సీటు ఎక్కడో తెలియక ఆనం అయోమయం..!
ఆయన 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆయనకు వెంకటరిగి సీటుని జగన్ కేటాయించారు. అలా ఆనం మంచి మెజారిటీతో గెలిచారు
By: Tupaki Desk | 26 Jan 2024 3:57 AM GMTఆయన దిగ్గజ నేత. నెల్లూరు పెద్దాయనగా చెప్పాల్సి ఉంది. ఆయనది అచ్చంగా నాలుగు దశాబ్దాల పైబడిన రాజకీయం అనేకసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన విశేష అనుభవం ఉంది. ఆయన టీడీపీ కాంగ్రెస్ టీడీపీ వైసీపీ మళ్ళీ టీడీపీ ఇలా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు.
ఆయన 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆయనకు వెంకటరిగి సీటుని జగన్ కేటాయించారు. అలా ఆనం మంచి మెజారిటీతో గెలిచారు. అయితే సీనియర్ నేతగా మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకున్నారు. కానీ దక్కలేదు. రెండవ విడతలో కూడా చాన్స్ రాలేదు. దాంతో తన అసంతృప్తిని ఆయన వెళ్ళగక్కారు. ఆ మీదట ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి యాంటీగా టీడీపీ అభ్యర్ధికి అనుకూలంగా ఓటు వేసి షాక్ ఇచ్చారు. ఫలితంగా ఆయన సస్పెండ్ అయ్యారు.
సరే టీడీపీలో ఆయన చేరిపోయారు. ఆయనకు అక్కడ చోటు ఉంది అన్న భరోసా అయితే క్యాడర్ లో ఉంది. అయితే సీటు విషయమే ఆయనకు కలవరపెడుతోంది అని అంటున్నారు. ప్రస్తుతం వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన ఆనం కి ఆత్మకూరు సీటు ఇస్తారని ప్రచారం సాగుతోంది.
దాంతోనే పెద్దాయన ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఎందుకంటే అక్కడ మేకపాటి కుటుంబానికి ఆధిపత్యం ఉంది. మేకపాటి గౌతం రెడ్డి గత ఏడాది మరణించారు. దాంతో ఆ సానుభూతి కూడా అక్కడ ఆయన సోదరుడు మేకపాటి విక్రం రెడ్డికి కలసి వస్తుంది. అంగబలం అర్ధబలం కలిగిన ఫ్యామిలీ అది. ఈ నియోజకవర్గంలో రెడ్లు ఎక్కువ. అలాగే ఎస్సీ, బీసీలు ఎస్టీలు ఎక్కువ.
దాంతో ఎలా చూసుకున్నా వైసీపీ కళ్ళు మూసుకుని గెలిచే సీటు అది. దాంతో అక్కడకు పంపిస్తే ఎలా అని ఆనం వర్గం డౌట్ పడుతోందిట. తమకు కావాల్సింది నెల్లూరు అర్బన్ అని ఆనం వర్గం అంటోంది. అక్కడ అయితే పెద్దాయనకు బాగా పట్టు ఉందని సునాయాసంగా గెలుస్తారు అని అంటున్నారు.
అయితే ఆ సీటు మాజీ మంత్రి నారాయణకే రిజర్వ్ అయిపోయింది. ఆయన ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో తొలిసారి ఎమ్మెల్యేగా అడుగు పెట్టాలని చూస్తున్నారు. జనసేన పొత్తు కూడా ఉండడంతో కలసి వస్తుందని భావిస్తున్నారు.
దాంతో ఆనం కి అయితే ఆత్మకూరు లేకపోతే వెంకటరిగి అని అంటున్నారు. వెంకటరిగిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామక్రిష్ణ ఉన్నారు. ఆయన 2009, 2014లలో రెండు సార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఈసారి తప్పకుండా పోటీ చేస్తాను అని అంటున్నారు. ఆయనకు టికెట్ రాకుండా ఆనం కి ఇస్తే సహకరించేది ఉండదని అంటున్నారు.
దాంతో పెద్దాయనకు ఏమీ పాలుపోవడం లేదు అని అంటున్నారు. తన రాజకీయం ఈ విధంగా పసుపు పార్టీలో ఉండడం పట్ల ఆయన ఇబ్బంది పడుతున్నారు అని అంటున్నారు మరి ఆనం కి కోరుకున్న సీటు రానపుడు పార్టీ మారి ప్రయోజనం లేదు కదా అన్న చర్చ కూడా వస్తోందిట. నెల్లూరులో చూస్తే ఆనం కి ఇవే ఆప్షన్లు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.