ఏపీలో మారిన భూములు ధరలు.. సామాన్యులు సేఫ్!
దీని ప్రకారం.. కొన్నిప్రాంతాల్లో ఇప్పుడున్న ధరలే ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా ధరలు పెరిగాయి. ఇక, ఇంకొన్ని ప్రాంతాల్లో మాత్రం.. భారీగా పెంచారు.
By: Tupaki Desk | 1 Feb 2025 5:25 PM GMTఏపీలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధరలను సవరిస్తూ.. ఇచ్చిన జీవో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. దీని ద్వారా.. పలు ప్రాంతాల్లోని భూముల ధరలు సగటున 20 శాతం మేరకు పెరిగాయి. ఇదే సమయంలో భూముల రిజిస్ట్రేషన్ ధరలను కూడా ప్రభుత్వం పెంచింది. దీంతో రాష్ట్ర సర్కారుకు భారీగానే ఆదాయం సమకూరనుంది.
ఇక్కడ కీలకంగా.. సామాన్యులపై భారం పడకుండా సర్కారు అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఈ క్రమంలో అధికంగా ఉన్న ధరలను తగ్గించింది. తక్కువగా ఉండి.. మార్కెట్ ధరలు ఎక్కువగా ఉన్న చోట సవరించింది. ఫలితంగా సామాన్య, మధ్యతరగతి జీవులపై పెద్ద ప్రభావం పడకుండా చూసుకుంది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సగటున రిజిస్ట్రేషన్ విలువలు గరిష్ఠంగా 20 శాతం మేరకు పెరిగాయి. నివాస స్థలాలు, వాణిజ్య ప్రాంతా ల్లోని భూములు, నివాసాల ఆధారంగా ప్రభుత్వం భూముల ధరలను సవరించింది. దీని ప్రకారం.. కొన్నిప్రాంతాల్లో ఇప్పుడున్న ధరలే ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా ధరలు పెరిగాయి. ఇక, ఇంకొన్ని ప్రాంతాల్లో మాత్రం.. భారీగా పెంచారు.
ఎక్కడెక్కడ ఎలా.. ఎలా..?
+ విశాఖపట్నంలోని కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచగా.. అనకాపల్లి జిల్లాలో మాత్రం ఇప్పుడు ఉన్న ధరలకే కొనసాగించారు. మొత్తంగా పెంచిన ధరలు 24 నుంచి 32 శాతంగా ఉన్నాయి.
+ విజయవాడలో భూముల ధరలను 10 శాతం పెంచగా.. రిజిస్ట్రేషన్ చార్జీలను మాత్రం 3 శాతం నుంచి 9 శాతం వరకు పెంచారు.
+ కీలకమైన కాకినాడలో వాణిజ్య ప్రాంతాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. గజం ధరను రూ.42 వేల నుంచి రూ.22 వేలకు తగ్గించారు. ఇది సామాన్య, మధ్యతరగతి వర్గాలకుఎంతో మేలు చేయనుంది.
+ ఇక, కోనసీమ, ప్రకాశం జిల్లాల్లోనూ రిజిస్ట్రేషన్ విలువలు పెరిగాయి.
+ గుంటూరు శివారులో ఎకరా పొలం రిజిస్ట్రేషన్ విలువ రూ.1.96 కోట్లు ఉంటే.. ఇప్పుడు మరో రూ.30 లక్షలకు పెంచారు. మొత్తంగా.. చూస్తే ఏపీలో పెరిగిన భూముల ధరల వ్యవహారం.. సర్కారుకు ఆదాయాన్ని సమకూర్చుతుండగా, సామాన్యులు, మధ్యతరగతి వారిపై పెద్ద ప్రభావం, భారం అయితే కనిపించడం లేదు.