ఆ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి 'బాబు' మీద అలిగారా?
సీనియర్ నాయకుడు.. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అలిగారు.
By: Tupaki Desk | 19 Jun 2024 1:30 AM GMTసీనియర్ నాయకుడు.. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అలిగారు అని ప్రచారం జరుగుతుంది . ఆయన మీడియాకు కూడా అందుబాటులోకి రావడం లేదు అని కూడా అంటున్నారు . ఆయనకు తెలిసిన.. బాగా చనువు ఉన్న జర్నలిస్టులను కూడా.. దరి చేరనివ్వడం లేదు. దీంతో ఆయన అలిగారనే విషయం టీడీపీలో చర్చనీయాంశం అయింది. తాజా గా కొలువుదీరిన చంద్రబాబు మంత్రి వర్గంలో ఆనం రామనారాయణరెడ్డికి దేవదాయ శాఖ మంత్రిని కేటాయించారు. ఆయన కూడా.. ప్రమాణం చేసిన విషయం తెలిసిందే.
అయితే..శాఖ కేటాయింపు విషయంలో ఆనంను చర్చించకుండానే.. చంద్రబాబు నిర్ణయం తీసుకున్నా రు అని అంటున్నారు . వాస్తవానికి నెల్లూరు నుంచి సీనియర్లు చాలా మంది మంత్రి పదవిని దక్కించుకునేందుకు చూశారు. ముఖ్యంగా వేమిరెడ్డి ప్రశాంతి అయితే.. మంత్రి పీఠం దక్కితే చాలన్నట్టుగా ప్రయత్నాలు చేశారు. కానీ, జిల్లాలో రెడ్డిసామాజిక వర్గాన్ని టీడీపీ వైపు తిప్పుకోవాలన్న సంకల్పంతో ఆనం రామనారాయణరెడ్డికి చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు.
మంత్రి వర్గంలోకి కూడా తీసుకున్నారు. కానీ, ఆయన ఆర్థిక శాఖను ఆశించారు. గతంలోనూ రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల మంత్రివర్గాల్లో ఆర్థిక శాఖను ఆనం రామనారాయణరెడ్డి చూశారు. దీంతో తన అనుభవాన్ని ఇక్కడ ఉపయోగించుకుని పార్టీకి మేలు చేయాలని తాను భావించారు.కానీ, చంద్రబాబు దూరదృష్టితో ఆలోచించి.. ఆయనను రిస్క్‌లేని దేవదాయ శాఖకు ఎంపిక చేశారు. ఇది ఆయనకు నచ్చకపోవడం.. పనిలేని దేవదాయ శాఖ తనకెందుకని భావిస్తున్నారు.
వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితిలో ఆర్థిక మంత్రి ఎవరు ఉన్నా.. ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడంతోపాటు రాష్ట్ర ఆర్థిక ఆర్థిక పరిస్థితిని అదుపు చేయడం.. గాడిలో పెట్టడం.. సంక్షేమపథకాలకు కొరతలేకుండా.. నిధులు ఇవ్వడం వంటి కీలక బాద్యతలుచేపట్టాలి. దీంతో క్షణం తీరిక ఉండే పరిస్థితి లేదు. దీంతో ఆనం అయితే.. మరింత విసిగిపోతారని.. కష్టపడతారని భావించిన చంద్రబాబు ఆయనకు దేవదాయ శాఖను అప్పగించారు. కానీ, ఆయన దీనిని తీసుకునేందుకు ముందుకు రావడం లేదు అని అంటున్నారు .