Begin typing your search above and press return to search.

వైసీపీ టీడీపీ... లైట్ తీసుకుంటున్న బీజేపీ...!?

దీంతో బీజేపీ ప్రాంతీయ పార్టీలను మచ్చిక చేసుకుని రాజ్యసభలో బిల్లులను ఆమోదించుకుంటూ వచ్చింది. అలా బీజేపీకి ఏపీ వరకూ చూస్తే టీడీపీ వైసీపీ అవసరాలు తీరుస్తూ వచ్చేవి.

By:  Tupaki Desk   |   3 March 2024 12:26 PM GMT
వైసీపీ టీడీపీ... లైట్ తీసుకుంటున్న బీజేపీ...!?
X

భారతీయ జనతా పార్టీ దేశంలో బలమైన పార్టీగా ఉంది. లోక్ సభలో గత రెండు ఎన్నికల నుంచి పూర్తి మెజారిటీని సాధిస్తూ వస్తోంది. ఈసారి కూడా బీజేపీ సొంతంగానే 370 సీట్లను సాధిస్తుంది అని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అంత కాకపోయినా 325 ఎంపీల దాకా బీజేపీ సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయి.

లోక్ సభలో బీజేపీ పరిస్థితి బాగానే ఉన్నా రాజ్యసభలో మాత్రం ఇబ్బందులు పడుతూ వస్తోంది. ఇది పెద్దల సభ. 2014లో బీజేపీ అధికారంలో వచ్చేనాటికి రాజ్యసభలో ఆ పార్టీ బలం హార్ సెంచరీ దగ్గరే ఉంది. అప్పట్లో కాంగ్రెస్ బలం రెట్టింపు ఉంది. పైగా మిత్రులతో కలసి కాంగ్రెస్ కి అక్కడ మెజారిటీ దక్కుతూ వచ్చింది.

దీంతో బీజేపీ ప్రాంతీయ పార్టీలను మచ్చిక చేసుకుని రాజ్యసభలో బిల్లులను ఆమోదించుకుంటూ వచ్చింది. అలా బీజేపీకి ఏపీ వరకూ చూస్తే టీడీపీ వైసీపీ అవసరాలు తీరుస్తూ వచ్చేవి. అయితే ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా తన సొంత బలాన్ని 97 కి పెంచుకుంది. అంటే వందకు మూడు తక్కువ అన్న మాట.

ఇక ఎన్డీయేలో ఉన్న బీజేపీ మిత్రుల బలం కలుపుకుంటే 117 కి చేరుకుంది. రాజ్యసభలో బిల్లుకు పాస్ కావాలంటే మ్యాజిక్ మార్క్ 121గా ఉంది. అంటే కేవలం నాలుగు అంకెల దూరంలో బీజేపీ ఉంది అన్న మాట. ఒక విధంగా బీజేపీ ఇపుడు రాజ్యసభలో కంఫర్టబుల్ పొజిషన్ లో ఉంది అని చెప్పాల్సి ఉంది.

ఎందుకంటే ఆ నలుగురు ఎంపీలు ఎవరైనా సాయం చేస్తారు. ఇప్పటిదాకా బీజేపీకి ఏపీలో టీడీపీ వైసీపీతో పాటు ఒడిషా నుంచి బిజూ జనతాదళ్ వంటి పార్టీల సాయం అందుతూ వచ్చిది. ఇపుడు జేడీయూ బీహార్ లో మళ్ళీ జట్టు కట్టింది. అలాగే బిజూ జనతాదళ్ కి నలుగురు ఎంపీలు ఉన్నారు. వైసీపీకి తాజా ఎన్నికల తరువాత 11 మంది ఎంపీలు అయ్యారు.

దాంతో బీజేపీకి రాజ్యసభలో ఇక మీదట బిల్లులు గట్టెక్కించుకునేందుకు ఎవరి అవసరం పెద్దగా పడదు అని అంటున్నారు. ముఖ్యంగా ఏపీ నుంచి చూస్తే టీడీపీ జీరో నంబర్ కి చేరుకుంది. వైసీపీకి 11 మంది ఉన్నారు. ఆ మద్దతు అవసరమే కానీ ఇది బేరసారాలు ఆడేందుకు ఈ బలం సరిపోతుందా అన్నది చర్చ.

