Begin typing your search above and press return to search.

చంద్రబాబు అధికార లెక్కలు వర్సెస్ తలసరి అప్పు సరిపోలేదే ?

ఏపీలో అప్పుల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా అసెంబ్లీలో అధికారికంగా శ్వేతపత్రం రిలీజ్ చేశారు

By:  Tupaki Desk   |   26 July 2024 12:04 PM GMT
చంద్రబాబు అధికార లెక్కలు వర్సెస్ తలసరి అప్పు సరిపోలేదే ?
X

ఏపీలో అప్పుల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా అసెంబ్లీలో అధికారికంగా శ్వేతపత్రం రిలీజ్ చేశారు. అదే సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మీడియా సమావేశం పెట్టి మరీ అప్పుల లెక్కలు వివరించారు. ఇలా ఇద్దరు నేతలూ ఒకేసారి ఏపీ అప్పుల మీద వెలువరించిన లెక్కలలో అయితే చాలా తేడా ఉంది.

ఇంతకీ ఏపీ అప్పుల మీద ఎవరు కరెక్ట్ చెప్పారు, ఎవరు రాజకీయ విమర్శలు చేస్తున్నారు అన్నది సామాన్యులకే కాదు మేధావులకు అంతు పట్టకుండా ఉంది. ఎందుకంటే ఏపీ అప్పుల మీద రకరకాలైన కామెంట్స్ గతం నుంచి ఈ రోజు దాకా వస్తూనే ఉన్నాయి.

ఇక అసెంబ్లీలో చంద్రబాబు ఆర్ధిక వ్యవహారాల మీద విడుదల చేసిన శ్వేతపత్రంలో జగన్ ని తూర్పారా పట్టడానికి ప్రయత్నం చేశారు. వైసీపీ హయాంలో తొమ్మిది లక్షల 74 వేల కోట్లు అప్పు అయినట్లుగా ఆయన చూపించారు. అంతే కాదు ఏపీలోని ప్రతీ ఒక్కరి మీద తలసరి అప్పు ఒక లక్షా 44 వేల 336 అని చెప్పారు. అయితే ఏపీలో జనాభా చూస్తే అటూ ఇటూగా అయిదు కోట్ల మంది దాకా ఉంటారు.

ఈ లెక్కన తీసుకుంటే అయిదు కోట్లు ఇంటూ 1,44 వేల 336 రూపాయలు అని లెక్కిస్తే కనుక మొత్తం అప్పు ఏడు లక్షల 21 వేల కోట్ల చిల్లరగా వస్తుంది. మరి ఎన్నికల టైం లో చంద్రబాబు నాయుడు ఏపీకి ఏకంగా 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పారు. అలాగే ప్రచారం కూడా చేశారు.

ఇపుడు ముఖ్యమంత్రి అయ్యాక అసెంబ్లీలో తొమ్మిది లక్షల 74 వేల కోట్ల అప్పు అని అంటున్నారు. అది కూడా అధికారికంగా విడుదల చేసిన శ్వేతపత్రం సాక్షిగా ఈ లెక్కలు చూపిస్తున్నారు. ఇది చంద్రబాబు చెబుతున్న అప్పుల లెక్క అయితే వైసీపీ అధినేత జగన్ కూడా అప్పుల గురించి ప్రెస్ మీట్ పెట్టి మరీ గణాంకాలను విడుదల చేశారు.

జగన్ చెప్పేవి వేరే లెక్కలుగా ఉన్నాయి. ఇక చంద్రబాబు శ్వేతపత్రం లో 2014 నుంచి 2019 దాకా తన హయాంలో చేసిన అప్పుల గురించి చెప్పడం లేదు. ఇక శ్వేతపత్రానికి బడ్జెట్ కి చాలా తేడా ఉంటుందని .బడ్జెట్ లో అయితే కచ్చితంగా నంబర్స్ పెట్టాలని బడ్జెట్ పెట్టేంత దమ్ము చంద్రబాబుకు లేదని జగన్ అంటున్నారు.

ఇక చంద్రబాబు చెప్పిన తలసరి అప్పు చూసుకుంటే అదే చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఏపీ అప్పుగా చెప్పిన లెక్కలకు సగానికి సగం తక్కువగానే ఉంది. ఇలా చూస్తే కనుక ఈ లెక్కలేంటి ఈ అప్పుల తప్పులేంటి అన్నది అంతా ఆలోచిస్తున్నారు. చంద్రబాబు చెబుతున్న లెక్కలు కరెక్ట్ గా లేక జగన్ చెబుతున్నది కరెక్ట్ గా అన్నది తెలియడం లేదు.

ఒక వేళ ప్రజలకు జగన్ తప్పుడు సమాచారం ఇస్తున్నారా అన్నది లేక చంద్రబాబు ఇస్తున్నారా అన్నది కూడా తెలియడం లేదు. లేకపోతే ఇద్దరూ ఇచ్చేది తప్పుడు సమాచారమేనా అన్నది కూడా తెలియడం లేదు. అందువల్ల కరెక్ట్ లెక్కలను ఆర్ధిక శాఖ నంబర్లతో సహా ద్వారా ఇస్తే బాగుంటుంది అలాగే చేయాలని మేధావులు డిమాండ్ చేస్తున్నారు.

ఇందులో చూసుకుంటే చంద్రబాబు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన బడ్జెట్ త్వరగా పెట్టి కరెక్ట్ లెక్కలు ఇవ్వాలని ప్రజలు అంతా కోరుతున్నారు. నిజానికి ఏపీ అప్పుల మీద ఇంతటి గందరగోళం చెలరేగడం మంచిది కాదు అని అంటున్నారు. తెలంగాణా రాష్ట్రానికీ అప్పులు ఉన్నాయి. అయితే కచ్చితమైన గణాంకాలు వివరాలు అక్కడ కనిపిస్తున్నాయి. అప్పుల విషయం అన్నది రాష్ట్ర భవిష్యత్తుని సూచిస్తుంది కాబట్టి ఈ విషయంలో రాజకీయ దోబూచులాటలకు ఆస్కారం లేకుండా స్పష్టమైన లెక్కలనే ఇవ్వాలని కోరుతున్నారు.