ఏపీ అప్పులు అన్ని లక్షల కోట్లా ?
తెచ్చిన అప్పులకు రోజూ వారీ వడ్డి ఒక అంచనా ప్రకారం చూస్తే 250 కోట్ల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు అని అంటున్నారు.
By: Tupaki Desk | 23 Jun 2024 12:30 AM GMTఏపీ అప్పులు ఎంత అంటే ఎవరికి తోచిన లెక్కలు అయితే వారు చెప్పుకొచ్చారు. నిన్నటిదాకా అధికారంలో ఉన్న వైసీపీ నేతలు అయితే జస్ట్ అయిదారు లక్షల కోట్లు అన్నట్లుగా మాట్లాడారు. కానీ ఏపీ అప్పు పది లక్షల కోట్ల రూపాయల పై దాటి ఉంటుందని ఆనాడు విపక్షాలు చెప్పాయి.
అయితే ఇపుడు వారి లెక్క వీరి లెక్కా కాదు అంతకు మించిన కొత్త లెక్క కనిపిస్తోంది. ఏపీలో అప్పులు అక్షరాలా 14 లక్షల కోట్ల రూపాయలు అని అంటున్నారు ఈ మేరకు కొత్త ప్రభుత్వానికి రాష్ట్ర ఆర్ధిక శాఖ నుంచి నివేదికలు అందాయని అంటున్నారు
ఈ నెల 24న ఏపీ మంత్రిమండలి సమావేశం కాబోతోంది. ఈ సమావేశంలో ఏపీ ఆర్థిక పరిస్థితి మీద సుదీర్ఘంగా చర్చించనున్నారు. దాంతో ఆర్థిక శాఖ పూర్తి వివరాలు ప్రభుత్వం ముందు పెట్టింది అని అంటున్నారు. ఏపీ అప్పులు ఇన్ని లక్షల కోట్లు ఉంటే వాటికి సంబంధించి వడ్డీ చూస్తే కొండంత అని అంటున్నారు.
తెచ్చిన అప్పులకు రోజూ వారీ వడ్డి ఒక అంచనా ప్రకారం చూస్తే 250 కోట్ల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు అని అంటున్నారు. అంటే ప్రతీ రోజూ ఖజానాకు ఆదాయం రాకపోయినా వడ్డీల రూపంలో ఇదంతా చెల్లించాల్సిందే అన్న మాట. అలా నెల తిరిగేసరికి ఏకంగా పది వేల కోట్ల దాకా వడ్డీలకే కట్టాల్సిన పరిస్థితి ఉంది అని అంటున్నారు.
మరో వైపు చూస్తే రుణ పరిమితి దగ్గరకు ఈ ఏడాది ప్రభుత్వం రీచ్ అయిందని అంటున్నారు. అంటే అప్పు చూస్తే ప్రతీ ఏటా ఏపీకి మొదటి తొమ్మిది నెలలలో తీసుకోవడానికి 45 వేల కోట్ల రూపాయలుగా నిబంధన ఉంది. ఏప్రిల్ నుంచి ఆర్థిక సంవత్సరం మొదలైతే మొదటి రెండు నెలలు జగన్ ప్రభుత్వం ఉంది. దాంతో పాతిక వేల కోట్ల దాకా గత ప్రభుత్వమే రుణ పరిమితికి లోబడి పాతిక వేల కోట్ల దాకా తీసుకుని వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇక డిసెంబర్ వరకూ ఉన్న ఆరు నెలల కాలంలో చూసుకుంటే కేవలం 22 వేల కోట్ల అప్పులు తెచ్చుకోవడానికే కొత్త ప్రభుత్వానికి అవకాశం ఉంది అని అంటున్నారు. అంటే అప్పులతోనే పాలన సాగిస్తున్న ఏపీ ప్రభుత్వానికి ఈ 22 వేల కోట్ల అప్పులు సెప్టెంబర్ నెల దాకా సరిపోతాయని అనుకున్నా ఆ మీదట నాలుగు నెలలూ ఆర్ధికంగా గడ్డు కాలమే అని అంటున్నారు.
ఏపీలో సంపద సృష్టించాలనుకున్నా వాటి ఫలితాలు వచ్చేసరికి కచ్చితంగా రెండేళ్ల పై దాటుతుందని అంటున్నారు. అప్పటిదాకా అప్పులతోనే కాలక్షేపం చేయాలా అంటే పరిస్థితి చూస్తే అలాగే కనిపిస్తోంది. అయితే టీడీపీ కూటమికి ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో ఉండడం కొంతలో కొంత ఊరట అని అంటున్నారు. ఆ విధంగా వివిధ మార్గాల ద్వారా ఏమైనా గ్రాంట్స్ తెచ్చుకుంటే వెసులుబాటుగా ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వానికి ముందు అన్నీ పెను సవాళ్ళే అని అంటున్నారు.
అదే టైం లో సూపర్ సిక్స్ పేరిట ఇచ్చిన హామీలు అమలు చేయడం మరింత కష్టం అవుతుందని అంటున్నారు ఈ క్రమంలో ప్రభుత్వం ఎలా ముందుకు సాగుతుందన్నది చూడాల్సి ఉంది. అయితే వివిధ ప్రభుత్వ శాఖల మీద అవినీతి మీద శ్వేత పత్రాలను రిలీజ్ చేసి ప్రజలకు ఏపీ ఆర్ధిక పరిస్థితి మీద అవగాహన కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఏపీని కాపాడుకోవడానికి అందరూ సహకరించాలని ప్రమాణం చేసిన మొదటి రోజు నుంచి కోరుతూనే ఉన్నారు. ఏది ఏమైనా ఏపీ ఖజానాకు సంబంధించిన భయంకరమైన నిజాలు మంత్రి వర్గ సమావేశం తరువాత బయటకు వస్తాయని అంటున్నారు.