అసెంబ్లీ ఆవరణలో ఎంతకు తెగించారు రా?
జేబు దొంగలు ఉంటారు జాగ్రత్త అని రైల్వేస్టేషన్లు, ఆర్టీసీ కాంప్లెక్స్, ఇతర బహిరంగ ప్రదేశాల్లో చూస్తుంటాం.
By: Tupaki Desk | 3 April 2025 4:39 AMజేబు దొంగలు ఉంటారు జాగ్రత్త అని రైల్వేస్టేషన్లు, ఆర్టీసీ కాంప్లెక్స్, ఇతర బహిరంగ ప్రదేశాల్లో చూస్తుంటాం. కొందరి ఫొటోలు కూడా పోలీసులు ప్రచురిస్తుంటారు. వీరంతా ప్రొఫెషనల్ దొంగలు. వేరే పని చేతికాకో, అలవాటు ప్రకారమో దొంగతనాలు చేస్తుంటారు. అయితే ఇలాంటి సాధారణ దొంగలు చొరబడలేని ప్రదేశంలో కూడా జేబులు గుళ్ల అవుతుంటే ఏమనుకోవాలి. కట్టుదిట్టమైన భద్రత ఉండే రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ ఆవరణలో దొంగలు చొరబడ్డారు. బయటి నుంచి వచ్చారో? లోపలే ఉండి తమ హస్తలాఘవానికి పనిచెప్పారో కానీ బుధవారం జరిగిన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారంలో అధికార పార్టీ నేతలు సుమారు రూ.4 లక్షల రూపాయలు దోచుకున్నారు. జేబులో పెట్టిన డబ్బు క్షణాల్లోనే మాయమవడంతో నేతలు కంగుతిన్నారు. శుభమా.. అంటూ పదవీ స్వీకారం చేస్తుండగా, ఇదేం ఖర్మ అంటూ తలబాదుకుంటున్నారు.
రాష్ట్ర అసెంబ్లీలో దొంగలు చొరబడ్డారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఐదుగురు కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా తమ చేతివాటం ప్రదర్శించారు. దాదాపు రూ.4 లక్షలు చాకచక్యంగా కొట్టేశారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అత్యంత భద్రత ఉండే సచివాలయం ఆవరణలోకి దొంగలు ఎలా చొరబడ్డారంటూ చర్చ జరుగుతోంది. ఇదేమైనా ఇంటి దొంగల పనేమోనని పోలీసులు విచారిస్తున్నారు. సాదీసీదా దొంగలకు తలదన్నేలా ఈ బడా చోరులు చేసిన పనికి టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు రూ.10 వేలు పోగొట్టుకున్నారు. స్వతహాగా న్యాయవాది అయిన ఆయన అసెంబ్లీ ఆవరణలోనే చోరీ జరగడంతో షాక్ తిన్నారు. ఇక ఆయన గన్ మన్ జేబునూ దొంగలు గుళ్ల చేశారు. అతని వద్ద నుంచి రూ.40 వేలు లాగేశారు. హైకోర్టు న్యాయవాది ఒకరి నుంచి రూ.50 వేలు, మరో వ్యక్తి జేబులోని రూ.32 వేలు కాజేశారు.
ఇలా మొత్తం ఐదుగురు ఎమ్మెల్సీలు ప్రమాణస్వీకారం చేస్తే, వారి అనుచరులు, కార్యకర్తలు భారీగా అసెంబ్లీకి తరలివచ్చారు. ఇందులో బయటి వారు చొరబడ్డారో? లేక చోరబుద్ధి ఉన్న వారు లోపలే ఉన్నారో కానీ దాదాపు రూ.4 లక్షలు మాయమయ్యాయంటూ వార్తలు వెలువడ్డాయి. ఈ సంఘటన రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసెంబ్లీ ఆవరణలోనే ఎంతకు తెగించారంటూ అంతా చర్చించుకుంటున్నారు.