ఏపీ బడ్జెట్: వెయిట్ ఫర్ టు మంథ్స్!!
కానీ, దీనికి ఈ నెల ఆఖరుతో కాలం తీరుతుంది. ఫలితంగా.. వచ్చే ఆగస్టు నుంచి మార్చి 2025 వరకు ప్రస్తుత ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశ పెట్టి ఆమోదించుకుని .. కార్యకలాపాలు చేపట్టాల్సి ఉంటుంది.
By: Tupaki Desk | 24 July 2024 8:26 AM GMTఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. సోమవారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ప్రకారం.. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అనంతరం.. ఆయన కు ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశ పెట్టి మంగళవారం అంతా చర్చించారు. ఇక, ముందుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం బుధవారం(జూలై 24) రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టాల్సి ఉంది. కానీ, బుధవారం కూడా బడ్జెట్ను ప్రవేశ పెట్టడం లేదు.
ఈ విషయాన్ని సర్కారు బహిరంగంగా ప్రకటించలేదు. కానీ, మంగళవారం రాత్రి సభలో ప్రసంగించిన చంద్రబాబు.. రెండు మాసాల సమయం పడుతుందని చూచాయగా చెప్పినా.. దీనిపై నిర్ణయం తీసుకోలేదన్నారు. బుధవారం ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో కూడా చెప్పలేదు. కానీ, బుధవారం మాత్రం ఎలాంటి బడ్జెట్ను ప్రవేశ పెట్టలేదు. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చనే కొనసాగించారు. పలువురు మంత్రులు ప్రసంగించారు.
అసలు ఏం జరగాలి?
వాస్తవానికి ఈ ఏడాది ఎన్నికలకు ముందు.. ఫిబ్రవరి మూడో వారంలో వైసీపీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. ఇది.. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై మాసాల వరకు పెట్టుకుని ఆమోదం పొందారు. ప్రస్తుతం ఆ బడ్జెట్ ప్రకారమే కేటాయింపులు జరుగుతున్నాయి. నిధుల వినియోగం కూడా ఉంది. కానీ, దీనికి ఈ నెల ఆఖరుతో కాలం తీరుతుంది. ఫలితంగా.. వచ్చే ఆగస్టు నుంచి మార్చి 2025 వరకు ప్రస్తుత ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశ పెట్టి ఆమోదించుకుని .. కార్యకలాపాలు చేపట్టాల్సి ఉంటుంది.
కానీ, అలా చేయలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. అందుకే బడ్జెట్ను ప్రవేశ పెట్టేందుకు ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించుకునే పరిస్థితి వచ్చిందని సీఎం చంద్రబాబు చెప్పారు. అయినప్పటికీ.. జూలై 31 తర్వాత.. బడ్జెట్ను తీసుకురావాల్సి ఉంటుంది. కానీ, ఇప్పటి వరకు ఆ ఛాయలు కనిపించడం లేదు. అంటే.. మరోసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడమో.. లేదా.. ఆర్డినెన్స్ తీసుకురావడమో చేయాల్సి ఉంటుంది. ఏపీ చరిత్రలో ఇప్పటి వరకు ఇలా చేసిన దాఖలాలు లేవు. అయితే.. ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెబుతున్న దరిమిలా.. తప్పని పరిస్థితి ఏర్పడింది.