Begin typing your search above and press return to search.

వంగవీటికి కొణిదెల చెక్.. ఎమ్మెల్సీ లేనట్లే?

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు శాసన మండలి ఎన్నికల హడావుడి నెలకొంది. ఎమ్మెల్యేల కోటాలో ఐదు స్థానాలకు ఈ నెల 10వ తేదీలోగా నామినేషన్లు దాఖలు చేయాలి

By:  Tupaki Desk   |   8 March 2025 8:00 PM IST
వంగవీటికి కొణిదెల చెక్.. ఎమ్మెల్సీ లేనట్లే?
X

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు శాసన మండలి ఎన్నికల హడావుడి నెలకొంది. ఎమ్మెల్యేల కోటాలో ఐదు స్థానాలకు ఈ నెల 10వ తేదీలోగా నామినేషన్లు దాఖలు చేయాలి. ఐదు సీట్లకు గాను జన సేన ఒకటి తీసుకుంది. ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు నామినేషన్ కూడా వేసేశారు. మిగిలిన నాలుగు సీట్లూ టీడీపీనే తీసుకుంటుందా? బీజేపీకి ఒక స్థానం అయినా ఇస్తుందా? అనేది చూడాలి.

ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే టీడీపీనే నాలుగు ఎమ్మెల్సీ సీట్లనూ తీసుకోనుంది. అయితే, వీటికోసం ఆ పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. ఎంతగా అంటే.. దాదాపు 25 మంది పదవులు కోరుతున్నారు. కనీసం 10 మంది మాత్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. శని, ఆదివారాలు సెలవు దినాలు. నామినేషన్లకు సోమవారం ఒక్క రోజే. దీంతో టీడీపీ అభ్యర్థులు ఎవరనేదానిపై శనివారం నాటికి స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

మరి వంగవీటికి చాన్సుందా?

టీడీపీ ఆశావహుల్లో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా, ఎస్‌.వి.ఎస్‌.ఎన్‌.వర్మ (పిఠాపురం), కొమ్మాలపాటి శ్రీధర్, బీదా రవిచంద్ర, కేఎస్‌ జవహర్, బుద్ధా వెంకన్న, మోపిదేవి వెంకటరమణ, పీతల సుజాత, కేఈ ప్రభాకర్, ఏరాసు ప్రతాప్‌ రెడ్డి, రెడ్డి సుబ్రహ్మణ్యం, మల్లెల లింగారెడ్డి, తిప్పేస్వామి, ప్రభాకర్‌ చౌదరి, పరసా రత్నం, ఏఎస్‌ రామకృష్ణ, మంతెన సత్యనారాయణరాజు, రుద్రరాజు పద్మరాజు, మహ్మద్‌ నజీర్, నాగుల్‌ మీరా తదితరులు ఉన్నారు. కాగా, జనసేన నుంచి నాగబాబును ఎంపిక చేసినందున.. అదే సామాజికవర్గానికి చెందిన నాయకులకు టీడీపీ నుంచి అవకాశం ఇవ్వరని అంటున్నారు.

ఇలాగైతే వంగవీటికి ఈసారీ ఎమ్మెల్సీ లేనట్లే అవుతుంది. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2009లో ప్రజారాజ్యం నుంచి, 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల ముందు అనూహ్యంగా టీడీపీలో చేరి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే, ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమితో వంగవీటికి పదవులు దక్కే చాన్స్ లేకపోయింది. ఇప్పుడు మాత్రం అన్నీ కలిసొచ్చినా సామాజిక సమీకరణాలు అడ్డుపడుతున్నాయి.

గత ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య పొత్తుతో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరులు టికెట్లు త్యాగం చేశారు. వీరిద్దరికీ ఇప్పుడు ఎమ్మెల్సీ దక్కడం ఖాయం అంటున్నారు. మరి మిగతా ఇద్దరిలో వంగవీటి ఉన్నారా? అంటే కష్టమే అంటున్నారు. పైగా వంగవీటి, దేవినేని ఒకే జిల్లాకు చెందినవారు. అలా చూసినా ప్రాంతీయ సమతూకంలో వంగవీటికి ఎమ్మెల్సీ కష్టమేనని చెబుతున్నారు.