ఏపీ బీజేపీ భారం ఆ ఇద్దరి మీద ?
ఏపీలో బీజేపీ పాత కాపులను పక్కన పెడుతున్నట్లుగా కనిపిస్తోంది. చాలా కాలంగా చూస్తే బీజేపీ ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్ నేతలకే అధ్యక్ష పీఠం ఇస్తూ వస్తోంది.
By: Tupaki Desk | 23 Jan 2025 2:45 AM GMTఏపీలో బీజేపీ పాత కాపులను పక్కన పెడుతున్నట్లుగా కనిపిస్తోంది. చాలా కాలంగా చూస్తే బీజేపీ ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్ నేతలకే అధ్యక్ష పీఠం ఇస్తూ వస్తోంది. విభజన తరువాత ఏపీ బీజేపీకి తొలి ప్రెసిడెంట్ అయిన వారు కంభంపాటి హరిబాబు. ఆయన మొదటి నుంచి బీజేపీలో ఉన్న నాయకుడు.
ఆయన తరువాత బీజేపీ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు చాన్స్ ఇచ్చింది. ఆయన కాంగ్రెస్ నుంచి అలా కండువా కప్పుకోవడమేటి ఇలా కాషాయం పార్టీ బాధ్యతలు అప్పగించింది. అలా చేయడం బీజేపీలో తొలిసారి. మధ్యలో సోము వీర్రాజు లాంటి ఆరెస్సెస్ మూలాలు ఉన్న నేతకు రెండేళ్ళ పాటు పార్టీ పగ్గాలు అందించినా ఎన్నికల వేళకు మాత్రం దగ్గుబాటి పురంధేశ్వరికి బాధ్యతలు అప్పగించింది. ఆమె కూడా బీజేపీలో మొదటి నుంచి ఉన్న వారు కాదు, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన వారు.
ఇపుడు ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన కేంద్ర మంత్రిగా చేసారు. రెండు సార్లు టీడీపీ తరఫున రాజ్యసభకు ఎన్నిక అయ్యారు. ఆయన 2024 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.
ఆయనకు రాష్ట్ర మంత్రి పదవి దక్కుతుంది అనుకుంటే ఆ చాన్స్ లేకుండా పోయింది. దాంతో ఆయనను ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా చేస్తారు అని టాక్ నడుస్తోంది. ఏపీ బీజేపీకి అంగబలం అర్ధ బలం సమకూర్చగల నాయకుడిగా ఆయన పేరుని ఎంపిక చేశారు అని అంటున్నారు.
ఇక ఏపీ బీజేపీ నుంచి చూస్తే మరో దిగ్గజ నేత చక్రం తిప్పుతున్నారు. ఆయన ఎవరో కాదు అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచిన సీఎం రమేష్. ఆయన కేంద్ర బీజేపీ నేతలకు బాగా దగ్గర వారిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ వస్తే తానే మొత్తం అయి సభను సూపర్ సక్సెస్ చేశారు అన్న పేరు తెచ్చుకున్నారు.
అంగబలం అర్ధబలంలో ఆయన బిగ్ షాట్ అని అంటారు. అందుకే ఆయనకు బీజేపీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది అని అంటారు. మరోవైపు చూస్తే సీఎం రమేష్ కి రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవిని ఇచ్చారు. జమిలి ఎన్నికల మీద వేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలో నియమించారు.
ఇపుడు సుజనాకు కూడా ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగిస్తే ఈ ఇద్దరి బిగ్ షాట్స్ చేతులలో ఏపీ కమలం పార్టీని ఉంచుతారు అని అర్ధం చేసుకోవాలని అంటున్నారు. ఈ ఇద్దరూ సుదీర్ఘ కాలం టీడీపీలో పనిచేసారు. ఈ ఇద్దరూ టీడీపీకి బ్యాక్ బోన్స్ గా ఎంతో కీలకంగా వ్యవహరించారు.
ఇపుడు ఈ ఇద్దరి సేవలను బీజేపీ అంతే స్థాయిలో వినియోగించుకోవాలని చూస్తోంది అని అంటున్నారు. ఏపీలో ఎదగాలని బీజేపీకి ఎన్నో ఆశలు ఉన్నాయి. అవి ఫలించాలి అంటే అంగ బలం అర్ధబలం ఉన్న వారికే పార్టీ పగ్గాలు అప్పగించాలన్నది బీజేపీ కేంద్ర పెద్దల వ్యూహంగా ఉంది అని అంటున్నారు.
మొత్తం మీద చూస్తే మాత్రం ఏపీలో బీజేపీ ప్రాంతీయ పార్టీలతో ధీటుగా ఎదిగేందుకు తగిన విధంగానే ప్రణాళికలను రచిస్తోంది అని అంటున్నారు. ఇక బీజేపీలో పాత కాపుల సంగతి ఏమిటి అంటే అది ఆలోచించాల్సిందె అని అంటున్నారు.