మీరు మీరు వియ్యంకులు.. సభలో అయ్యన్న చలోక్తులు
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సరదా సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. సభలో మొత్తం కూటమి ఎమ్మెల్యేలు ఉంటున్నారు.
By: Tupaki Desk | 6 March 2025 1:22 PM ISTఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సరదా సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. సభలో మొత్తం కూటమి ఎమ్మెల్యేలు ఉంటున్నారు. మొత్తం మూడు పార్టీల వారు మిత్రపక్షాలే కావడంతో సభ ఏకపక్షంగా జరుగుతోందని ఎవరైనా అనుకుంటారు. కానీ, ప్రతిపక్షం రాకపోవడంతో అధికార పక్ష సభ్యులే విపక్ష నేతల్లా వ్యవహరిస్తున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నలు వేస్తూ మంత్రుల నుంచి సమాధానాలు రాబట్టుకుంటున్నారు. ఇదే సమయంలో సభ్యులు, మంత్రుల మధ్య సమన్వయకర్తలా స్పీకర్ వ్యవహరిస్తున్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామక్రిష్ణం రాజు ఇద్దరూ సభను సీరియస్ గా నడుపుతూ మధ్యమధ్యలో జోకులు పేల్చుతుండటం ఆహ్లాదం పంచుతోంది. ఈ క్రమంలోనే గురువారం సభలో ఓ ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది.
భోగాపురం విమనాశ్రయానికి అనుబంధంగా రహదారులు నిర్మాణంపై విశాఖ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామక్రిష్ణబాబు, విష్ణుకుమార్ రాజు ప్రశ్నలు వేశారు. దీనికి సమాధానంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ సభ్యులు లేవనెత్తిన సమస్యలపై చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై జోక్యం చేసుకున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. గంటా శ్రీనివాసరావును చూస్తూ మీరు మీరు వియ్యంకులు ఏదైనా ఉంటే మంత్రి నారాయణతో మాట్లాడొచ్చు కదా? అని చమత్కరించడంతో సభలో నవ్వులు విరిసాయి.
విమానశ్రయం రోడ్డు కోసం ప్రశ్నించిన ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి, టీడీపీ సభ్యులు కాగా, విష్ణుకుమార్ రాజు మిత్రపక్షం బీజేపీ ఎమ్మెల్యే. ఇక స్పీకర్ అయ్యన్నపాత్రుడిది ఉమ్మడి విశాఖ జిల్లా కావడం గమనార్హం. అదేవిధంగా మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వియ్యంకులు కావడం విశేషం. అందరికీ భోగాపురం విమానాశ్రయం ఎంతో ముఖ్యం. ప్రభుత్వం కూడా విశాఖలో అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయం ఉండాలని వేగంగా పనులు చేయిస్తోంది. ఇదే సమయంలో ప్రస్తుతం విశాఖలో ఉన్న విమానాశ్రయం కూడా తెరిచే ఉంచాలని ప్రజలు కోరుతున్నట్లు గంటా చెప్పారు. విశాఖ మెట్రో ప్రారంభమయ్యేవరకు విమానాశ్రాన్ని యథావిధిగా కొనసాగించాలని ప్రజలు కోరుతున్నట్లు సభలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. విశాఖ విమానాశ్రయం కోసం ప్రజలు ఉద్యమించాలని ప్రజలు తనను కోరుతున్నారని, కానీ తాము కూటమి ఎమ్మెల్యేలు కనుక ఉద్యమాలు చేయకూడదని ప్రజలకు చెప్పానంటూ సరదాగా వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన స్పీకర్ కూడా మనం ఉమ్మడిగా ఉన్నాం ఉద్యమాలు చేయడానికి వీలు లేదంటూ సంభాషణను ముగించారు.