Begin typing your search above and press return to search.

ఏపీని వాన రాష్ట్రంగా మార్చేసిన పాడు వాయుగుండం

ఏపీలో వానలు.. వాటి కారణంగా పలు ప్రాంతాలు తీవ్ర అవస్థలకు గురి కావటం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం చూసిందే.

By:  Tupaki Desk   |   1 Sep 2024 5:58 AM GMT
ఏపీని వాన రాష్ట్రంగా మార్చేసిన పాడు వాయుగుండం
X

ఏపీలో వానలు.. వాటి కారణంగా పలు ప్రాంతాలు తీవ్ర అవస్థలకు గురి కావటం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం చూసిందే. కానీ.. ప్రాణ నష్టం పరిమితంగా ఉండేది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని విధంగా పాడు వర్షాల కారణంగా దాదాపు పది మందికి పైగా ప్రాణాల్ని కోల్పోవటం.. భారీ ఆస్తినష్టం జరగటం మాత్రం ఇదేనన్న మాట వినిపిస్తోంది. ఏపీని ఇంతలా అతలాకుతలం చేసిన పాడు వాయుగుండం ఎక్కడ మొదలైంది? ఎక్కడ బలపడింది? అన్నది చూస్తే.. వందల కిలోమీటర్ల దూరాన ఉన్న ఒడిశాలో బలపడిన మాయదారి వాయుగుండం ధాటికి ఏపీ చిగురుటాకులా వణికిన పరిస్థితి. జనజీవనం మొత్తం అతలాకుతలం చేసిన ఈ పాడు వాన లోతుల్లోకి వెళితే..

పశ్చిమ.. మధ్య దానికి అనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. శనివారానికి దక్షిణ ఒడిశా తీరప్రాంతంలో వాయుగుండంగా బలపడింది. దీని ఎఫెక్టు ఏపీ మీద ఎక్కువగా పడింది. దీనికి కారణం సగటు సముద్ర మట్టంపై ఉన్న రుతుపవన ద్రోణి కూడా వాయువ్య ఆరేబియా సముద్రంపై ఉన్న తుపాను కేంద్రం నుంచి.. నలియా.. మాలెగావ్.. బ్రహ్మపురి.. జగదల్పూర్.. కళింగపట్నం మీదుగా వాయుగుండం కేంద్రం వరకు కొనసాగింది.

ఇదే.. కుంభవ్రష్టికి కారణమైంది. దీని పరిధి దాదాపు 400కిలోమీటర్లు ఉందని నిపుణులు చెబుతున్నారు. వాయు గుండంతో పాటు ద్రోణి ప్రభావంతో కొన్నిచోట్ల రికార్డు స్థాయిలో వర్షం పడింది. విజయవాడకు సమీపంలోని రాజధాని అమరావతి ప్రాంతంలో గంటకు 6 సెంటీమీటర్ల వాన కురిసింది. శుక్ర వారం మొదలైన వాన శనివారం రాత్రి 7 గంటల సమయానికి ఈ ప్రాంతంలో పడిన వర్షం ఏకంగా 39.7 సెంటీమీటర్లు.. అంటే.. 40 సెంటీమీటర్లుగా చెప్పాలి. ఆకాశానికి చిల్లులు పడినట్లుగా కురిసిన వానతో జనజీవనం మొత్తం ఆగమాగమైంది.

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం చంద్రాలలో శనివారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్యలో 22.1 సెంటీమీటర్ల వర్షం పడితే.. విజయవాడలో శనివారం ఉదయం నుంచి రాత్రి 7 గంటల మధ్యలో 10.6 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ముందు రోజు కురిసిన వానను కూడా కలిపి లెక్కిస్తే 27.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంత భారీగా వర్షపాతం నమోదు కావటం.. పలు ప్రాంతాల్లోనూ.. చుట్టుపక్కల గ్రామాలను వరద నీరు చుట్టేసింది. గడిచిన రెండు దశాబ్దాల్లో ఇంతటి వరద బీభత్సాన్ని తాము చూడలేదని విజయవాడ ప్రజలు చెబుతున్నారు. చివరకు వరద కారణంగా జాతీయ రహదారుల్లోనూ వేలాది వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. ఒక దశ నుంచి ఇంట్లో నుంచి ఎంతో అత్యవసరం అయితే తప్పించి బయటకు రావొద్దంటూ ఆదేశాలు జారీ చేశారంటే.. తీవ్రత ఎంతన్నది అర్థం చేసుకోవచ్చు.