వర్మకు కలిసొచ్చిన వైసీపీ నిర్ణయం... త్వరలో ఎన్నికలు!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల సందడి ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది
By: Tupaki Desk | 19 Jun 2024 10:14 AM GMTఏపీలో సార్వత్రిక ఎన్నికల సందడి ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ సందర్భంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ సమయంలో 24మందికి మంత్రిపదవులు దక్కాయి. ఇంకా ఒక కేబినెట్ పోస్ట్ ఖాళీగా ఉంచారు చంద్రబాబు. ఆ సంగతి అలా ఉంటే... త్వరలో ఏపీలో మరోసారి ఎన్నికల సందడి మొదలవ్వనుంది.
అవును... ఏపీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికల సందడి నెలకొనబోతోంది. అయితే అవి శాసన మండలి ఎన్నికలు. వైసీపీ శాసన మండలి సభ్యులుగా ఉన్న సి. రామచంద్రయ్య, మహ్మద్ ఇక్బాల్ లు ఎన్నికల ముందు పార్టీ మారారు. దీంతో ఆగ్రహించిన నాటి అధికారపక్షం వైసీపీ వారిపై అనర్హత వేటు వేసింది. దీంతో ఈ రెండు స్థానాలూ ఖాళీ అయ్యాయి.
ఇలా వీరిపై అనర్హత వేటు వేసిన అనంతరం మూడు నెలలో తిరిగి ఉప ఎన్నికలు నిర్వహించాయి. అయితే ఇప్పటికే వీరిపై అనర్హత వేటు వేసి రెండు నెలలు అయిపోయిన నేపథ్యంలో... మరికొన్ని రోజుల్లోనే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వొచ్చని అంటున్నారు. అయితే... ఈ రెండు స్థానాలూ టీడీపీకే దక్కనున్నాయనడంలో ఎవరికీ సందేహం ఉండకపోవచ్చు.
కారణం ఇవి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు. దీంతో సభలో భారీ బలం ఉన్న కూటమి అభ్యర్థులే ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో... ఎవరెవరికి ఈ టిక్కెట్లు దక్కే అవకాశం ఉందనే చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా సీనియర్లు, టిక్కెట్ దక్కని నేతలు, త్యాగ శీలులు మొదలైన కోటాలు తెరపైకి వస్తున్నాయని అంటున్నారు.
అయితే ఇందులో ఒక స్థానం మాత్రం కచ్చితంగా ఎస్.వి.ఎస్.ఎన్. వర్మకే అని అంటున్నారు పరిశీలకులు. పిఠాపురంలో తన టిక్కెట్ త్యాగం చేయడంతోపాటు పవన్ కల్యాణ్ గెలుపులో వర్మ కీలక భూమిక పోషించారని చెబుతారు. దీంతో... ఈ ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి కచ్చితంగా వర్మకే దక్కుతుందని.. మిగిలిన కేబినెట్ బెర్త్ కూడా క్షత్రియ కోటాలో వర్మకు దక్కినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
ఆ సంగతి అలా ఉంటే... మరో స్థానం జనసేనకు ఇచ్చే అవకాశాలపైనా చర్చ జరుగుతుందని అంటున్నారు. ఇందులో భాగంగా... కూటమి అభ్యర్థుల కోసం అనకాపల్లి ఎంపీ టిక్కెట్ త్యాగం చేసిన కొణిదల నాగబాబును ఎమ్మెల్సీ చేసే ఛాన్స్ ను కొట్టిపారేయలేమని అంటున్నారు. మరోపక్క టీడీపీ నుంచి ఇద్దరు ముగ్గురు సీనియర్ల పేర్లూ వినిపిస్తున్నాయి.
ఇందులో భాగంగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా తో పాటు నాదేండ్ల మనోహర్ కోసం టిక్కెట్ త్యాగం చేసిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేరు చర్చలో ఉందని అంటున్నారు. దీంతో ఈ రెండు టిక్కెట్లూ ఎవరికి ఇస్తారనేది ఆసక్తిగా మారింది. పైగా ఒక కేబినెట్ బెర్త్ కూడా చంద్రబాబు అట్టి పెట్టి ఉంచడంపైనా ఆసక్తికర చర్చ జరుగుతుంది.