Begin typing your search above and press return to search.

వామపక్షాలతో వైసీపీ దోస్తీకి తొలి ప్రయత్నం !

వైసీపీ సీనియర్ నాయకుడు ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి అమరావతి ప్రాంతానికి పెట్టే ఖర్చులో పది శాతం అయినా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

By:  Tupaki Desk   |   9 Feb 2025 4:30 PM GMT
వామపక్షాలతో వైసీపీ దోస్తీకి తొలి ప్రయత్నం !
X

ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి. ఢిల్లీలో బీజేపీ గెలవడం కాషాయ ప్రభలు అప్రతిహతంగా దేశవ్యాప్తంగా కొనసాగుతూండడంతో అది ప్రాంతీయ పార్టీల మనుగడకే ప్రమాద సంకేతాలను సూచిస్తోంది. ఈ క్రమంలో ఏపీలో తటస్థ వాదంతో ఉన్న వైసీపీ తన రాజకీయ బలం పెంచుకునే ప్రయత్నంలో ఉందా అన్న చర్చ సాగుతోంది.

సిం హం సింగిల్ అన్న స్లోగన్ కి 2024 ఎన్నికల్లో కాలం చెల్లిందనే అంటున్నారు. మూడు పార్టీల కూటమి వైసీపీ ఆశలను నిలువునా ముంచేసింది. ఇప్పట్లో ఈ కూటమి విచ్చిన్నం అయ్యే సూచనలు లేవు. దాంతో 2029లో ఎన్నికలు జరిగినా దానికి ముందు జరిగినా కూడా కూటమితో వైసీపీ ఢీ కొట్టాల్సి వస్తుంది అన్నది సత్యం.

అత్యంత బలంగా ఉన్న కూటమిని ఎదుర్కోవాలంటే వైసీపీ ఒంటరి పోరు సరిపదనే అంటున్నారు. దాంతో వామపక్షాల సాయం తీసుకోవాలన్న ఆలోచన వైసీపీలో ఉందని అంటున్నారు. ఆ విధంగా సలహా సూచనలు కూడా అందుతున్నాయని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో నుంచి చూస్తే కనుక వామపక్షాలతో దోస్త్గీకి తొలి అడుగు పడిందా అన్నది ఇపుడు చర్చగా ఉంది. విజయవాడలో ఆదివారం ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధిని కోరుతూ నిర్వహించిన ఈ సమావేశానికి వామపక్షాలు ఆద్వర్యం వహించాయి. ఈ మీటింగుకు వైసీపీ హాజరు కావడం విశేషం.

ఈ రౌండ్ టేబిల్ మీటింగ్ కి హాజరైన కర్నూలు జిల్లా వైసీపీ సీనియర్ నాయకుడు ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి అమరావతి ప్రాంతానికి పెట్టే ఖర్చులో పది శాతం అయినా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని కోసం లక్షల ఖర్చు పెడుతున్న ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల అభివృద్ధికి పది శాతం కేటాయిస్తే అక్కడ ప్రగతి జరుగుతుందని స్పష్టం చేశారు.

పరిశ్రమలకు నీళ్ళు ఇవ్వాలన్నా పంటలకు సాగు నీరు ఇవ్వాలన్నా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉందని అన్నారు. ఏపీలో మొత్తం మీద పంటలు పండించేందుకు 42 శాతం మేర అవకాశం ఉంటే సాగునీరు 9 శాతానికే అందుతోందని ఆయన అన్నారు. రైస్ బౌల్ గా ఏపీకి ఉన్న పేరుని నిలబెట్టడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎం ఎ గఫూర్ మాట్లాడుతూ ఏపీ సమగ్రమైన అభివృద్ధికి ప్రభుత్వం కార్యాచరణను రూపొందించాలని కోరారు. ఏ ఫర్ అమరావతి పీ ఫర్ పోలవరం అంటే బాగానే ఉంది కానీ మిగిలిన ప్రాంతాల సంగతి ఏమిటి అని ప్రశ్నించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ గత నాలుగు దశబ్దాలుగా ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు పెండింగులో ఉన్నాయని అన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో సాగు నీటి ప్రాజెక్టులకు పెద్ద పీట వేయాలని కేంద్రం నుంచి పెద్ద ఎత్తున సాయం తీసుకుని రావాలని కోరారు.

ఈ సమావేశం ఏపీలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం జరిగినా వామపక్షాలు నిర్వహించిన దానికి వైసీపీ అటెండ్ కావడం అన్నది ఒక కొత్త పొలిటికల్ డెవలప్మెంట్ గా చూస్తున్నారు. ఇది రానున్న రోజులలో ఏమైనా కీలకమైన మలుపు తీసుకుంటుందా అన్నది చర్చకు వస్తున్న విషయంగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.