Begin typing your search above and press return to search.

చంద్రబాబు, కీరవాణి.. తెలంగాణ అసెంబ్లీలో ‘ఆంధ్రా’లొల్లి

తెలంగాణ శాసనమండలిలో ఒకేరోజు ఆంధ్రా వాదంపై బీఆర్ఎస్ వ్యతిరేకత వ్యక్తం చేసింది. కీరవాణిని తీసుకొచ్చి కల్వకుంట్ల కవిత.

By:  Tupaki Desk   |   15 March 2025 3:32 PM IST
చంద్రబాబు, కీరవాణి.. తెలంగాణ అసెంబ్లీలో ‘ఆంధ్రా’లొల్లి
X

తెలంగాణ శాసనమండలిలో ఒకేరోజు ఆంధ్రా వాదంపై బీఆర్ఎస్ వ్యతిరేకత వ్యక్తం చేసింది. కీరవాణిని తీసుకొచ్చి కల్వకుంట్ల కవిత. చంద్రబాబును ముందుపెట్టి పల్లా రాజశ్వర్ రెడ్డి మాటల మంటలు రాజేశారు. 'జయజయహే తెలంగాణ'ను రాష్ట్ర గీతంగా గుర్తించడంపై హర్షం వ్యక్తం చేస్తూనే, దీనికి ఆంధ్రప్రదేశ్ కు చెందిన సంగీత దర్శకుడు సంగీతం అందించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ అస్తిత్వం కోసం ఎంతో పోరాటం చేశామని, రాష్ట్రంలో ప్రతిభావంతులైన సంగీత దర్శకులు ఉన్నప్పటికీ, కీరవాణి వంటి వారిని తీసుకురావడం సరికాదని ఆమె విమర్శించారు. ఈ విషయంపై తెలంగాణ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోందని ఆమె తెలిపారు. అయితే, కీరవాణిపై తమకు పూర్తి గౌరవం ఉందని కవిత స్పష్టం చేశారు.

* చంద్రబాబు మాట రేవంత్ వింటున్నాడంటూ బీఆర్ఎస్ ఆరోపణలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కృష్ణా నది యాజమాన్య సంస్థ (కేఆర్ఎంబీ) వ్యవహారంపై చర్చ జరిగింది. బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ, కేఆర్ఎంబీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

"కేఆర్ఎంబీ పరిస్థితి ఎలా ఉందంటే, చంద్రబాబు చెబితే కూర్చుంటారు, చంద్రబాబు చెబితే నిలబడతారు. అంతా ఆయన చెప్పినట్టే చేస్తున్నారు. దీనివల్ల మన ప్రజలకు నీటి కష్టాలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసినా సీఎం రేవంత్ రెడ్డి ఏమీ చేయడం లేదు. తెరవెనుక ఏదో జరుగుతోందనే అనుమానాలు కలుగుతున్నాయి. అంతా చంద్రబాబు చెప్పినట్టే చేస్తే, కేఆర్ఎంబీని చంద్రబాబు ఎంబీగా మార్చేయాలి" అని పల్లా రాజేశ్వరరెడ్డి వ్యంగ్యంగా అన్నారు.

హైదరాబాద్ ప్రజలకు త్రాగునీటి కొరత కూడా మొదలైందని ఆయన తెలిపారు. దీనికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందిస్తూ, పల్లా రాజేశ్వరరెడ్డి బీఆర్ఎస్ కళ్లద్దాలు పెట్టుకుని మాట్లాడుతున్నారని విమర్శించారు. నీటి కొరత లేనప్పుడు హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయని పల్లా ప్రశ్నించారు, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రి భట్టి విక్రమార్క జోక్యం చేసుకుని, పల్లా విజ్ఞానవంతుడని అనుకున్నామని, కానీ ఆయన బీఆర్ఎస్ మైక్‌లో మాట్లాడుతున్నారని అన్నారు.

ఇటు కవిత, అటు పల్లా ఇద్దరూ కూడా ఆంధ్రా మూలాలపై మరోసారి అసెంబ్లీ వేదికగా గళమెత్తడం చిచ్చు రేపింది. కాంగ్రెస్ ను టార్గెట్ చేసి చంద్రబాబు, కీరవాణిని లాగి ఆంధ్రుల ఆధిపత్యాన్ని ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. మరి ఈ వివాదం ఎటువైపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.