సంక్రాంతి స్పెషల్: ఆంధ్రా అల్లుడికి 130 రకాల తెలంగాణ వంటలతో అదరగొట్టారు
కొత్తగా పెళ్లైన వేళలోనూ.. పండక్కి ఊరికి వచ్చే కొత్త అల్లుడికి భారీగా వంటలు చేసి పెట్టే అత్తారింటి ముచ్చట్లు అప్పుడప్పుడు బయటకు వస్తుంటాయి.
By: Tupaki Desk | 13 Jan 2025 4:54 AM GMTమర్యాదలకు గోదారోళ్లు ఎంత ఫేమస్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్తగా పెళ్లైన వేళలోనూ.. పండక్కి ఊరికి వచ్చే కొత్త అల్లుడికి భారీగా వంటలు చేసి పెట్టే అత్తారింటి ముచ్చట్లు అప్పుడప్పుడు బయటకు వస్తుంటాయి. అలాంటి మర్యాదలకు ఈసారి హైదరాబాద్ వేదికైంది. ఆంధ్రా అల్లుడు సంక్రాంతికి హైదరాబాద్ కు వచ్చిన సందర్భంగా 130 రకాల తెలంగాణ వంటకాల్ని చేసి.. అల్లుడి ఎదుట పెట్టేసిన వైనం ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ అయ్యింది.
ఆంధ్రా అల్లుడికి హైదరాబాద్ లోని అత్తారింట్లో మర్యాదలు ఆసక్తికరంగానే కాదు అబ్బురపడేలా ఉన్నాయి. కాకినాడకు చెందిన అల్లుడికి పెళ్లైన తర్వాత పండక్కు ఇంటికి వచ్చిన అల్లుడికి అత్తమామలు 130 రకాల వంటకాలతో భారీ విందును ఏర్పాటు చేసి అబ్బురపరిచారు. హైదరాబాద్ లోని సరూర్ నగర్ సమీపంలోని శారదానగర్ లో ఉండే క్రాంతి - కల్పన దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద కుమార్తెను కాకిడాకు చెందిన మల్లికార్జున్ తో నాలుగు నెలల క్రితమే పెళ్లి చేశారు.
తొలిసారి సంక్రాంతికి అల్లుడు తమ ఇంటికి వస్తున్న వేళ.. అతగాడ్ని సర్ ప్రైజ్ చేసేందుకు భారీ విందును సిద్ధం చేశారు. అతగాడికి తెలీకుండానే 130 రకాల భారీ మెనూను ప్రిపేర్ చేసి.. భోజనం కోసం రమ్మని చెప్పి.. భారీ విస్తరాకులో వడ్డించిన ఈ వంటల్ని చూసి అవాక్కు కావటం అల్లుడి వంతైందని. ఇందులో పిండి వంటలతో పాటు నాన్ వెజ్ వంటకాలు కూడా ఉన్నాయి. అల్లుడా మజాకానా.