'తెల్లారుతూనే తలుపు తట్టారు' 70 శాతం పూర్తి!
దీంతో మంగళవారం ఉదయం 9 గంటలకే రాష్ట్ర వ్యాప్తంగా 70 శాతం ఎన్టీఆర్ భరోసా-సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమం పూర్తయినట్టు అధికారులు వెల్లడించారు.
By: Tupaki Desk | 31 Dec 2024 7:54 AM GMTఏపీలో డిసెంబరు 31.. మంగళవారం తెలతెల వారుతూనే తలుపులు శబ్దాలు చేశాయి. చలిగుప్పిట్లో చిక్కి న మన్యం నుంచి చలి దుప్పట్లో మగ్గిన నగరాల వరకు కూడా.. ఉదయం 6 గంటలకే సామాజిక భద్రతా పింఛన్ల లబ్ధిదారుల ఇళ్లకు సచివాలయ సిబ్బంది క్యూ కట్టారు. ఎప్పటిలాగానే వారితో వేలిముద్రలు వేయించుకుని.. సొమ్ములు చేతిలో పెట్టారు. ఈ ఆశ్చర్య ఘటనకు లబ్ధిదారులు ముగ్ధులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఉదయం నుంచే సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ ప్రారంభించారు.
సీఎం చంద్రబాబు స్వయంగా పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆయనే స్వయంగా పింఛన్లు పంపిణీ చేసి.. సభలో ప్రసంగించనున్నారు. కానీ, దీనికి ముందే సచివాలయ సిబ్బందిని అధికారులు రంగంలోకి దింపారు. కొత్త సంవత్సరానికి ఒక్కరోజు ముందే.. జనవరి నెలకు సంబంధించిన పింఛన్ల సొమ్మును అందించేలా ఏర్పాట్లు చేశారు. దూర ప్రాంతాలకు సోమవారం రాత్రే సొమ్ములు చేరవేశారు.
దీంతో మంగళవారం ఉదయం 9 గంటలకే రాష్ట్ర వ్యాప్తంగా 70 శాతం ఎన్టీఆర్ భరోసా-సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమం పూర్తయినట్టు అధికారులు వెల్లడించారు. ఇదేసమయంలో పింఛన్ల తొలగింపు విషయాన్ని కూడా ప్రస్తావించారు. అనర్హులైన వారిని మాత్రమే తొలగిస్తామని పింఛన్ల లబ్ధిదారులకు చెప్పినట్టు వెల్లడించారు. మిగిలిన వారు ధైర్యంగా ఉండొచ్చని.. పింఛన్ల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయడంలేదని అధికారులు స్వయంగా చెప్పుకొచ్చారు.