ఏపీ సర్కారుకు ఊతం.. ఎస్సీ వర్గీకరణ నివేదిక రెడీ!
ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి ఉప కులాలకు ఈ ఫలాలను అందించే క్రతువులో భాగంగా.. వర్గీకరణ ప్రక్రియను ఏపీ ప్రభుత్వం పూర్తి చేసింది.
By: Tupaki Desk | 11 March 2025 9:00 PM ISTఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి ఉప కులాలకు ఈ ఫలాలను అందించే క్రతువులో భాగంగా.. వర్గీకరణ ప్రక్రియను ఏపీ ప్రభుత్వం పూర్తి చేసింది. సుప్రీంకోర్టు గత ఏడాది ఆగస్టులో ఇచ్చిన ఆదేశాలకు అనుగు ణంగా ఏపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్‌ను నియమించింది. జస్టిస్ రాజీవ్‌నందన్ మిశ్రా తో కూడిన ఈ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించింది. అన్ని ఎస్సీ ఉప కులాల ప్రతినిధులను ఆయా వర్గాల ప్రజలను కూడా కమిషన్ కలుసుకుంది.
వారి అభిప్రాయాలను సేకరించింది. తాజాగా 350 పేజీలతో కూడిన నివేదికను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి కె. విజయానంద్‌కు జస్టిస్ రాజీవ్ నందన్ మిశ్రా అందించారు. దీంతో రాబోయే అన్ని ప్రభుత్వ ఉద్యో గాల భర్తీ విషయంలోనూ సర్కారుకు ఈ నివేదిక ఊతం కానుంది. ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించిన రిజర్వేషన్లను కేవలం మాల కులస్తులు మాత్రమే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారని మాదిగ సామాజిక వర్గం ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కూడా జరిగాయి.
ఈ నేపథ్యంలో ఒక్కొక్క రాష్ట్రాల్లో ఒక్కొక్క కులం ఎస్సీగా ఉన్నందున.. ఆయా రిజర్వేషన్లను జనాభా ఆధా రంగా.. వారి ఆర్థిక పరిస్థితి, నివాసం, ఉపాధి, ఆదాయం, సామాజిక వెనుకబాటు ఇలా.. అన్ని కోణాల్లోనూ ఆలోచించి వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ వ్యవహారాన్ని రాష్ట్రాలకే వదిలేసింది. అయితే.. ఎక్కడైనా రాజకీయ ప్రమేయం చోటు చేసుకుని ఎస్సీలకు అన్యాయం జరుగుతుంటే మాత్రం తాము జోక్యం చేసుకుంటామని పేర్కొనడం గమనార్హం.
ఏపీలో కూడా ఇలానే వర్గీకరణకు చంద్రబాబు ప్రభుత్వం నడుం బిగించింది. అయితే.. మాదిగ సామాజిక వర్గాలు ఈ కమిషన్ ఏర్పాటుపై సంతృప్తి వ్యక్తిచేసినా.. మాల సామాజిక వర్గం మాత్రం తీవ్రంగా వ్యతిరేకిం చింది. ఇప్పటికే కొన్ని సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ కమిషన్ ఏర్పాటును రద్దు చేయాలని కోరాయి. అయితే.. అసలు నివేదికే రాకుండా.. కమిషన్ రద్దు చేయడం సాధ్యం కాదన్న హైకోర్టు.. నివేదిక వచ్చే వరకు వేచి చూడాలని పేర్కొంది. దీంతో ఇప్పుడు ఆయా వర్గాలు ఏం చేస్తాయన్నది చూడాలి.