అధినేతల తీరుపై తమ్ముళ్లు.. జనసైనికుల్లో అంతర్మధనం
ఇదిలా ఉంటే.. కూటమిలో కీలకమైన చంద్రబాబు.. పవన్ కల్యాణ్ మాటలు అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులకే కాదు జనసేన శ్రేణులు సైతం నచ్చట్లేదు.
By: Tupaki Desk | 2 Aug 2024 10:30 AM GMTమాటలకు చేతలకు మధ్య తెలుగుదేశం అధినాయకత్వం సతమతమవుతోందా? తాము అధికారంలోకి వచ్చినంతనే తాట తీస్తామన్న మాటను జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేరుగా చెబితే.. దాదాపుగా అలాంటి అర్థం వచ్చేలా పలుమార్లు హెచ్చరికలు చేశారు చంద్రబాబు ఆయన కుమారుడు లోకేశ్ లు. అయితే.. అధికారం చేతికి వచ్చిన తర్వాత మాత్రం వారి మాటలు మారాయి. కక్షసాధింపు చర్యలు ఉండవని.. ఏం చేసినా అన్నీ పద్దతి ప్రకారమే చేస్తామని.. రాష్ట్ర అభివ్రద్ధి మాత్రమే తమకు ముఖ్యం తప్పించి.. ప్రతీకార చర్యలు ఉండవని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. కూటమిలో కీలకమైన చంద్రబాబు.. పవన్ కల్యాణ్ మాటలు అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులకే కాదు జనసేన శ్రేణులు సైతం నచ్చట్లేదు. విపక్షంలో ఉన్నప్పుడు దాడుల్ని ఎదుర్కొన్నది.. ఇబ్బందులు పడ్డామని.. ఇప్పుడు కనీసం హెచ్చరించే అవకాశం లేదన్నట్లుగా మాట్లాటడంలో అర్థం లేదంటున్నారు. దీంతో.. ప్రభుత్వం కొలువు తీరిన నెలన్నరకే పార్టీ శ్రేణులు తీవ్ర అసంత్రప్తితో ఉన్నాయి. ఈ వాతావరణాన్ని గుర్తించిన పవన్ కల్యాణ్.. తాను అనుకున్నదే జరగాలని.. తాను చెప్పిన దానికి భిన్నంగా ఎవరైనా.. ఏదైనా చేస్తే.. వారు ఎలాంటి వారైనా సరే వదులుకోవటానికి సిద్ధమని వ్యాఖ్యానించటం గమనార్హం.
కూటమి ప్రభుత్వం చెప్పినట్లుగా ప్రతీకార దాడులు.. అరెస్టులతో మోత మోగించే పని చేస్తే.. ఏపీ బ్రాండ్ ఇమేజ్ మరింత దెబ్బ తినటం ఖాయం. ఇప్పుడు కావాల్సింది దాడులు.. ప్రతీకారాలు కావు. అవసరమైన అభివ్రద్ధి. అదే సమయంలో పార్టీ శ్రేణుల స్థైర్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా ఉండే నిర్ణయాలను వారు హర్షించరు. విపక్షంలో ఉన్నప్పుడు ఇబ్బందులే. అధికారంలో ఉన్నప్పుడు ఆంక్షలే అయితే ఎలా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
ఏదో ఒక పేరుతో చేతులు కట్టేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని వారంటున్నారు. ఇలా చేయటం ద్వారానే.. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో పోరాటతత్త్వం తగ్గిందన్న విమర్శ పెరుగుతోంది. ఏ రోజు కూడా తమ మాటకు విలువ లేకుడా చేస్తున్నారన్న అపవాదు పార్టీ మీద అంతకంతకూ పెరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు వద్దని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారి సంగతి భవిష్యత్తులో చూస్తామన్న మాటలుదశాబ్దాల తరబడి చూస్తున్నామని.. మళ్లీ అదే రిపీట్ అవుతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది.
పార్టీ శ్రేణులకు అండగా ఉండే అలవాటు తెలుగుదేశం పార్టీకి లేదని.. నేతలు కూడా అంతేనని.. కష్టం వచ్చినప్పుడు కనిపించరని.. అవసరం వచ్చినప్పుడు మాత్రం ఆ మాటలు.. ఈ మాటలు చెబుతారన్న వేదనను వినిపిస్తున్నారు. అధికారం వచ్చినంతనే చెప్పే మాటలకు.. విపక్షంలో ఉన్నప్పుడు చెప్పే మాటలకు పొంతన ఉండదన్న అభిప్రాయాన్ని బలంగా వినిపిస్తున్నారు. మొత్తంగా.. చూస్తే.. అటు తమ్ముళ్లు.. ఇటు జనసైనికుల వేదనను పార్టీల అధినాయకత్వం పట్టించుకోవటం లేదన్న అభిప్రాయం వినిపిస్తున్నారు. వారి వాదనకు.. అభిప్రాయాలకు అంతో కొంత విలువ ఇవ్వకపోతే వారి స్థైర్యం సన్నగిల్లుతుందని.. అది పార్టీకి చేటు చేస్తుందన్న హెచ్చరిక వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.