Begin typing your search above and press return to search.

ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో సంచలన నిర్ణయాలు!

ఇప్పుడు ఇక ఆంధ్రప్రదేశ్‌ వంతు వచ్చింది. ఏపీ అసెంబ్లీ కూడా త్వరలో సమావేశమవుతుందని చెబుతున్నారు

By:  Tupaki Desk   |   6 Sep 2023 8:23 AM GMT
ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో సంచలన నిర్ణయాలు!
X

దేశంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు కేంద్ర ప్రభుత్వం ఒకేసారి పార్లమెంటుకు, రాష్ట్రాల శాసనసభలకు జమిలి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన చేస్తోంది. ఇంకోవైపు దేశం పేరును ఇండియా నుంచి భారత్‌ అని మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం సెప్టెంబర్‌ 18 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై, దేశం పేరు మార్పుపై చర్చోపచర్చలు సాగుతున్నాయి.

ఇప్పుడు ఇక ఆంధ్రప్రదేశ్‌ వంతు వచ్చింది. ఏపీ అసెంబ్లీ కూడా త్వరలో సమావేశమవుతుందని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు వీలుగా పార్లమెంటులో తీర్మానం పెడితే పార్లమెంటుతోపాటు దేశంలో సగానికి పైగా రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీ ప్రభుత్వానికి సంకేతాలు అందాయని అంటున్నారు. శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరచాలని కోరినట్టు తెలుస్తోంది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ లోనూ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలోనూ ఏపీలోనూ ముందస్తు ఎన్నికలు వస్తాయని భావిస్తున్నారు. ప్రతిపక్షాలు టీడీపీ, జనసేన ముందస్తు ఎన్నికలు ఖాయమని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీలు తమ ప్రచార కార్యక్రమాలను ఉధృతం చేశాయి.

ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు కూడా ఆసక్తి రేపుతున్నాయి. ఈ సమావేశాల్లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పెన్షన్‌ పెంపు నిర్ణయంతోపాటు వలంటీర్లకు జీతభత్యాల పెంపు వంటివి ఉంటాయని అంటున్నారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు లోక్‌ సభ ఎన్నికలతో పాటు వచ్చే వేసవిలో జరగాల్సి ఉంది. అయితే షెడ్యూల్‌ ప్రకారం వచ్చే వేసవిలో జరుగుతాయా లేదంటే కేంద్రం ముందస్తుకు వెళ్తే ఏపీ ఎన్నికలు కూడా ముందస్తుగానే జరుగుతాయా అనేది ఆసక్తి రేపుతోంది.

కాగా సెప్టెంబర్‌ 18 నుంచి మొదలయ్యే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో జమిలి ఎన్నికలు, దేశం పేరు మార్పు, మహిళా రిజర్వేషన్‌ వంటివాటిపై చర్యలు తీసుకుంటారని టాక్‌ నడుస్తోంది. ఈ బిల్లులు లోక్‌ సభలో సులువుగా నెగ్గుతాయి. ఎందుకంటే బీజేపీకి లోక్‌ సభలో సొంతంగా బలముంది. ఇక ఎన్డీయే కూటమిలోని పార్టీల బలంతో కలుపుకుంటే ఇది ఇంకా ఎక్కువ. అయితే రాజ్యసభలో మాత్రం బీజేపీకి పూర్తి స్థాయి బలం లేదు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో బీజేపీ ప్రభుత్వానికి వైసీపీ మద్దతు అవసరం ఉంది.

మరోవైపు ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలని చంద్రబాబు నాయుడు ఆశిస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సైతం ఇందుకు సుముఖంగానే ఉన్నారని.. బీజేపీ అధిష్టానాన్ని పొత్తుకు అంగీకరించేలా చక్రం తిప్పుతున్నారని అంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలో వైసీపీ మద్దతును ఆశిస్తున్న బీజేపీ రాష్ట్రంలో ఎన్నికల విషయం వచ్చేటప్పటికి వైసీపీ ప్రత్యర్థి పార్టీలైన టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతున్న తాజా నిర్ణయాలపై ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా తమ ఉద్దేశాన్ని వెల్లడించే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే సమయంలో ఎన్నికలకు సిద్దం అవుతున్న క్రమంలో ఈ నాలుగేళ్లలో తాము అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి.. మళ్లీ అధికారంలోకి వస్తే చేయబోయే వాటి గురించి వివరిస్తారని టాక్‌ నడుస్తోంది.