రెండు ఎమ్మెల్సీలూ కూటమికి ఖాతాలోకే !
టీడీపీ కూటమికి వరస అదృష్టాలు అలా కలసి వస్తున్నాయి. 164 మంది ఎమ్మెల్యేలతో భారీ ఆధిక్యతతో కూటమి అధికారాన్ని చేపట్టింది
By: Tupaki Desk | 19 Jun 2024 3:19 AM GMTటీడీపీ కూటమికి వరస అదృష్టాలు అలా కలసి వస్తున్నాయి. 164 మంది ఎమ్మెల్యేలతో భారీ ఆధిక్యతతో కూటమి అధికారాన్ని చేపట్టింది. ఇంతలో రెండు ఎమ్మెల్సీ ఖాళీలు కూటమికి దక్కనున్నాయి. ఏపీలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలకు తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, షేక్ ఇక్బాల్ పై శాసనమండలి చైర్మన్ అనర్హత వేటు వేయడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. దాంతో ఈ ఉప ఎన్నికలను నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు జూన్ 25న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు జులై 2వ తేదీ తుది గడువు. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు జులై 5 వరకు అవకాశం ఉంటుంది. జులై 12న పోలింగ్ నిర్వహించి, అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు.
అయితే అసెంబ్లీలో ఉన్న భారీ ఆధిక్యత దృష్ట్యా కూటమికే ఈ రెండు సీట్లూ దక్కుతాయని అంటున్నారు. మరి ఈ రెండు ఎమ్మెల్సీలకు ఎవరిని ఎంపిక చేస్తారు అన్నది ఇపుడు హాట్ హాట్ డిస్కషన్ గా ఉంది. తాము టీడీపీలో చేరినందువల్లనే పదవులు కోల్పోయాం కాబట్టి తమ పేర్లను పరిశీలించమని రామచంద్రయ్య, ఇక్బాల్ కోరే అవకాశం ఉంది అని అంటున్నారు.
పైగా ఈ రెండు సీట్లూ రాయలసీమకు చెందిన వారివి కావడంతో వారితోనే భర్తీ చేస్తారా అన్నది కూడా చర్చగా ఉంది. అయితే ఎంతో మంది ఆశావహులు ఉన్నారు. ఎన్నికల్లో పొత్తుల మూలంగా ఎమ్మెల్యే టికెట్లు దక్కని వారు అంతా ఎమ్మెల్సీ మీద ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబు కూడా వారికి హామీ ఇచ్చారు. ఆ నంబర్ చూస్తే కనీసంగా యాభైకి తక్కువ ఉండదని అంటున్నారు.
అందులో కొందరికైనా పదవులు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. తొలిగా వచ్చిన రెండు పదవులూ ఎవరికి ఇస్తారు అన్నదే ఇపుడు అందరికీ ఆలోచింపచేస్తోంది. అయితే పార్టీ కోసం విశేషంగా కష్టపడిన వంగవీటి రంగా కుమారుడు రాధకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తారని అంటున్నారు.
రెండవ పదవికి కూడా టీడీపీ తీసుకుంటుందా లేక కూటమిలోని మిత్రులుగా ఉన్న జనసేన బీజేపీలకు ఇస్తుందా అన్నది చూడాలి. జనసేనలో కూడా ఎమ్మెల్సీ పదవుల మీద ఆశపడుతున్న వారు ఉన్నారు.బీజేపీ నుంచి కూడా కొందరు కోరుతున్నారుట. మొత్తానికి చూస్తే టీడీపీయే రెండు పదవులూ తీసుకుని రానున్న రోజులలో ఖాళీ అయ్యే వాటిలో మిత్రులకు ఇస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా అగ్ర తాంబూలం మాత్రం వంగవీటి రాధాదే అని అంటున్నారు. కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే నాటికి ఈ ఇద్దరు ఎమ్మెల్సీలు మండలిలో కనిపిస్తారు అని అంటున్నారు.