'జగన్ ఉండి ఉంటే..' ఎక్కడ విన్నా ఇదే మాట.. నిజం..!
అయితే.. ఈ పథకంపై ఇప్పటి వరకు(గెలిచిన తర్వాత) ఎవరూ నోరు విప్పడం లేదు. మరోవైపు ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల బాదుడు ఎక్కువగా ఉంది.
By: Tupaki Desk | 12 Oct 2024 11:30 AM GMTరాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ప్రజలు ఏరికోరి కూటమి సర్కారును భుజాలపైకి ఎత్తుకున్నారు. దీంతో ప్రజల మనసుల్లో కూటమి సర్కారు పెద్దలే మెదులుతుంటారన్నది అందరూ అనుకునే మాట. నిజమే. వాస్తవానికి పాత ప్రభుత్వంపై పెద్దగా చర్చ జరగదు. సాధారణ ప్రజలు కూడా ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తోందనే చర్చలో ఉంటారు. ఎదరు చూస్తూ కూడా ఉంటారు. ఇలానే ఏపీలోనూ జరిగిన మాట వాస్తవం. తొలి రెండు నెలలు కూడా.. జగన్‌పై విమర్శలు, దూషణలు కూడా వినిపించాయి.
కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ.. సాధారణ ప్రజల్లో మార్పు కనిపిస్తోంది. ఇది ముమ్మాటికీ వాస్తవం. అంతర్గ త చర్చల్లో మంత్రులు కూడా ''మన ఇమేజ్‌ను కాపాడుకోవాలి'' అని నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా.. కూటమిసర్కారు ఇమేజ్.. అలా తారాజువ్వ మాదిరిగా పెరిగి.. ఇలా కిందకు దిగడం అనేది ఆసక్తిగా మారింది. దీనికి ప్రధానంగా.. 3 కారణాలు ఉన్నాయన్నది పరిశీలకులు చెబుతున్న మాట. 1) రాష్ట్రంలో ఏం జరిగినా ఇప్పటికీ వైసీపీపైనే నిందలు మోపడం. ఈ విషయంపై మేధావులు కూడా తప్పుబడుతున్నారు.
పాస్ట్ ఈజ్ పాస్ట్- ఇప్పుడు మీహయాంలో జరిగిన వాటికి సమాధానం ఏంటి? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక, సాధారణ ప్రజల్లోనూ ఇదే మాట వినిపిస్తోంది. 2) మాతృవందనం పథకం. ఇది అత్యంత కీలక పథకం. నాడు 2019లో జగన్‌కు అమ్మ ఒడి ఎలా అయితే.. ఓట్లు తెచ్చిందో ఇప్పుడు చంద్రబాబు కూటమి సర్కారుకు మాతృవందనం కూడా పేరు తెచ్చింది. అయితే.. ఈ పథకంపై ఇప్పటి వరకు(గెలిచిన తర్వాత) ఎవరూ నోరు విప్పడం లేదు. మరోవైపు ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల బాదుడు ఎక్కువగా ఉంది.
దీంతో మాతృవందనం పథకం కింద నిధులు ఇస్తే.. దానిని ఫీజులు కట్టుకునేందుకు వాడుకోవాలని భావించారు. కానీ, ఈ పథకంపై సర్కారు ఎలాంటి ప్రకటనా చేయడం లేదు. దీంతో మహిళలు ఉసూరు మంటూ.. జగన్‌నే గుర్తుచేసుకుంటున్నారు. 'జగన్ ఉండి ఉంటే.. ' అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. పట్టణాలు, నగరాల్లోనే ఎక్కువగా వినిపిస్తుండడం గమనార్హం. ఇక, 3వ విషయం.. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో కూటమి ప్రభుత్వం అతిగా స్పందించడం. ఎలా చూసుకున్నా.. రోజులు గడుస్తున్న కొద్దీ.. జగన్ ప్రమేయం లేకుండా జగన్ పేరు వినిపిస్తుండడం గమనార్హం.