కూటమిది ఒక దారి.. బీజేపీది మరోదారా? ఇదేం వింత?!
పైగా ఉమ్మడి కృష్ణాలో ఓ స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్టు బీజేపీ స్థానిక నాయకులు చెప్పడం కలవరపరుస్తున్న వ్యవహారం.
By: Tupaki Desk | 23 Feb 2025 3:00 AM GMTఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేనలు సంయుక్తంగా ముందుకు సాగు తుంటే.. మరో కీలక భాగస్వామి, కేంద్రంలో కొలువు దీరేందుకు ఈ రెండు పార్టీలు సహకరించిన పార్టీ.. బీజేపీ మాత్రం తనదారిలో తాను నడుస్తూ.. చిత్రమైన రాజకీయాలు చేస్తోంది. వాస్తవానికి.. ఇతర విషయాల్లో ఎలా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో కూటమి పార్టీలుగా టీడీపీ, జనసేనలు సంయుక్త నిర్ణయం తీసుకుని .. అభ్యర్థులకు మద్దతు ప్రకటించాయి.
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను టీడీపీ నిర్ణయించగా.. జనసేన కూడా.. ఈ అభ్యర్థికే జై కొట్టింది. ఇక, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పేరాబత్తుల రాజశేఖర్‌ను... టీడీపీ ఎంపిక చేసింది. దీనికి కూడా జనసేన ఓకే చెప్పింది. ఈ రెండు పార్టీ లు ఉమ్మడిగా.. ఈ ఇద్దరు అభ్యర్థులకు మద్దతు ప్రకటించడంతోపాటు.. ప్రచారం కూడా చేస్తున్నాయి. ఒక్కొక్క చోట చిన్నపాటి తప్పులు దొర్లుతున్నా.. అధిష్టానాలు సరిచేస్తున్నాయి.
అయితే.. ఇదే కూటమిలో ఉన్న బీజేపీ మాత్రం.. తన మానాన తను.. మౌనంగా ఉంది. పైగా ఉమ్మడి కృష్ణాలో ఓ స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్టు బీజేపీ స్థానిక నాయకులు చెప్పడం కలవరపరుస్తున్న వ్యవహారం. ఇక, ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే.. అసలు బీజేపీ నాయకులు బయటకే రావడం లేదు. నిజానికి బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి విజయం దక్కించుకున్న రాజమహేంద్రవరం.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే ఉంది. అయినా.. ఇక్కడ బీజేపీ కూటమి అభ్యర్థికి మద్దతు ప్రకటించలేదు.
మరో నాలుగు రోజుల్లోనే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నెల 27న మొత్తంగా మూడు ఎమ్మె ల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఒకవైపు టీడీపీ నేతలు.. ప్రచారంలో నిమగ్నమయ్యారు. వీరికి జనసేన నాయకులు కూడా అధినేత ఆదేశాను సారం.. తోడయ్యారు. కానీ, బీజేపీ జెండా కానీ పార్టీ నాయకులు కానీ.. ఎక్కడా కనిపించడం లేదు. దీంతో కూటమిలో బీజేపీ దారి సెపరేటా? అనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతుండడం గమనార్హం. పోలింగ్‌కు నాలుగు రోజులే గడువు ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా కమల నాథులు కలసి మెలిసి ఉంటారో లేదో చూడాలి.