ఇసుక పోయి.. లిక్కర్ వచ్చే ఢాం.. ఢాం.. ఢా... !
ఇక, ఇప్పుడు కీలకమైన కనక వర్షం కురిపించే మద్యం దుకాణాల వ్యవహారంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వేళ్లు-కాళ్లు పెట్టేస్తున్నారు.
By: Tupaki Desk | 7 Oct 2024 9:30 PM GMT''తమ్ముళ్లు మారాలి. నేనిదే చెబుతున్నా. మీరు ప్రభుత్వ పాలసీల్లో జోక్యం చేసుకోవద్దు. మీకు ఆదాయం వచ్చే మార్గాలు నేను చూపిస్తా'' ఖచ్చితంగా నెలన్నర కిందట పార్టీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావే శంలో సీఎం చంద్రబాబు గట్టిగా తేల్చి చెప్పిన మాట ఇది. ఆయన ఉద్దేశం ఉచిత ఇసుకలో జోక్యం వద్ద ని, కొత్తగా ప్రవేశ పెట్టనున్న మద్యం విధానంలోనూ వేలు పెట్టొద్దనే! ఇలా చేస్తే.. కూటమి సర్కారు కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతుందన్నది ఆయన ఆవేదన.
కానీ, తమ్ముళ్లు మహా ముదుర్లు! ఎవరూ తక్కువ కాదు. ఎక్కడికక్కడ అన్ని విషయాల్లోనూ వేళ్లు పెట్టేస్తు న్నారు. విపరీతంగా కెలికేస్తున్నారు. కొన్ని కొన్ని విభాగాల్లో కాంట్రాక్టు ఉద్యోగులను కాలం తీరకముందే తప్పించేసి.. తమ వారిని అప్పాయింట్‌మెంటు చేసుకుంటున్నారు. ఈ రచ్చ డిప్యూటీ సీఎం పవన్ వరకు చేరింది. ఇక, ఇసుక విషయంలో ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది అన్నట్టుగా పరిస్థితి ఉంది. చంద్రబాబు హెచ్చరికలను కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు.
ఇక, ఇప్పుడు కీలకమైన కనక వర్షం కురిపించే మద్యం దుకాణాల వ్యవహారంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వేళ్లు-కాళ్లు పెట్టేస్తున్నారు. నేరుగానే బెదిరింపులు చేస్తున్నారు. ఎంతగా అంటే.. టీడీపీపై ఈగైనా వాలనివ్వని మీడియా కూడా సహించలేనంతగా తమ్ముళ్లు బరితెగించేస్తున్నారు. ఎక్కడికక్కడ ముందే గల్లా పెట్టెలు తెరిచేశారు. ''నువ్వు మద్యం దుకాణానికి దరఖాస్తు చేస్తున్నావంటగా.. ముందు మా లెక్క తేల్చు'' అంటూ వ్యాపారులను హడలెత్తిస్తున్నారు. దీంతో ప్రైవేటు మద్యం వ్యాపారానికి పోటెత్తే వ్యాపారులు గమ్ముగా ఉండిపోతున్నారు.
మరికొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేల తనయులు, సతీమణులు కూడా రంగంలోకి దిగిపోయారు. అంతా తామై చక్రం తిప్పుతున్నారు. దుకాణం కోసం దరఖాస్తు చేసే వారి నుంచి సొమ్ములే కాదు.. తర్వాత ఆ దుకాణం ఏర్పాటు చేశాక.. దానిలోనూ తమకు 'వాటా' కావాలని హుకుం జారీ చేస్తున్నారు. దీనిలో పెద్ద తలకాయలే ఉండడం.. మాజీ మంత్రులే ఉండడం ఇప్పుడు అత్యంత విస్మయం కలిగిస్తోంది. ఇంత జరుగుతున్నా.. సామాన్య ప్రజలు సైతం అర్థం చేసుకుంటున్నా.. పార్టీ అధిష్టానం కానీ, ప్రభుత్వం కానీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం గమనార్హం.