా ఫిర్యాదులు స్వీకరిస్తారని ఆయన చెప్పారు.

రాష్ట్ర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవాదాయ భూముల పరిరక్షణకు సహకరించాలన ఆయన విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ పాలనలలో తిరుమల నుండి ఉత్తరాంధ్రలోని అరసవిల్లి వరకూ దేవుడి ఆస్తులను కూడా వదలని పరిస్థితులు అనేకం ఉన్నాయని అన్నారు.

తమ ప్రభుత్వం మాత్రం దేవాదాయ శాఖ భూములను కాపాడుతుందని ఆయన అన్నారు. ఏపీ వ్యాప్తంగా దేవాదాయ శాఖకు నాలుగు లక్షల అరవై అయిదు వేల ఎకరాల భూములు ఉన్నాయని చెప్పారు. వాటిని పరిరక్షించడంతో పాటు దేవాదాయ సనాతన ఆచారాలను కూడా కాపాడుతామని ఆయన హామీ ఇచ్చారు. ఆనమ రామనారాయణరెడ్డి ఇక మీదట ఈ చాంబర్ నుంచే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. పెద్దాయనగా సౌమ్యుడిగా పేరున్న ఆనం వారు ఈ శాఖలో మంచి పేరు తెచ్చుకుంటారని అంతా ఆశిస్తున్నారు.