ఏపీ మునిగింది... బీజేపీకి బాధ్యత లేదా ..!
కేవలం నాలుగు బోటులు, రెండు హెలికాప్టర్లు.. పంపించి చేతులు దులుపుకొంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.
By: Tupaki Desk | 5 Sep 2024 7:42 AM GMTఏపీలోని సగం జిల్లాలు వరదలో మునిగిపోయాయి. ఇక్కడి ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. సుమా రు 4 లక్షల మంది ప్రజలకు నిద్రాహారాలు కరువయ్యాయి. అలో లక్ష్మణా అని అల్లాడుతున్నారు. వరద నీటిలోనే కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడా కూడా ప్రజలు సుఖంగా ఉన్న పరిస్థితి కూడా లేదు. ఈ విషయాలు జాతీయ మీడియాలోనూ హైలెట్ అవుతున్నాయి. ప్రజలు పడుతున్న కష్టాలను కళ్లకు కడుతున్నాయి. ఇది ఎవరూ సృష్టించింది కాదు.. ప్రకృతి విపత్తు!
మరి కేంద్రంలో అధికారంలో ఉండి.. ఏపీలోనూ అధికారం పంచుకున్న బీజేపీ ఏం చేస్తున్నట్టు? ఇంత విపత్తు సంభవిస్తే..కేంద్రం నుంచి ఏమైనా సాయం అందిందా? అనేది ప్రశ్న. కేవలం నాలుగు బోటులు, రెండు హెలికాప్టర్లు.. పంపించి చేతులు దులుపుకొంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. వాస్తవానికి.. రాష్ట్రంలోనూ బీజేపీ అధికార పక్షంలోనే ఉంది. ఒక మంత్రి, 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అలాంటప్పుడు.. ప్రజల పక్షాన నిలవాల్సిన అవసరం కేంద్రంలోని పెద్దలకు లేదా? అనేది ప్రశ్న.
కానీ.. ఈ విషయంలో కేంద్రంలోని పెద్దలు ఏమీ పట్టించుకోవడం లేదు. కనీసం.. ప్రజలు ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నారే.. వెళ్లి పరిశీలిద్దాం.. అని కూడా కేంద్ర మంత్రులకు కానీ.. ప్రధాని నరేంద్ర మోడీకి కానీ.. అనిపించకపోవడం గమనార్హం. మరోవైపు.. కూటమి ప్రభుత్వం తరఫున.. టీడీపీ.. మెజారిటీ పార్ట్ పోషిస్తోంది. మరి బీజేపీ నాయకులు స్టేట్ లెవిల్లోనూ కనిపించడం లేదు. ఎప్పుడు మీడియాముందుకు వచ్చినా.. మోడీ దూరదృష్టితో రాష్ట్రానికి అది చేశారు.. ఇది చేశారు.. అని చెప్పుకొంటున్నారు.
కానీ, ఎప్పుడు ఏం చేశారనేది పక్కన పెడితే.. ఇప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్న నేపథ్యంలో ఏమేరకు ఆదుకుంటున్నారనేది చూస్తే.. మాత్రం బీజేపీ ఏమాత్రం బాధ్యత కనిపించడం లేదు. ఓట్లు వేయించుకునేందుకు .. అధికారం దక్కించుకునేందుకు మాత్రమే.. బీజేపీ ప్రాధాన్యం ఇస్తోంది తప్ప.. ప్రజలను పట్టించుకునేందుకు మాత్రం తీరికలేదన్నట్టుగా వ్యవహరిస్తుండడం గమనార్హం. ఇప్పటికైనా ఏపీని పట్టించుకునేందుకు కేంద్రంలోని పెద్దలు నడుం బిగించాల్సి ఉంది.