ఫైనల్ పోరు వేళ.. స్క్రీన్ మీద జగన్ సర్కారు ఘనత.. వాటే ఐడియా గురు
ఏపీలోని పలు ప్రాంతాల్లోని స్టేడియంలో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసి.. ఫైనల్ మ్యాచ్ ను ప్రసారం చేయటం తెలిసిందే
By: Tupaki Desk | 20 Nov 2023 4:42 AM GMTగుజరాత్ రాజధాని అహ్మదాబాద్ వేదికగా చేసుకొని నరేంద్ర మోడీ స్టేడియంలో అట్టహాసంగా నిర్వహించిన ప్రపంచకప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ను నేరుగా చూసేందుకు ఎంత ఆసక్తి వ్యక్తమైందో.. అంతే ఆసక్తి దేశ వ్యాప్తంగానూ వ్యక్తమైంది. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వ పరంగా తమకు కావాల్సిన మైలేజీని సొంతం చేసుకోవటానికి వీలుగా వేసే ఎత్తుగడలు చూస్తే.. వావ్ అనకుండా ఉండలేం. భారత్ - ఆస్ట్రేలియా ఫైనల్ పోరును ఏపీ వ్యాప్తంగా పలు జిల్లా కేంద్రాల్లో భారీ తెరలు ఏర్పాటు చేసి.. లైవ్ మ్యాచ్ ను ప్రదర్శించిన సంగతి తెలిసిందే.
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ చేపట్టిన ఈ భారీ కార్యక్రమంలో జగన్ సర్కారు గొప్పతనాన్ని..సాధించిన విజయాల్ని కీర్తిస్తూ ఓవర్ కు ఓవర్ కు మధ్య ఉండే విరామంలో యాడ్స్ రూపంలో ప్రసారం చేసిన వైనం ఆకట్టుకుంది. ఇలాంటి ఐడియాలు జగన్ అండ్ కోకు మాత్రమే సాధ్యమని చెప్పాలి. ప్రభుత్వానికి కించిత్ మైలేజ్ వస్తుందన్న అవకాశం ఉన్నా.. వదిలి పెట్టకుండా అవకాశాన్ని అందిపుచ్చుకునేలా చేయటంలో జగన్ ప్రభుత్వంలోని కొందరు ముందుంటారు. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించి.. జగన్ ప్రభుత్వానికి ప్రచారం అయ్యేలా నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలోని పలు ప్రాంతాల్లోని స్టేడియంలో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసి.. ఫైనల్ మ్యాచ్ ను ప్రసారం చేయటం తెలిసిందే. ఉచితంగా ఏర్పాటు చేసిన ఈ ప్రత్యక్ష ప్రసార సమయంలో ఆంధ్ర ప్రీమియార్ లీగ్ లోగోను ఆవిష్కరిస్తున్న చిత్రాలతో పాటు.. మ్యాచ్ మధ్యలో పలుమార్లు ముఖ్యమంత్రి జగన్ ప్రచార వీడియోల్ని ప్రదర్శించటం చూస్తే.. జగన్ థింక్ ట్యాంకర్స్ ను అభినందించాల్సిందే.