Begin typing your search above and press return to search.

మంచు రాష్ట్రం ఉచితాలతో మునిగింది... ఏపీకి పెద్ద హెచ్చరికే ?

అలా ఉచితంగా తీసుకుంటే అందులో మజా కూడా ఉండదు, స్వేదం చిందించి దాని నుంచి పొందే ప్రతీ పైసా ఇచ్చే కిక్కే వేరుగా ఉంటుంది.

By:  Tupaki Desk   |   2 Sep 2024 5:30 PM GMT
మంచు రాష్ట్రం ఉచితాలతో మునిగింది... ఏపీకి పెద్ద హెచ్చరికే ?
X

కాదేదీ ఉచితం అని పెద్దలు చెబుతారు. అలా ఉచితంగా తీసుకుంటే అందులో మజా కూడా ఉండదు, స్వేదం చిందించి దాని నుంచి పొందే ప్రతీ పైసా ఇచ్చే కిక్కే వేరుగా ఉంటుంది. ప్రజలు కూడా కష్టించే స్వభావులే. కానీ రాజకీయం కోసం ఓట్ల కోసం నాయకులు పార్టీలు వారిని అలా తయారు చేస్తున్నారు. సోమరులుగా మారుస్తున్నారు. ప్రతీదీ ఉచితం అనే నినాదాన్ని తెచ్చి ఓట్ల పంట పండించుకుంటున్నారు.

ఈ రోజున ఉచితం అంటే రేపు డబ్బు పెట్టినా అది దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ఉచితాలకు మంగళం పాడాలని ఆర్ధిక నిపుణులు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు. కానీ ఈ దేశంలోని రాజకీయ పార్టీలు వేలం పాట మాదిరిగా నీవు రెండు ఇస్తే నేను నాలుగు ఇస్తాను అని ఉచిత పధకాలను జనం ముందు పెట్టి రాజకీయ లబ్దిని పొందుతున్నారు. ప్రజలకు ఏమి పోయింది ఉచితంగా ఇస్తే ఎవరికైనా చేదా వారు కూడా ఆ వైపే మొగ్గు చూపుతున్నారు. కానీ ఉచితాల వల్ల కలిగే భారీ ముప్పు ఏమిటో కళ్ళకు కట్టినట్లుగా దేశంలోని ఉత్తరాన ఉన్న హిమాచల్ ప్రదేశ్ ఇపుడు చాటి చెబుతోంది.

ఈ రాష్ట్రం ఇపుడు కాంగ్రెస్ చేతులలో ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఉచిత హామీలను ఎన్నో ఇచ్చింది. అంతే కాదు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించింది. దాంతో ఉచితాలు కాస్తా ఇపుడు మంచు రాష్ట్రం కొంప నిండా ముంచాయి. దాంతో ఆ రాష్ట్రం ఏమీ చేయలేక చేతులు ఎత్తేస్తోంది

హిమాచల్ ప్రదేశ్ ఇపుడు పెను ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుంది. ఇటీవలే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు అంతా జీతాలు తీసుకోమని చెప్పి కొంత ఆర్ధిక స్వాంతన కలిగించే ప్రయత్నం చేశారు. అయితే అది ఏ మూలకు సరిపోతుంది. ఎన్నో చర్యలు తీసుకోవాల్సి ఉంది. నిజానికి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే పాత పెన్షన్ పునరుద్ధరణ అన్న గుదిబండను ఆ రాష్ట్రం తమ భుజాల మీద వేసుకుంది.

దాంతో ఏ ఏటికి ఆ ఏడు ఖజానాను దిగమింగేందుకు ఇదొక్కటి చాలు అని అంటున్నారు ఆర్ధిక నిపుణులు. ఇక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రతీ మహిళకు నెలకు 1500 రూపాయలు వారి ఖాతాలలో జమ చేసే ఉచిత పధకం అమలు చేస్తున్నారు. అలాగే యాభై శాతం రాయితీతో బస్సులో ప్రయాణించే అవకాశాన్ని కల్పించారు. దీనికి తోడు ఉచిత విద్యుత్ పధకాన్ని కూడా అమలు చేస్తున్నారు.

పాపం చిన్న రాష్ట్రం ఈ దెబ్బకు కుదేలు అవుతోంది. హిమాచల్ రాష్ట్రానికి ఏకంగా 95 వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. ఇక ఏటా ఆ రాష్ట్రానికి బడ్జెట్ ఏమో 58 వేల కోట్ల రూపాయలు. అందులో అచ్చంగా జీతాలకు పెన్షన్లకు పోతోంది చూస్తే 42 వేల కోట్ల రూపాయలు గా ఉంది. అంటే మిగిలింది కేవలం 16 వేల కోట్లు. ఇందులో నుంచి తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడానికే ఏ మూలకు సరిపోదు. మరి అభివృద్ధికి ఎక్కడ అన్నది నిలువెత్తు ప్రశ్న.

దాంతో ఆర్ధిక సంక్షోభం దిశగా హిమాచల్ ప్రదేశ్ పయనిస్తోంది. అంతే కాదు దేశంలోని ఉచితాలతో పబ్బం గడుపుకోవాలనే రాజకీయ పార్టీలకు కూడా ఒక గట్టి హెచ్చరికను జారీ చేస్తోంది. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఏపీ వైపు వస్తే ఏపీకి కూడా పది లక్షల కోట్ల పై చిలుకు అప్పు ఉంది. ఈ అప్పుల మీద ఏటా కట్టాల్సిన వడ్డీలే యాభై వేల కోట్ల రూపాయలుగా చెబుతున్నారు.

ఏపీకి ఆదాయాలు చూస్తే నికరంగా లక్షన్నర కోట్ల రూపాయలుగా చెబుతున్నారు. ఇందులో ఉద్యోగుల జీతాలు పెన్షన్లు సగానికి పోతాయి. ఇక అప్పులకు వడ్డీలు కడితే ఆ మీదట సామాజిక పెన్షన్లకు నలభై నుంచి యాభై వేల కోట్ల రూపాయలకు పోతే ఏపీ వద్ద కూడా ఏమీ మిగలని పరిస్థితి ఉంది. అమరావతి రాజధాని కట్టేందుకు వేల కోట్ల రుణం తీసుకుంటున్నారు. ఫ్యూచర్ లో ఇంకా అప్పులు పెరుగుతాయి. వీటికి తోడు సూపర్ సిక్స్ హామీలను ఇంకా టీడీపీ కూటమి అమలు చేయలేదు. మరో వైపు పాత పెన్షన్ విధానం అమలు చేయమని కోరుతున్నారు.

ఏపీలో కూటమి సర్కార్ వీటిలో ఏది చేయాలనుకున్నా ఆర్థికంగా ఇబ్బంది తప్పదనే అంటున్నారు. మొత్తానికి చూస్తే హిమాచల్ ప్రదేశ్ నుంచి అందుతున్న గుణపాఠాలు ఏపీతో పాటు తెలంగాణా, కర్ణాటక సహా ఉచితాలు అమలు చేసే రాష్ట్రాలు నేర్వాల్సి ఉంది అని అంటున్నారు.