మునుపటి మాదిరిగా బీజేపీ రాజ్యసభలో డబుల్ డిజిట్ మద్దతు అవసరం అయిన దుస్థితిలో లేదు. జస్ట్ నలుగురు ఎంపీలు అంటే ఆ టైం కి ఎవరైనా ఇవ్వవచ్చు ఎలాగోలా దానిని సాధించవచ్చు. ఒక విధంగా వైసీపీ అవసరం బీజేపీకి ఇపుడు పెద్దగా ఉండదు అని అంటున్నారు.

ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి రాకపోతే అపుడు ఆ పార్టీ ఎంపీలను తన వైపు సులువుగా తిప్పుకునే రాజకీయ వ్యూహాలను బీజేపీ వేయగలదు అని అంటున్నారు. అలాగే టీడీపీ జీరో నంబర్ తో ఉంది. 2026లో జరిగే ఎన్నికల్లోనే ఆ పార్టీ మెంబర్ రాజ్యసభలో అడుగుపెడతారు

అలా చూస్తే కనుక టీడీపీతో అవసరం కూడా బీజేపీకి లేనట్లే అని అంటున్నారు. బీజేపీకి ఈ రోజున 2004 ఎన్నికల్లో సొంతంగా లోక్ సభలో మెజారిటీ సీట్లు వస్తే ఏపీని ఇక్కడ రాజకీయ పార్టీలను పూర్తిగా ఖాతరు చేసే పరిస్థితి ఉండదని అంటున్నారు. 2014 నుంచి 2019 దాకా టీడీపీకి నిధుల విషయం నుంచి అన్ని విధాలుగా బీజేపీ సాయం చేసింది. 2019 నుంచి 2024 దాకా వైసీపీకి అదే విధంగా సాయం అందించింది.

దానికి కారణం రాజ్యసభలో బిల్లుల ఆమోదం కోసం మద్దతు తీసుకోవడానికే అని అంటున్నారు. అయితే ఇపుడు ఏపీలో టీడీపీ వైసీపీ ఎవరు అధికారంలోకి వచ్చినా కేంద్రంలో బీజేపీకి మెజారిటీ రాకపోతే ఏమో కానీ వస్తే కనుక అసలు ఢిల్లీ నుంచి ఏమీ సాధించలేని దుస్థితి ఏర్పడుతుంది అని అంటున్నారు.

బీజేపీ కూడా ఏపీ విషయంలో ఇపుడు సొంతంగానే నిర్ణయాలు తీసుకునే చాన్స్ ఉంది. ఏమి చేసినా తన పార్టీకి ప్రయోజనం రాజకీయంగా కలిగితేనే చేస్తుంది తప్ప లేకపోతే చేయదు అని అంటున్నారు. అందుకే టీడీపీ కూటమితో పొత్తులు అంటే బీజేపీ బింకాలు పోతోంది అని అంటున్నారు. ఇక బీజేపీ ఏపీకి ఏమీ చేయలేదు అని ఈసారి ఎన్నికల తరువాత కేంద్రం మెడలు వంచి ఏపీకి రావాల్సినవి తెచ్చుకోవాలని ఎవరైనా అనుకుంటే అది భ్రమే అవుతుంది.

సో ఏపీలో వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ అలవి కానీ హామీలు ఇచ్చినా బీజేపీ నుంచి సాయం అయితే ఉండదు, ఎవరు అధికారంలోకి వచ్చినా ఈసారి ఆరు నెలల లోపలే ఇబ్బందులో పడతారు. ఆర్ధికంగా కూడా చిక్కుల్లో పడతారు. బీజేపీ మాత్రం ఏపీ విషయంలో చోద్యం చూస్తూనే ఉంటుంది. సో హామీలు ఇచ్చేటపుడే జాగ్రత్తగా ఆలోచించుకోవాలని అంతా అంటున్నారు.

ఏది ఏమైనా బీజేపీ ఈ రోజున ఏపీలో రెండు ప్రాంతీయ పార్టీలను లైట్ తీసుకుంటూ తనదైన ఆట స్టార్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది అని అంటున్నారు.ఇక మరో విషయం కూడా ఉంది. 2026 నాటికి రాజ్యసభలో బీజేపీకి పూర్తి మెజారిటీ కూడా రాబోతోంది. అంటే ఆ నాలుగు ఎంపీల మద్దతు కూడా ఇక అవసరం పడనే పడదు. తస్మాత్ జాగ్రత్త అన్నదే ఏపీ రాజకీయ పార్టీలకు అంతా సూచిస్తున్న విషయం.