Begin typing your search above and press return to search.

తొలిసారి ఓ క‌ళా ద‌ర్శ‌కుడు బోర్డ్ మెంబ‌ర్ సేవ‌లందించ‌డం విశేషం!

టీటీడీ బోర్డ్ మెంబ‌ర్ గా ఆర్ట్ డైరెక్ట‌ర్ ఆనంద్ సాయి ప్ర‌మాణ స్వీకారం చేసిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 Nov 2024 8:50 AM GMT
తొలిసారి ఓ క‌ళా ద‌ర్శ‌కుడు బోర్డ్ మెంబ‌ర్ సేవ‌లందించ‌డం విశేషం!
X

టీటీడీ బోర్డ్ మెంబ‌ర్ గా ఆర్ట్ డైరెక్ట‌ర్ ఆనంద్ సాయి ప్ర‌మాణ స్వీకారం చేసిన సంగ‌తి తెలిసిందే. ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి అత్యంత ద‌గ్గ‌ర స్నేహితుడు కావ‌డంతోనే ఈ గౌర‌వం ఆనంద్ సాయికి ద‌క్కిందన్న‌ది వాస్త‌వం. ఎంతో కాలంగా ఎంతో మంది బోర్డ్ మెంబ‌ర్ల‌గా కొన‌సాగారు. కానీ తొలిసారి ఓ క‌ళా ద‌ర్శ‌కుడు బోర్డ్ మెంబ‌ర్ సేవ‌లందించ‌డం విశేషం.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌ల్లే ఈ సేవ చేసుకునే అవ‌కాశం ఆనంద్ సాయికి ద‌క్కింద‌న్న‌ది వాస్త‌వం. ఈ అవ‌కాశాన్ని ఆనంద్ సాయి పూర్వ జ‌న్మ సుకృతంగా భావించి ప‌నిచేస్తాన‌ని వాగ్దానం చేసారు. అయితే ఓ మెంబ‌ర్ గా ఆయ‌న సేవ‌లు ఎలా ఉంటాయి? అన్న‌ది మును ముందు తెలుస్తుంది. ఆనంద్ సాయి క్రియేటివ్ ఆర్ట్ డైరెక్ట‌ర్ కాబ‌ట్టి త‌న సామ‌ర్ధ్యం మేర‌కు ప‌ని చేస్తాన‌ని ధీమా వ్య‌క్తం చేసారు. ఆల‌య ప‌రిస‌రాల‌ను సుంద‌రంగా మార్చ‌డంలో త‌న మార్క్ చూపిస్తాన‌న్నారు.

స్వామి వారి ద‌ర్శ‌న భాగ్యంలో భ‌క్తులు క్యూలో కొన్ని గంట‌ల పాటు వేచి ఉంటారు. ఆ స‌మ‌యంలో కూడా భ‌క్తులు దైవానుభూతి పోందేలా చూడ‌టంపై తాను ప్ర‌త్యేక దృష్టి సారిస్తాన‌న్నారు. అంటే చుట్టూ ఉండే ప‌రిస‌రాల‌ను వినియోగించుకుని ఆ ర‌క‌మైన వాతావ‌ర‌ణం క్రియేట్ చేసేలా ఆనంద్ సాయి చ‌ర్య‌లు తీసుకునే అవకాశం ఉంది. ఇప్ప‌టికే ఆనంద్ సాయి తెలంగాణలోని యాదగిరిగుట్ట ఆలయ సుందరీకరణ కోసం ప‌నిచేసారు.

ధైవ స‌న్నిధి ప్రాంగ‌ణంలో ఎంతో ఆహ్లోదక‌ర‌మైన‌ వాతావ‌ర‌ణాన్ని గుట్ట‌లో క‌ల్పించారు. ఆయ‌న‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌ల్ని దిగ్విజ‌యంగా పూర్తి చేసారు. అందుకు గానూ ఆనంద్ సాయి భ‌క్తుల ప్రశంసలు అందుకున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఇవ‌న్నీ చూసే ఆనంద్ సాయికి ఈ అవ‌కాశం క‌ల్పించిన‌ట్లు తెలుస్తోంది. తొలుత ఆనంద్ సాయి ఎంట్రీపై విమ‌ర్శ‌లొచ్చాయి. కానీ ఇప్ప‌డ‌వ‌న్నీ చ‌క్క‌బ‌డ్డాయి.

ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు, ఆలయాన్ని సందర్శించే భక్తులందరికీ దివ్యమైన అనుభూతిని అందించేలా కళాత్మక దృక్పథంతో చూస్తానని ఆనంద్ సాయి స్పష్టం చేశారు. అలాగే `దర్శనాలు ఏర్పాటు చేయడం త‌న ప‌ని కాద‌ని... ఆలయాన్ని అభివృద్ధి చేయడం అన్న‌ది త‌న‌కి ఓ క‌ప్పు టీ లాంటి పని` అని అన్నారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌- ఆనంద్ సాయి ఇండ‌స్ట్రీకి రాక ముందు నుంచే స్నేహితులు. ఇంకా చెప్పాలంటే వారు బాల్య స్నేహితులు. చెన్నైలో ఉన్న‌ప్పుడు ఇద్ద‌రు ఇళ్లు ప‌క్క‌పక్క‌నే. ఎక్కువ‌గా ప‌వ‌న్ ఇంట్లోనే ఆనంద్ సాయి ప‌డుకునే వారు. వాళ్ల రూమ్ అంతా పుస్త‌కాలే. అవి చాల‌వ‌న్న‌ట్లు మార్కెట్లోకి కొత్త పుస్త‌కాలు ఏవొచ్చినా కొనే అల‌వాటు ఇద్ద‌రిదీ. కారు ఉన్నా? బ‌స్ లోనే ప్ర‌యాణం చేయాల‌న్న‌ది ఇద్ద‌రి కోరిక‌. అలా బ‌స్ లో ఎన్నోసార్లు క‌లిసి ప్ర‌యాణం చేసారు.

బ‌స్, బైక్ జ‌ర్నీ లాంటివి ఆనంద్ సాయి ప‌వ‌న్ కి అల‌వాటు చేసిన‌ట్లు ఓ ఇంట‌ర్వ్యూలో రివీల్ చేసారు. క‌లిసి జిమ్ కి వెళ్ల‌డం... త‌న మెంబ‌ర్ షిప్ ని సైతం ప‌వ‌న్ పే చేయ‌డం... బైక్ పెట్రోల్ డ‌బ్బులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇవ్వ‌డం.. `రోజా`, `ద‌ళ‌ప‌తి` సినిమాలు నేల టికెట్ కొని చూపించ‌డం...ఇక్క‌డ కూర్చోబెట్టావ్ ఏంట్రా? అని ప‌వ‌న్ అన‌డం...ఇలా ఎన్నో స‌ర‌దాలు ఆ స్నేహంలో ఉన్నాయి. ఇప్ప‌టికీ ఆ స్నేహం అంతే పదిలంగా కొన‌సాగుతుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా ల్లోకి వ‌చ్చిన త‌ర్వాత ఆ స్నేహితుడిలో ఉన్న ఆర్ట్ ట్యాలెంట్ తో సినిమాల‌కు క‌ళా ద‌ర్శ‌కుడిగా మారారు.