హెచ్ఎంపీవీ అలజడి... అలెర్ట్ అయిన చంద్రబాబు
ఏపీలో వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
By: Tupaki Desk | 6 Jan 2025 3:57 PM GMTకొత్త ఏడాది 2025కి ప్రపంచ ప్రజలంతా ఘనంగా స్వాగతం పలికారు. ఎన్నో ఆశలతో ఎంతో నమ్మకంతో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నారు. అయితే కొత్త ఏడాది వస్తూనే ఒక చేదు వార్తను ప్రపంచానికి మోసుకొచ్చింది. అదే హెచ్ఎంపీవీ. దీన్ ఫుల్ ఫార్మ్ హ్యూమన్ మెటాన్యూమా వైరస్. ఇది దూకుడుకే బాప్ అని అంటున్నారు.
ఇది ఇప్పటికే చైనాలో విపరీతమైన వ్యాప్తి చెందిందని ఫలితంగా అక్కడ ఆసుపత్రులు అన్ని కూడా హెచ్ఎంపీవీ కేసులతో నిండిపోయాయి అంటున్నారు. అదే ఊపున జపాన్ లో కూడా ఈ వ్యాది వ్యాపించింది. ఇపుడు భారత్ లో కేసులు వరసగా తొంగి చూస్తున్నాయి.
ఇప్పటికే భారత్ లో మూడు హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మూడు కేసులూ చిన్నారులకే రావడం విశేషం. బెంగళూరు లో ఇద్దరికి గుజరాత్ స్టేట్ అహ్మదాబాద్ లో ఒకరికి హెచ్ఎంపీవీ లక్షణాలు కనిపించాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. హెచ్ఎంపీవీ మీద అలెర్ట్ గా ఉండాలని పేర్కొంటూ గైడ్ లైన్స్ ని రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తం అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ని నిర్వహించారు.
ఏపీలో వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇదిలా ఉంటే ఇప్పటికి ఒక్క హెచ్ఎంపీవీ కేసు కూడా ఏపీలో నమోదు కాలేదని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. మరో వైపు ఏపీకి వచ్చే కొత్త వారి మీద పూర్తి నిఘా పెట్టాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఏ చిన్న పాటి అనుమానం ఉన్నా పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించాలని కూడా కోరారు.
అయితే హెచ్ఎంపీవీ మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి అలెర్ట్ గా ఉన్నా కూడా దీని మీద లోతైన స్టడీ చేస్తున్నారు. కేంద్ర అరోగ్య మంత్రి జేపీ నడ్డా అయితే ఇది దేశానికి పాత కేసే అన్నారు. కొత్తగా ఏమీ లేదని చెప్పారు. 2001 ప్రాంతంలోనే ఈ తరహా లక్షణాలు ఉన్న కేసులు బయటపడ్డాయని కూడా చెప్పారు.
మరో వైపు చూస్తే హెచ్ఎంపీవీ లక్షణాలు చూస్తే సాధారణ ఫ్లూ లక్షణాలతో ఇబ్బంది పెడుతుంది తప్ప మరణాల వంటివి ఇప్పటిదాకా నమోదు అయినది లేదని వైద్య ఆరోగ్య శాఖ నిపుణులు అంటున్నారు. ఈ వైరస్ భారత్ కి పాతదే అని కూడా చెబుతున్నారు. ఈ వైరస్ ని ఎదుర్కొనే శక్తి భారత్ ప్రజలకు ఉందని కూడా అంటున్నారు.
చాలా కాలంగా భారత్ లో వ్యాపిస్తున్న ఫ్లూ వైరస్ లో భాగమే ఇది అంటున్నారు. దీంతో భారత ప్రజలు రోగ నిరోధక శక్తిని పెంచుకున్నారని అంటున్నారు. ప్రజలకు ఇమ్యూనిటీ ఉండడంతో దేశంలో హెచ్ఎంపీవీ తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు తక్కువ అని అంటున్నారు.
ఇదిలా ఉంటే హెచ్ఎంపీవీ పుట్టు పూర్వోత్తరాలు చూస్తే 2001లో దీనిని కనుగొన్నారు. ఇది రెస్పరేటరీ సిన్సిటియల్ వైరస్ తో పాటు న్యూమో విరిడే కుటుంబంలోని భాగంగా చెబుతున్నారు. ఇక హెచ్ఎంపీవీ సోకిన వారికి సాధారణ లక్షణాలు ఏంటి అంటే దగ్గు జ్వరం ముక్కు మూసుకుని పోవడం శ్వాస ఆడకపోవడం వంటివి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఇక రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలోనే దీని ప్రభావం ఉంటుంది అంటున్నారు చిన్న పిల్లలలో వృద్ధులలో దీని ప్రభావం అధికం అని అంటున్నారు. అంతే కాదు బ్రాంకైటిస్ న్యూమోనియాకు సంబంధించిన దీర్ఘ వ్యాధులు ఉన్న వారిలో కూడా హెచ్ఎంపీవీ ప్రభావం అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అయినా అప్రమత్తంగానే ఉండాలని అంటున్నారు. బయటకు వెళ్లేటపుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని తిరిగి ఇంటికి వచ్చేటపుడు రెండు చేతులూ శానిటైజ్ చేసుకోవాలని సూచిస్తున్నారు అదే విధంగా చూస్తే ఏపీ ప్రభుత్వం అయితే పూర్తి అప్రమత్తం అయింది. ప్రతీ ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఇరవై దాకా పడకలను హెచ్ఎంపీవీ కోసమే కేటాయిస్తున్నారు. అంతే కాదు హెచ్ఎంపీవీ దూకుడు చేస్తే ఎదుర్కోవడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు.