లిక్కర్ కేసుపై ఫోకస్... వైసీపీలో రాజకీయ ప్రకంపనలు
లిక్కర్ కేసు అంటే అందరికీ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ హయాంలో సాగించిందని అంతా ఆరోపిస్తున్న లిక్కర్ స్కాం గుర్తుకు వస్తుంది.
By: Tupaki Desk | 19 March 2025 5:00 AM ISTలిక్కర్ కేసు అంటే అందరికీ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ హయాంలో సాగించిందని అంతా ఆరోపిస్తున్న లిక్కర్ స్కాం గుర్తుకు వస్తుంది. నిజానికి ఏపీలో అంతకంటే పెద్ద లిక్కర్ స్కాం సాగిందని ఆనాడు వైసీపీ ప్రభుత్వం మీద ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేశాయి.
ఎందుకంటే దేశమంతా డిజిటల్ కరెన్సీ సాగుతున్న కాలంలో కూడా నగదుతో మద్యం అమ్మకాలు జోరుగా చేశారన్నది లాజికల్ గా పెద్ద విమర్శగా ఉంది. అవును నిజమే కదా అని ఎవరైనా అనుకునే విమర్శ ఇది. అంతే కాదు గత వైసీపీ ప్రభుత్వం లిక్కర్ అమ్మకాల విషయంలో పారదర్శకంగా వ్యవహరించలేదు అన్నది కూడా మరో విమర్శగా చేస్తూ వచ్చారు.
ఇక ప్రభుత్వమే మద్యం అమ్మకాలను జరిపించింది. నాసి రకం మద్యం అమ్మకాలు చేశారు అని విమర్శలు వచ్చాయి. ఒక ధర అంటూ లేకుండా అధిక ధరలకు మద్యం అమ్మకాలు చేశారని ఇలా వచ్చిన డబ్బు అంతా లెక్కా జమా లేకుండా ఎక్కడికో పోయింది అన్నదే అతి పెద్ద విమర్శ.
ప్రభుత్వం నడిపే మద్యం దుకాణాలలో ప్రైవేట్ సిబ్బందికి నియమించడం ద్వారా విచ్చలవిడిగా జరిపిన అమ్మకాలు మీద కూటమి ప్రభుత్వం ఇపుడు ఫుల్ ఫోకస్ పెట్టేసింది. దీని మీద లోతైన విచారణను జరపాలని నిర్ణయించింది.
వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లుగా లిక్కర్ స్కాం విషయంలో కొన్ని కూపీలను ఏకంగా ఒకనాటి వైసీపీ సన్నిహితుడు అగ్ర నేత అయిన విజయసాయిరెడ్డి ఇటీవల మీడియా సాక్షిగా బయటపెట్టడంతో ప్రభుత్వం తన దూకుడు మరింతగా పెంచిందని అంటున్నారు.
వైసీపీ ఐటీ సలహాదరుడిగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కీలకమైన పాత్ర పోషించారు అని బయటపెట్టడంతో దీని మీద కూటమి సర్కార్ సీరియస్ గానే ఉంది అని అంటున్నారు. ఇంతకీ ఈ కసిరెడ్డి ఎవరు అన్నది కూడా అంతా చర్చిస్తున్నారు. ఆయన వైసీపీలో పెద్దగా బయటకు వినిపించే పేరున్న నేత కాదని అయితే ఆయన పాత్రధారి అయితే సూత్రధారులు వైసీపీలో అగ్ర నేతలు చాలా మంది ఉంటారని భావిస్తూ కూటమి ప్రభుత్వం దూకుడు చేస్తోంది.
కాస్తా ఆలస్యం అయినా పూర్తి వాస్తవాలతో పక్కగా ఈ లిక్కర్ స్కాం లో అన్ని విషయాలు బయటపెట్టి అసలైన వారిని జనం ముందుకు తేవాలని కూటమి పెద్దలు నిర్ణయించారని అంటున్నారు. దాంతో మరోసారి విజయసాయి రెడ్డికి సీఐడీ నుంచి పిలుపు వచ్చిందని అంటున్నారు. ఈ నెల 25న ఆయన తమ ముందు హాజరు కావాలని కోరుతున్నారని తెలుస్తోంది.
కాకినాడ పోర్టు వ్యవహరంతో పాటు ఈ విషయాల మీద ఆయన నుంచి అవసరమైన సమాచారాన్ని రాబడతారని అంటున్నారు. ఆయన కూడా తనకు తెలిసిన సమాచారాన్ని ఎటూ మీడియాకు చెబుతున్నారు కాబట్టి మరింత సమాచారం కనుక దర్యాప్తు సంస్థలకు అందించినట్లు అయితే మొత్తానికి మొత్తం వైసీపీలో రాజకీయ ప్రకంపనలు రేగడం ఖాయమని అంటున్నారు.
ఇక రానున్న కాలంలో వరసబెట్టి వైసీపీ కీలక నేతలను విచారించేందుకు కూడా అవసరమైన పూర్వ రంగం సిద్ధం అవుతోంది అని అంటున్నారు. ముందుగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని విచారిస్తే కనుక వెనక ఉన్న వారు అంతా బయటకు వస్తారని అంటున్నారు.
కసిరెడ్డి విషయంలో దర్యాప్తు సంస్థల వద్ద ఇప్పటికే కీలక సమాచారం ఉందని అంటున్నారు. ఆయన విదేశాలలోనూ మద్యం దుకాణాలను నడిపిన అనుభవం కలిగి ఉన్నారని చెబుతున్నారు. ఆ అనుభవంతోనే ఆయన ఏపీలో జరిగినట్లుగా భావిస్తున్న లిక్కర్ స్కాం లో ఉన్నారా అన్న కోణంలోనూ విచారణ జరుపుతారని అంటున్నారు.
ఇంతకీ ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎవరూ అని ఆరా తీస్తున్న దర్యాప్తు సంస్థలకు ఆయన వైసీపీ అధినాయకత్వానికి దగ్గర వారని ఆప్తుడని కూడా తెలిసిందని అంటున్నారు. దాంతో కసిరెడ్డితోనే మొత్తం వ్యవహారం అన్నట్లుగా దర్యాప్తు సంస్థలు దూకుడు చేయడం ఖాయమని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ఈ లిక్కర్ స్కాం లో తన పేరుని ప్రచారంలోకి తేవడంతో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించారు. ఇక మిగిలిన వైసీపీ అగ్ర నేతలు కూడా ఎవరి పేరు చెబుతారో ఈ తీగ ఎక్కడ దాకా పాకుతుందో అన్న ఆందోళనలో ఉన్నారని అంటున్నారు. చూడాలి మరి ఏపీలో లిక్కర్ స్కాం బ్లాస్ట్ అయితే ఆ ప్రకంపనలు ఏ రేంజిలో ఉంటాయో.