సచివాలయ ఉద్యోగులు ఇక ఊపిరి పీల్చుకోవచ్చు !
బీ కేటగిరీలో 2,500 నుంచి 3,500 జనాభా పరిధిని నిర్ణయించి అక్కడ ఏడుగురు సచివాలయ సిబ్బందిని నియమిస్తారు. సీ కేటగిరీలో 3,500 మంది జనాభా పైన ఉంటుంది.
By: Tupaki Desk | 17 Feb 2025 8:30 PM GMTఏపీలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు గత తొమ్మిది నెలలుగా తమ సంగతి ఏమిటో తెలియక డోలాయమానంలో ఉన్నారు. తమను ఏమి చేయబోతున్నారు అన్నది వారికి పట్టుకున్న బాధ. వైసీపీ హయాంలో ఈ వ్యవస్థ ఏర్పడినా అంతా అస్తవ్యస్తంగా ఉంది. దాంతో టీడీపీ కూటమి ప్రభుత్వం అయినా తమకు న్యాయం జరుగుతుందని ఆశించారు.
అందుకోసమే వారు కూటమి ప్రభుత్వం నుంచి మంచి వార్త వినేందుకు ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే సచివాలయ ఉద్యోగ సంఘాలతో మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తాజాగా జరిపిన చర్చలు ఫలవంతంగా ఉన్నాయని అంటున్నారు. దీని మీద మంత్రి అయితే శుభ వార్తనే చెప్పారు.
సచివాలయ ఉద్యోగులను తొలగిస్తారని జరుగుతున్న ప్రచారం తప్పు అని ఆయన అన్నారు. అందరినీ కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. అంతే కాదు సచివాలయ ఉద్యోగులను ఏబీసీ కేటగిరీలుగా రేషనలైజేషన్ చేస్తామని మరింత సమర్థంగా ఈ వ్యవస్థ పనిచేస్తుందని భరోసా ఇచ్చారు.
ఇక మిగులు సిబ్బందిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటామని చెప్పారు. ఈ విషయంలో వారికి తగిన న్యాయం చేస్తామని అన్నారు. కొన్ని ప్రభుత్వ శాఖలలో ఖాళీలు ఉన్నాయని యా వాటిని త్వరలోనే భర్తీ చేస్తామని అన్నారు. అదే విధంగా సచివాలయ పరిధిలో ఉన్న మహిళా సిబ్బందిని కూడా స్త్రీ శిశు సంక్షేమ శాఖలను సంప్రదించి ఒక ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఇదిలా ఉంటే ఏపీలో మొత్తం సచివాలయాలలో 1,30,694 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అయితే వీరి పనితీరు కానీ అన్ని సచివాలయాల్లో సిబ్బంది కానీ ఒకే విధంగా లేరు. కొన్ని సచివాలయాల్లో ఎక్కువ మంది సిబ్బంది ఉంటే మరి కొన్ని సచివాలయాలలో తక్కువ సిబ్బందితో పనిభారం ఉంది. దాంతో ఇపుడు రేషనలైజేషన్ విధానాన్ని ప్రభుత్వం తీసుకుని వచ్చింది.
దీనిని ఏబీసీ కేటగిరీలుగా విభజనించింది. ఏ కేటగిరీలో చూస్తే 2500 జనాభా లోపు ఉన్న చోట ఒక సచివాలయం ఉంటుంది. అక్కడ ఆరుగురు సచివాలయ సిబ్బంది పనిచేస్తారు. బీ కేటగిరీలో 2,500 నుంచి 3,500 జనాభా పరిధిని నిర్ణయించి అక్కడ ఏడుగురు సచివాలయ సిబ్బందిని నియమిస్తారు. సీ కేటగిరీలో 3,500 మంది జనాభా పైన ఉంటుంది. ఇక్కడ ఎనిమిది మంది దాకా సిబ్బంది ఉంటారు. ఈ విధంగా చేయడం వల్ల పాలన ప్రజలకు మరింత సమర్థంగా అందుతుందని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
ఈ విధంగా ఏషనలైజేషన్ చేయడం వల్ల దాదాపుగా నలభై వేల మంది దాకా సచివాలయ సిబ్బంది మిగులుగా ఉంటారు. దాంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. అయితే వారి ఉద్యోగ భద్రతకు ముప్పు లేదని ప్రభుత్వం చెబుతోంది. వారిని ఖాళీగా ఉన్న ప్రభుత్వ శాఖలలో వారి అర్హతలను బట్టి నియమించుకుంటామని అంటోంది. దాంతో సచివాలయ సిబ్బంది ఊపిరి పీల్చుకోవచ్చు వారి ఉద్యోగ భద్రతకు ఢోకా లేదు కాబట్టి వారు మరింత సమర్ధంగా పనిచేయడం ద్వారా తన ప్రతిభను చాటుకుంటూ ముందు ముందు మరిన్ని అవకాశాలు పొందవచ్చు అని అంటున్నారు.