Begin typing your search above and press return to search.

ఓర్వకల్లులో దేశంలోనే తొలి డ్రోన్ సిటీ

విజయవాడ నోవాటెల్ హోటల్ డ్రోన్ పరిశ్రమల ఏర్పాటు అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

By:  Tupaki Desk   |   24 Jan 2025 12:56 PM GMT
ఓర్వకల్లులో దేశంలోనే తొలి డ్రోన్ సిటీ
X

కర్నూలు జిల్లా ఓర్వకల్లులో దేశంలోనే తొలి డ్రోన్ సిటీ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక్కడ పరిశ్రమలు పెట్టేవారికి సింగిల్ విండో అనుమతులు ఇవ్వడంతోపాటు మరికొన్ని పారిశ్రామిక ప్రోత్సహాకాలు ఇవ్వనున్నట్లు ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దినేశ్ కుమార్ వెల్లడించారు. విజయవాడ నోవాటెల్ హోటల్ డ్రోన్ పరిశ్రమల ఏర్పాటు అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో పలు కీలక విషయాలను సీఎండీ దినేశ్ కుమార్ తెలిపారు.

ఓర్వకల్లులో డ్రోన్ సిటీ నిర్మాణానికి 300 ఎకరాల స్థలం సిద్ధం చేసినట్టు సీఎండీ దినేశ్ కుమార్ చెప్పారు. దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న ఈ డ్రోన్ సిటీలో తయారీ, సేవలు, విడిభాగాల యూనిట్లు ఒకే చోట ఉంటాయని చెప్పారు. సుమారు 40 వేల మందికి ఉపాధి కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. డ్రోన్ తయారీదారులకు సౌకర్యంగా ఉండేందుకు ఓర్వకల్లులో అతిపెద్ద కామన్ టెస్టింగ్ ఫెసిలిటీని కల్పిస్తున్నట్లు చెప్పారు. చైనా, బెల్జియం, అమెరికా వంటి దేశాలకు దీటుగా ఓర్వకల్లులో డ్రోన్ తయారీ పరిశ్రమలు స్థాపించాలని కోరారు. అందుకు అవసరమైన ప్రోత్సహాకాలను ప్రభుత్వం తరఫున సమకూర్చుతామని హామీ ఇచ్చారు. అదేవిధంగా యూనిట్ల ఏర్పాటుకు తగిన మ్యాన్ పవర్ అందుబాటులోకి తెచ్చేవిధంగా ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీల్లో విద్యార్థులకు తగిన నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా కర్నూలులోని ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ భాగస్వామ్యంతో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.

ఓర్వకల్లుతోపాటు రాష్ట్రంలో ఎక్కడైనా డ్రోన్ తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయొచ్చని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసినా అవసరమైన ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా సరళంగా అనుమతులు మంజూరు చేస్తామని వివరించారు. ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టేవారికి ఎలాంటి ప్రోత్సాహాకాలు ఇస్తామో అదేవిధంగా డ్రోన్ పరిశ్రమలకూ ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు.

ప్రస్తుతం అన్ని రంగాల్లో డ్రోన్ వినియోగం పెరిగిందని సీఎండీ దినేశ్ కుమార్ తెలిపారు. డ్రోన్ల ద్వారా ప్రభుత్వం కూడా మెరుగైన సేవలు అందిస్తోందని తెలిపారు. అత్యావసర పరిస్థితుల్లో డ్రోన్ ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. అదేవిధంగా డ్రోన్ రంగంలో పెద్ద ఎత్తున ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, డీప్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని చెప్పారు.