వైసీపీ శ్రేణులకు అనంత శ్రీరామ్ క్లారిటీ
ఈ క్రమంలోనే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ వివాదాస్పద పోస్టులు పెడుతున్నారని కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది
By: Tupaki Desk | 15 Aug 2023 7:23 PM GMTఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు, ఫేక్ పోస్టుల బెడద ఎక్కువైంది. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు చాలామంది ఈ ఫేక్ పోస్టులకు బాధితులే...నిజం చెప్పులు వేసుకుని వెళ్లేలోపే..అబద్ధం ఆరు ఊళ్లు తిరిగొస్తుంది ఈ టెక్ జమానాలో. ఇదిగో పులి అంటే అదిగో తోక అన్న రీతిలో సోషల్ మీడియాలో ఫేక్ ప్రోపగాండా ఎక్కువైపోయింది. బ్రతికుండగానే కొందరు సెలబ్రిటీలను చంపేస్తున్నారు నెటిజన్లు. మేం బ్రతికే ఉన్నాం మహా ప్రభో అంటూ అలనాటి స్టార్ కమెడియన్, నటుడు సుధాకర్ స్వయంగా ఒక వీడియో విడుదల చేయాల్సి వచ్చిందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఈ క్రమంలోనే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ వివాదాస్పద పోస్టులు పెడుతున్నారని కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో, అనంత శ్రీరామ్ కు వైసిపి శ్రేణులు వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా ప్రచారం జరిగింది.
అయితే, ఆ పోస్టులతో తనకు సంబంధం లేదని అనంత శ్రీరామ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతేకాదు, తాను నాటా సభలలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లానని, అక్కడి నుంచి వచ్చిన వెంటనే ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అనంత శ్రీరామ్....వైసిపి కార్యకర్తలకు చెప్పారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీసులకు శ్రీరామ్ ఫిర్యాదు చేశారు. అమెరికా నుంచి వచ్చిన వెంటనే మాదాపూర్ జోన్ డిసిపి సందీప్ ని కలిసిన అనంత శ్రీరామ్ అ ఫేక్ ప్రచారంపై ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో పొలిటికల్ మిస్సైల్ అనే పేజీ ద్వారా తన పేరుతో జరిగిన అసత్య ప్రచారానికి కారకులెవరో తెలుసుకొని వారిపై చర్యలు తీసుకోవాలని కోరానని అనంత శ్రీరామ్ వెల్లడించారు. కాగా, అమెరికాలో ఉన్న సమయంలోనే అనంత శ్రీరామ్...వైసీపీ శ్రేణులను ఉద్దేశించి ఒక వీడియో విడుదల చేశారు.
ఒకవేళ తనకు రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశం ఉంటే భవిష్యత్తులో తన అధికారిక సోషల్ మీడియా పేజీలోనే స్పందిస్తానని, ఇటువంటి పేజీలలో కాదని చెప్పారు. వృత్తిరీత్యా తను అన్ని పార్టీలకు సంబంధించిన పాటలు రాస్తుంటానని, తనకు ఏ రాజకీయ పార్టీపై అభిమానం లేదని చెప్పుకొచ్చారు.