‘థార్’ వాహనానికి పానీపూరి బండి.. ఆనంద్ మహీంద్రా రియాక్షన్ ఇదే
తాజాగా తన పానీపూరి బండిని ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించేందుకు మహీంద్రా సంస్థకు చెందిన 'థార్' కారును వినియోగిస్తున్నారు.
By: Tupaki Desk | 25 Jan 2024 4:18 AM GMTసోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వ్యాపారవేత్తల్లో ఆనంద్ మహీంద్రా ముందుంటారు. ఎక్కడెక్కడి వీడియోల్ని పోస్టు చేస్తూ.. వాటిపై రియాక్టు అవుతూ అందరి మనసుల్ని గెలుచుకునే ఆయన.. తాజాగా ఒక చిట్టి వీడియోను పోస్టు చేశారు. తమ కంపెనీకి చెందిన 'థార్' కారుకు పానీపూరి బండిని తగిలించుకొని వెళ్లే ఢిల్లీ మహిళా వ్యాపారవేత్త వైనాన్ని తాజాగా పోస్టు చేశారు.
ఆమె ప్రయత్నాన్ని అభినందించారు. అదే సమయంలో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల తాప్సీ ఉపాధ్యాయ్ బీటెక్ పూర్తి చేసి.. మోటార్ వాహనంపై పానీపూరీ అమ్ముతూ.. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు.
బీటెక్ పానీపూరీ వాలీగా పేరు తెచ్చుకున్న ఆమె.. దేశ వ్యాప్తంగా 40కు పైగా స్టాల్స్ ను ఏర్పాటు చేసి యువ వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. తొలుత స్కూటీ నుంచి ఇప్పుడు కారు కొనే స్థాయికి చేరుకున్న ఆమె.. తాజాగా తన పానీపూరి బండిని ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించేందుకు మహీంద్రా సంస్థకు చెందిన 'థార్' కారును వినియోగిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా ఆమెను అభినందించారు.
ఆఫ్ రోడ్.. అడ్వెంచర్ వాహనాలను ఇలా ఎందుకు ఉపయోగిస్తారు? అన్న ప్రశ్నను సంధిస్తూనే.. దానికి సమాధానాన్ని ఇచ్చేశారు. సులువుగా వెళ్లేందుకు వీలుగా వాహనదారులు ఈ వాహనాన్ని వాడొచ్చన్న మాటను చెబుతూ.. ''అసాధ్యాన్ని సుసాధ్యం చేయొచ్చు.
ప్రజలు తమ కలను సాకారం చేసుకోవటానికి మా వాహనాలు ఉపయోగపడటం ఆనందకరమైన విషయం. ఈ వీడియో నాకెందుకు నచ్చిందో మీకు అర్థమై ఉంటుంది' అంటూ పోస్టు చేసిన ఈ వీడియోను తక్కువ సమయంలోనే ఐదు లక్షల మందికి పైగా చూడటం ఆసక్తికరంగా మారింది.