ఉత్త చేతులతో వచ్చినా గ్రాండ్ వెల్ కం ఏంది చంద్రబాబు?
అందుకు భిన్నంగా రిక్త హస్తాలతో ఎయిర్ పోర్టుకు చేరుకున్న చంద్రబాబుకు గ్రాండ్ గా వెల్ కం చెప్పేందుకు తెలుగు తమ్ముళ్లు.. పూల బొకేలను తీసుకురావటం.
By: Tupaki Desk | 25 Jan 2025 4:45 AM GMTఏదైనా సాధించి తిరిగి స్వదేశానికి.. సొంత రాష్ట్రానికి వస్తుంటే పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతూ.. గ్రాండ్ వెల్ కం చెప్పటంలో అర్థం ఉంది. అందుకు భిన్నంగా ఎలాంటి విజయాన్ని సాధించకుండా.. ఉత్త చేతులతో వచ్చిన వేళలో.. ఘనకార్యం సాధించినట్లుగా బిల్డప్ ఇస్తే బాగుంటుందా? అన్నది ప్రశ్న. తాజాగా అలాంటి సీన్ ఒకటి ఏపీలో చోటు చేసుకుంది. పెట్టుబడుల కోసం దావోస్ కు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ కో.. అన్ని రోజులు అక్కడ ఉండి.. ఏపీ రాష్ట్రాన్ని ఎంత మార్కెటింగ్ చేసినా.. ఒక్కటంటే ఒక్క పెట్టుబడి రాని పరిస్థితి.
అదే సమయంలో పక్కననున్న తెలంగాణ రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు పోటెత్తటమే కాదు.. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ సాధించిన పెట్టుబడుల్ని ఒకే దఫాలో రేవంత్ రెడ్డి తీసుకురావటం ఆసక్తికరంగా మారింది.
జూబ్లీహిల్స్ లోని ఒకే వీధిలో ఉండే పారిశ్రామికవేత్త మెగా క్రిష్ణారెడ్డి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు దావోస్ లో కలుసుకొని.. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టినట్లుగా ఒప్పందాలు చేసుకోవటం ఏమిటంటూ? వెళ్లి పెట్టుబడులు పెట్టటమా? అంటూ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్.. హరీశ్ రావులు ముఖ్యమంత్రి రేవంత్ ను ఎటకారం ఆడేశారు.అయితే.. దానికి సమాధానంగా తాను తీసుకొచ్చిన లక్ష కోట్లకు పైనే పెట్టుబడులతోనోరు మూయించేశారు.
నిజానికి పదేళ్ల బీఆర్ఎస్ హయాంలోనూ దావోస్ కు వెళ్లిన సందర్భంగా తెలంగాణ ప్రాంతానికిచెందిన కంపెనీలతో అక్కడ ఒప్పందాలుచేసుకోవటం.. వాటి గురించి గొప్పలు చెప్పుకోవటం మామూలే. ఆ విషయాన్ని మర్చిపోయినట్లుగా కేటీఆర్.. హరీశ్ ఇద్దరూ రేవంత్ సర్కారుపై విమర్శలు సంధించటం నప్పలేదని చెప్పాలి. ఏపీతో పోలిస్తే.. తెలంగాణ సర్కారు దావోస్ నుంచి భారీగా పెట్టుబుడల్ని రాష్ట్రానికి తీసుకొచ్చిన పరిస్థితి. ఇలాంటి వేళ.. ఏపీకి ఒక్కటంటే ఒక్క పెట్టుబడి వచ్చినా బాగుండేది.
అందుకు భిన్నంగా రిక్త హస్తాలతో ఎయిర్ పోర్టుకు చేరుకున్న చంద్రబాబుకు గ్రాండ్ గా వెల్ కం చెప్పేందుకు తెలుగు తమ్ముళ్లు.. పూల బొకేలను తీసుకురావటం.. మీరు ఇంద్రుడు.. సూర్యుడు.. అంటూ చంద్రబాబును తెలుగు తమ్ముళ్లు ఆకాశానికి ఎత్తేయటమే కాదు.. తెలంగాణకు హైదరాబాద్ ఉందని.. వారికి ప్రత్యేకంగా ప్రమోషన్ అక్కర్లేదని.. ఏపీకి ఏమీ లేదని చెప్పిన టీడీపీ నేతలు.. ఏపీకి ఉన్నదల్లా చంద్రబాబు బ్రాండ్ ఒక్కటేనంటూ పొగిడేయటం కనిపిస్తుంది.
వినేందుకు ఇలాంటి మాటలు బాగానే ఉన్నా.. నిజంగానే చంద్రబాబు బ్రాండ్ అనేది ఉండి ఉంటే.. చిన్న పెట్టుబడి ఒక్కటంటే ఒక్కటైనా వచ్చి ఉండేది కదా? అలాంటప్పుడు ఏమీ తీసుకురాకుండా ఉత్త చేతులతో వస్తున్న వేళ.. ఆయనకు గ్రాండ్ వెల్ కం చెప్పేందుకు తెలుగు తమ్ముళ్లు ఎయిర్ పోర్టు వద్ద బారులు తీరటం మాత్రం.. ఎటకారంగా ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రచారం చేసుకోవటం తప్పు కాదు. కానీ.. ఎప్పుడు.. ఏ సమయంలో ఎలాంటి ప్రచారం చేసుకోవటం అన్నది కీలకం. చూస్తుంటే తెలుగు తమ్ముళ్లు మాత్రమే కాదు వారిని నియంత్రించే చంద్రబాబు సైతం అలాంటిది మిస్ అయినట్లుగా కనిపిస్తోంది.