ఉచిత బస్సుకు బ్రేకులు వేస్తున్నట్లేనా ?
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం బడ్జెట్ ని తాజాగా అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
By: Tupaki Desk | 1 March 2025 5:30 PM GMTఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం బడ్జెట్ ని తాజాగా అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఏకంగా 3 లక్షల 22 వేల పై దాటిన ఈ భారీ బడ్జెట్ లో ఉచిత బస్సు పధకానికి సంబంధించిన ప్రస్తావన ఏదీ లేకపోవడంతో బ్రేకులు పడినట్లేనా అన్న డౌట్లు వ్యక్తం అవుతున్నాయి.
ఏపీలో ఉచిత బస్సు ప్రయాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే బడ్జెట్ లో నిధుల కేటాయింపు జరగాలి కదా అన్న వాదన కూడా ఉంది. నిజానికి చూస్తే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత బస్సు పధకాన్ని ప్రారంభిస్తారు అని అంతా అనుకున్నారు. ఎందుకంటే తెలంగాణా కర్ణాటక లో ఎన్నికల హామీలలో మొదటిదానిగా ఉచిత బస్సుకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి.
పైగా సామాన్య మహిళలను ఆకట్టుకోవాలన్నా ప్రచారం పీక్స్ కి చేరాలన్నా ఇంతకు మించిన భారీ పధకం వేరొకటి లేనే లేదు కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ఆలోచన చేయలేదు దాని కోసం అధ్యయనాలు కమిటీలు నివేదికలు అంటూ కాలం వెళ్ళబుచ్చింది.
అలా ఇతర రాష్ట్రాలలో ఉచిత బస్సు పధకం ఏ తీరున సాగుతుందో అధ్యనం చేయడానికి ఒక కమిటీని వేసింది. ముందుగా అధికారులతో కమిటీని వేసి ఆనక మంత్రులతో కూడా కమిటీని వేసింది. ఇలా ఈ కమిటీలు ఇచ్చిన నివేదికలను చూసిన మీదటనే సర్కార్ ఆలోచనలో పడింది అని అంటున్నారు.
ఉచిత బస్సు పధకం వల్ల రాజకీయ లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని కూడా ఆయా రాష్ట్రాల పరిణామాలు చెబుతున్నాయని అంటున్నారు. అంతే కాదు మరో వైపు చూస్తే ఆటో కార్మికులు దీని వల్ల నష్టపోతున్నారు. పురుష ప్రయాణీకులలో అవేశం కలుగుతోంది.
అలాగే ప్రభుత్వానికి ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఆర్టీసీకి నష్టాలు అలా పెరిగిపోతున్నాయి. దాంతోనే మొదట దసరా నుంచి అనుకున్న ఉచిత బస్సు సంక్రాంతికి అలా ఉగాదికి మారింది కానీ ఇంకా బస్సు రోడ్డెక్కలేదు అని అంటున్నారు.
తాజా బడ్జెట్ లో కూడా ఆ ఊసే లేకపోవడంతో సర్కార్ పునరాలోచనలో పడిందా అన్న చర్చ వస్తోందిట. ఇక ఇతర రాష్ట్రాలలో ఉచిత బస్సు పధకం ద్వారా ప్రభుత్వానికి భారం బాగా పెరిగిందని తెలుస్తోంది. అక్కడ అదనపు బస్సులను కూడా కొనుగోలు చేయడం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించడం తో ఆర్టీసీ చార్జీలు కూడా పెంచాల్సి వచ్చిందని అంటున్నారు.
ఏపీలో చూస్తే ఉచిత బస్సుని జిల్లాలకే పరిమితం చేయాలని చూసినా దానికి కూడా అదనపు సిబ్బంది అవసరం అలాగే అదనపు బస్సులు అవసరం అని అంటున్నారు ఇపుడు ప్రభుత్వం ఉన్న ఈ పరిస్థితులలో అంత ఖర్చు చేయడం కష్టమే అన్న భావన ఉంది. దాంతోనే ఉచిత బస్సు విష్యంలో బ్రేకులు పడ్డాయని అంటున్నారు.
అయితే ఇవి తాత్కాలిక బ్రేకులా లేక పూర్తిగానా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా కర్ణాటక తెలంగాణా ఏపీలలో మహిళలకు ఉచిత బస్సు హామీని ఇచ్చిన పార్టీలు అధికారం అందుకున్నాయి. ఆ రెండు రాష్ట్రాల్లో ఈ పధకం అమలు అయింది. ఏపీలో మాత్రం కాలేదు. మరి దీని మీద కూటమి వేరే ఏ రకమైన ఆలోచన చేసినా మహిళా లోకం ఊరుకుంటుందా అన్నది ఒక చర్చ. ప్రతిపక్షాలు సైతం దీనిని అస్త్రంగా వాడుకోకుండా ఉంటాయా అన్నది మరో చర్చ.