బీజేపీ లిస్ట్ లో నో సర్ ప్రైజ్...!
ఒరిజినల్ కమలాలు వాడిపోగా పార్టీకి దూరంగా ఉంటూ వచ్చిన వారు ఇతర పార్టీలలో ఉన్న వారు ఎక్కువ మంది సీట్లు అందుకున్నారు.
By: Tupaki Desk | 27 March 2024 4:57 PM GMTఏపీలో బీజేపీ పది సీట్లు అడగడం ఒక సర్ ప్రైజ్. ఆ సీట్లను పొత్తులో భాగంగా టీడీపీ ఇవ్వడం సర్ ప్రైజ్. అలా ఇచ్చిన సీట్లలో ఎవరు పోటీ చేస్తారో మాత్రం నో సర్ ప్రైజ్. ఎందుకంటే అంతా ఊహించినట్లే జరిగింది అని అంటున్నారు. ఒరిజినల్ కమలాలు వాడిపోగా పార్టీకి దూరంగా ఉంటూ వచ్చిన వారు ఇతర పార్టీలలో ఉన్న వారు ఎక్కువ మంది సీట్లు అందుకున్నారు.
ఆ లిస్ట్ చూస్తే విశాఖ నార్త్ నుంచి విష్ణు కుమార్ రాజుకే మళ్లీ టికెట్ ఇచ్చారు. ఈయన బీజేపీలో టీడీపీకి జై కొట్టే బ్యాచ్ అని ప్రచారంలో ఉన్న మాట. అరకు సీటుని పొంగు రాజారావుకు ఇచ్చారు. ఎచ్చెర్లలో ఈశ్వరరావుకు టికెట్ ఇచ్చారు. ఈయన బీజేపీ జిల్లా ప్రెసిడెంట్. ఈయనకు టికెట్ వస్తుందని కూడా ఊహించారు.
కైకలూరు టికెట్ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కి దక్కుతుందని లెక్క వేశారు. విశాఖ పశ్చిమ టికెట్ ని సుజనా చౌదరికి ఇచ్చారు. అలాగే పార్టీలో కీలక నేత ఎంపీ సీటు వస్తుందని ఆశించిన వై. సత్యకుమార్ కి ధర్మవరం అసెంబ్లీ సీటు ఇచ్చారు. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి జమ్మలమడుగు ఫిక్స్ చేఆరు. పీవీ పార్థసారథికి ఆదోనీ ఇస్తే బొజ్జా రోషన్నకు బద్వేలు సీటు ఇచ్చారు. ఇక సోము వీర్రాజుకు ఇస్తారనుకున్న అనపర్తి సీటుని శివకృష్ణంరాజుకు ఇచ్చారు.
ఈ లిస్ట్ మొత్తంలో ఒక సర్ ప్రైజ్ ఉందని అంటున్నారు. అదేంటి అంటే బద్వేల్ సీటుకు బొజ్జా రోషన్నకు ఇచ్చారు. ఈయన బీజేపీ కండువా కప్పుకోకుండానే సీటు కట్టబెట్టారుట. ఈ లిస్ట్ లో విశాఖ నుంచి బీసీ నేత సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ అయిన పీవీఎన్ మాధవ్ పేరు అయితే లేదు.
అలాగే సోము వీర్రాజుకు ఎక్కడా సీటు చూపించలేదు. ఇక అనంతపురం జిల్లాకు చెందిన విష్ణు వర్ధన్ రెడ్డికి కూడా సీటు ఇవ్వలేదు. ఆయన అయితే తాను ఎంపీగా ఈసారి పోటీ చేస్తాను అని చెప్పారని అంటారు. మొత్తానికి ఎలాంటి సర్ ప్రైజ్ లేకుండానే బీజేపీ లిస్ట్ వచ్చేసింది అని అంటున్నారు.