Begin typing your search above and press return to search.

ఉమ్మడి ఏపీలో ఏడు పార్టీలు మటాష్

రాజకీయాల్లో ఉన్న వారు అందులోనే విజయాలు అందుకోవాలని చూస్తారు. ఇక వేరే ఫీల్డ్ లో ఉన్న వారు కూడా రాజకీయాల వైపు ఆసక్తిని ప్రదర్శిస్తారు

By:  Tupaki Desk   |   9 Oct 2024 2:30 AM GMT
ఉమ్మడి ఏపీలో ఏడు పార్టీలు మటాష్
X

రాజకీయాల్లో ఉన్న వారు అందులోనే విజయాలు అందుకోవాలని చూస్తారు. ఇక వేరే ఫీల్డ్ లో ఉన్న వారు కూడా రాజకీయాల వైపు ఆసక్తిని ప్రదర్శిస్తారు. అయితే రాజకీయావేశం మరింతగా ఎక్కువ అయితే ఏకంగా పార్టీలే పెట్టేందుకు వారు సిద్ధం అవుతారు. అలా సాహసించిన వారిని అందరికీ విజయం వరించలేదు.

కొందరు మాత్రమే పార్టీలు పెట్టి సక్సెస్ అందుకున్నారు. చాలా మంది రాజకీయ పార్టీలు పెట్టినా అవి పుబ్బలో పుట్టి మఖలో మాడిపోయాయి. అలాంటివి ఎన్నో ఉమ్మడి ఏపీలో ఉన్నాయి. వాటి గురించి ఎంతో ఆసక్తికరమైన అంశాలే ఉన్నాయి. ఇక తెలుగుదేశం విషయానికి వస్తే సినీ రంగం నుంచి నేరుగా దిగి రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ స్థాపించారు. ఆయన పార్టీ పెట్టిన తొమ్మిది నెలలలోనే అధికారాన్ని అందుకున్నారు.

అది నిజంగా గొప్ప విజయం అని చెప్పాలి. ఆ విధంగా ఎన్టీఆర్ గిన్నీస్ బుక్ రికార్డుని కూడా ఎక్కారు. ఇక అన్న గారి తరువాత అంతటి చరిష్మా సినీ రంగంలో సంపాదించిన మెగాస్టార్ చిరంజీవి 2008 ఆగస్టులో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఆయన 2009 ఎన్నికల్లో మొత్తం ఉమ్మడి ఏపీలోని అన్ని స్థానాలకు పోటీ చేశారు. అయితే ఆ పార్టీకి దక్కినవి కేవలం 18 సీట్లు మాత్రమే. ఆ తరువాత చిరంజీవి ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా కొన్నాళ్ళు పనిచేసి రాజకీయాల నుంచి విరమించుకున్నారు.

ఇక లేడీ అమితాబ్ గా సినీ రంగంలో ఎంతో పేరు తెచ్చుకున్న విజయశాంతి జనవరి 2005లో తన సొంత రాజకీయ పార్టీగా తల్లి తెలంగాణను ప్రారంభించారు. అయితే ఆమె అనుకున్న విధంగా ఆ పార్టీని ముందుకు తీసుకుని రాలేకపోయారు. దాంతో ఆమె భారత రాష్ట్ర సమితిలో తన పార్టీని విలీనం చేశారు. ఇక ఆమె బీజేపీ కాంగ్రెస్ వంటి పార్టీలలో కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు.

ఎన్టీఆర్ మూడవ కుమారుడు నందమూరి హరికృష్ణనటుడిగా కొంతవరకూ రాణించారు. అలాగే ఆయన రాజకీయ వారసుడిగా ఒక దశలో గుర్తింపు పొందారు. ఆయన చంద్రబాబుతో విభేదించి 1999 ప్రాంతంలో అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించి ఉమ్మడి ఏపీవ్యాప్తంగా పోటీ చేశారు. అయితే ఆయన పార్టీ దాదాపుగా అని చోట్లా డిపాజిట్లు కోల్పోయింది. ఆయన కూడా ఎన్టీఆర్ సొంత ప్రాంతం అయిన గుడివాడ నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు.

ఇక వీరందరి కంటే ముందు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని లక్ష్మీపార్వతి స్థాపించి 1996 లోక్ సభ ఎన్నికలను ఎదుర్కొన్నారు. ఆమెకు ఆ ఎన్నికల్లో ఓట్లు బాగా వచ్చినా ఒక్క సీటు కూడా దక్కలేదు. ఇక ఆ తరువాత పాతపట్నం లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె ఎన్టీఆర్ టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచి అసెంబ్లీకి వచ్చారు. ఆ తరువాత ఆమె పార్టీ కూడా కనుమరుగు అయింది

ఇక ఇటీవల కాలంలో చూసుకుంటే వైఎస్ షర్మిల 2021లో వైఎస్సార్ టీపీ పేరుతో తెలంగాణాలో పార్టీని స్థాపించారు. అయితే గిర్రున మూడేళ్ళు తిరగకుండానే ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీకి కాంగ్రెస్ చీఫ్ గా వచ్చారు. అలా పార్టీని నడపలేకపోయారు అని అపకీర్తిని మూటకట్టుకున్నారు.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచాక నాదెండ్ల భాస్కరరావు కూడా ఒక ప్రాంతీయ పార్టీ పెట్టారు. 1985 ఎన్నికల్లో పోటీ చేస్తే అపజయం ఎదురైంది. ఇక టీడీపీలో నంబర్ టూగా ఉంటూ ఉమ్మడి ఏపీలో హోం మంత్రిగా పనిచేసిన దేవేంద్ర గౌడ్ నవ తెలంగాణా పార్టీని 2009 ఎన్నికల ముందు స్థాపించారు. ఆయన కూడా తన ఓటమితో పాటు పార్టీ ఓటమిని కూడా చవి చూసారు.

ఇలా రాజకీయ నేతలు పార్టీలు పెట్టడం అన్నది ఆవేశంతోనో పంతంతోనో జరిగినా వాటిని నిర్వహించలేకపోవడం వల్లనే అవి ఓటమి పాలు అయ్యాయని విశ్లేషణలు ఉన్నాయి. రాజకీయాల్లో ప్రజలు చూసేది పార్టీల సిద్ధాంతాలతో పాటు ఆ పార్టీల స్థాపన వెనక ఉన్న ఉద్దేశ్యాలను. అలాగే నేతల చిత్తశుద్ధిని కూడా అని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలుగా చరిత్రలో కనిపిస్తాయని చెప్పక తప్పదు.