Begin typing your search above and press return to search.

మళ్లీ షురూ.. అన్న క్యాంటీన్లకు పూర్వ వైభవం !

తాజాగా ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ అన్నా క్యాంటీన్లకు పూర్వవైభవం రానున్నది.

By:  Tupaki Desk   |   12 July 2024 5:35 AM GMT
మళ్లీ షురూ.. అన్న క్యాంటీన్లకు పూర్వ వైభవం !
X

రెక్కాడితే గానీ డొక్కాడని పేదల కడుపు నింపేందుకు గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అన్న క్యాంటీన్లు జగన్ ప్రభుత్వంలో కనుమరుగైపోయాయి. రూ.5కే భోజనం, అల్పాహారం అందించే ఈ క్యాంటీన్లు పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. కేవలం రూ.15 ఉంటే పేదలకు రోజు గడిచిపోయేది. తాజాగా ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ అన్నా క్యాంటీన్లకు పూర్వవైభవం రానున్నది.

2013లో తమిళనాడులో జయలలిత మొదలుపెట్టిన ఈ పథకాన్ని 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఒక కమిటీని తమిళనాడుకు పంపించి అధ్యయనం చేయించి ఆంధ్రప్రదేశ్ లో అన్న క్యాంటీన్ పేరుతో శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వం మూలకు వేసిన ఈ క్యాంటీన్లను తిరిగి ఈ ఏడాది ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సంధర్భంగా తిరిగి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

తొలిదశలో 183 అన్న క్యాంటీన్లు ప్రారంభించడం లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తున్నది. ఈ మేరకు రూ.20 కోట్లతో అన్న క్యాంటీన్ల మరమ్మతులు, సాఫ్ట్ వేర్ అప్లికేషన్ల కోసం రూ.7 కోట్లు, 20 క్యాంటీన్లకు కొత్త భవనాలు, పాత పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం మరో రూ.65 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. చిన్న పెద్ద పట్టణాలలో ఉండే పేదలు, ఆసుపత్రులకు వచ్చే పేషంట్లు, వారి సహాయకులు, రిక్షావాలాలు, ఆటో డ్రైవర్లు ఈ అన్నా క్యాంటిన్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.