చిల్లర దేవుళ్లు... 'గ్రాడ్యుయేట్' ఎన్నికల్లో చిత్రాలు ..!
ఇక, ఇప్పుడు చదువుకున్నవారే... ఓటు వేయాల్సి రావడం.. వారంతా డబ్బులు ఆశించరన్న అభిప్రాయం.. పార్టీల్లో నెలకొంది.
By: Tupaki Desk | 20 Feb 2025 5:30 AM GMTమరో వారం రోజుల్లో ఏపీలోని రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి అభ్యర్థులు పట్టభద్రులైన ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఎక్కడికి వెళ్లినా.. అభ్యర్థులకు `చిల్లర` సమస్య వెంటాడుతోంది. `మాకేంటి?` అని చాలా మంది గ్రాడ్యుయేట్లు ప్రశ్నిస్తున్న తీరుతో అందరూ నివ్వెర పోతున్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ నేతలు చేసిన ఖర్చు అనధికారికంగా రూ.50 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. అయినా.. చాలా మంది ఓడిపోయారు.
ఇక, ఇప్పుడు చదువుకున్నవారే... ఓటు వేయాల్సి రావడం.. వారంతా డబ్బులు ఆశించరన్న అభిప్రాయం.. పార్టీల్లో నెలకొంది. కానీ.. వైసీపీ ప్రధానంగా పోటీలో లేకపోయినా.. రెండు కీలక స్థానాల్లోనూ పోటీ చేసే వారి సంఖ్య మాత్రం ఎక్కువగా ఉంది. దీంతో ఎవరు గెలిచినా.. బొటా బొటి మెజారిటీ తప్ప.. పెద్దగా భారీ మెజారిటీ లభించే అవకాశం లేదు. దీంతో ప్రతి ఓటూ కీలకంగా మారింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 38 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. టీడీపీ తరఫున మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బరిలో ఉన్నారు.
కానీ, ఈయనపై వైసీపీ పోటీ లేకపోయినా.. స్వతంత్రులు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన వారు ఉన్నారు. దీనికితో డు.. వైసీపీ నాయకులు.. పరోక్షంగా కమ్యూనిస్టులకు మద్దతు ఇస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఫలితంగా.. ఇక్కడ ఓటుకు రూ.3000 నుంచి రూ.5000 వవరకు పలుకుతున్నట్టు టీడీపీలో నాయకుల మధ్య చర్చ సాగుతోంది. అయితే.. అంత ఇచ్చుకునే పరిస్థితి ఉందా? అనేది ప్రశ్న. ముఖ్యంగా పట్టభద్రులైన నిరుద్యోగుల నుంచి ఈ డిమాండ్ ఎక్కువగా ఇస్తోంది. దీంతో వీరిని ప్రసన్నం చేసుకునేందుకు.. నానా తిప్పలు పడుతున్నారు.
ఇక ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనూ చిల్లర దేవుళ్లకు కొదవలేదన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇక్కడ ఓటుకు రూ.2000 నుంచి గరిష్ఠంగా రూ.4000 వరకు పలుకుతోంది. ఒకే ఇంట్లో ఇద్దరుముగ్గురు ఓటర్లు ఉంటే.. రూ.10000 వేలు డిమాండ్ చేస్తున్న పరిస్తితి కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రచారం చేస్తున్నా.. దేనిదారి దాందే అన్నట్టుగా చదువుకున్న వారు కూడా ఓటుకు నోటు కావాలని పట్టుబడుతుండడంతో ఇతర పార్టీల సంగతి ఎలా ఉన్నా.. టీడీపీ నాయకులు మాత్రం తర్జన భర్జనలో ఉన్నారు. ఇక, కమ్యూనిస్టులు సమస్యలను ప్రస్తావిస్తున్నారు.
నిరుద్యోగ సమస్యపై పోరాడతామని.. వారు హామీ ఇస్తున్నారు. ఇక, టీడీపీ నాయకులు నిరుద్యోగ భృతి విషయాన్ని ప్రచారం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎలా చూసుకున్నా.. చిల్లర దేవుళ్ల హవా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ ప్రభావం చూపుతుందన్న అంచనాలు వస్తున్నాయి.