ఏపీలో అసలు ఎలక్షన్ మూమెంట్ లేదా ?
ఈ విధమైన వాతావరణం ఉండడం తోనే ఈసారి ఏపీ ఎన్నికల్లో పెద్దగా సందడి లేదు అని అంటున్నారు. టీడీపీలో కూటమి ఉంది.విభిన్న పార్టీలు ఉన్నాయి.
By: Tupaki Desk | 3 May 2024 3:30 PM GMTపెళ్ళంటే పందిళ్ళు సందెళ్ళు తప్పెట్లు బాజాలు భజంత్రీలు అని ఒక పాట ఉంది. అలాగే ఎన్నికలు అంటే చాలా ఉండాలి. ఒక విధంగా ఆ ఊపే వేరు అన్నట్లుగా ఉండాలి. కానే అదేమిటో మరో పది రోజులలో ముగిసిపోతున్న ఏపీ ఎన్నికలు మరీ ఇంత చప్పగానా అన్నట్లుగా సీన్ ఉంది.
నిజానికి ఏపీ అంటేనే దేశంలో ఎంతో రాజకీయ చైతన్యం కలిగిన రాష్ట్రంగా చెప్పుకుంటారు. వారు ఎపుడూ విలక్షణమైన తీర్పులే ఇస్తూంటారు. దేశమంతా ఒక దారి ఏపీది మరో దారి అని కూడా అన్నట్లుగా తీర్పులు ఉంటాయి. వారు సర్వేలకు అంచనాలకు అందని తీర్పులు ఇవ్వడంలో సరిసాటిగా ఉంటారు అని అంటున్నారు.
నిజానికి ఎన్నికలు వస్తేనే అని కాదు ఎపుడూ చూసినా ఏపీలో రాజకీయ పంచాయతీ మూడు పొద్దులూ సాగుతూనే ఉంటుంది. టీ బడ్డీల దగ్గర నుంచి మొదలెడితే రచ్చబండల దాకా రాజకీయ చర్చలు సాగుతూనే ఉంటాయి. ఇక కూరగాయల మార్కెట్ లో చూసినా ఆఖరుకు దేవాలయాలకు వెళ్ళినా రాజకీయ చర్చలు లేకుండా ఎవరూ తమ మాటలను ముగించరు అంటే అతిశయోక్తి కాదేమో.
ఏ నలుగురు గుమిగూడినా రాజకీయాలు లేకుంటే ఆ మాటలకు అర్ధం ఉండదు. వారికి తృప్తి కూడా ఉండదు. ఎవరేమిటి ఏ పార్టీ తీరు ఎలా ఉంది. ఎవరు గెలుస్తారు. ఎవరు ఓడుతారు ఇలా సర్వ సాధారణంగా ఆంధ్రాలో ప్రతీ చోటా జరిగే చర్చలు. కానీ అటువంటిది ఇపుడు చూస్తే అంతా గప్ చిప్ గా ఉంది. అంతా నిశ్శబ్ద వాతావరణం గా ఉంది.
ఏపీలో జమిలి ఎన్నికలు జరుగుతున్న వేళ ఇలాంటి వాతావరణం ఏమిటి అని అంతా ఆశ్చర్యపోతున్నారు. గలగలమని రాజకీయాలు మాట్లాడే వారు ఒక్కసారిగా మూతులకు గుడ్డలు ఎందుకు కట్టుకున్నారు అన్న చర్చ సాగుతోంది. ఏపీలో ఈ విధమైన వాతావరణంలో చడీ చప్పుడూ లేకుండానే ఎన్నికలు జరుగుతున్నాయని అంటున్నారు.
ఇక చూస్తే కనుక ఎమ్మెల్యేలు ఎవరూ డబ్బులు బయటకు తీయడం లేదు అని అంటున్నారు. మరో వైపు టీడీపీ వారు పంచడానికి సిద్ధమైపోయారని టాక్ నడుస్తోంది. ఇక అధికార పాటీ అభ్యర్ధులు అయితే సైలెంట్ గా ప్రచారం చేసుకుని పోతున్నారు. మందుతోనే మా ఊళ్ళలో హుషారు ఊపూ వస్తాయని క్యాడర్ చెబుతున్నా ఎమ్మెల్యేలు మాత్రం వినడం లేదు అని అంటున్నారు.
వారు ఫుల్ సైలెంట్ గానే ఉంటున్నారుట. కాసుల గలగల గ్లాసుల గలగల లేకపోతే ఇదేమి ఎన్నికలు అని అంటున్నారు. ఈ విధమైన వాతావరణం ఉండడం తోనే ఈసారి ఏపీ ఎన్నికల్లో పెద్దగా సందడి లేదు అని అంటున్నారు. టీడీపీలో కూటమి ఉంది.విభిన్న పార్టీలు ఉన్నాయి.
దాంతో ఎవరి గోల వారిదే అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఓట్లకు మాత్రమే తీస్తామని టీడీపీ అభ్యర్ధులు చెబుతూంటే అధికార పార్టీలో అయిదేళ్ళ పాటు పదవులు నిర్వహించిన వారు మాత్రం డబ్బులు తీయడానికి వెనకంజ వేయడం పట్ల చర్చ సాగుతోంది. ఎక్కడ అయినా డబ్బే మాట్లాడిస్తుంది. డబ్బే సందడి చేస్తుంది.
డబ్బుతోనే అంతా ఉంది.అలాంటిది ఏపీలో డబ్బు విషయంలో వైసీపీలో ఒకలా టీడీపీలో మరొకలా సీన్ ఉంది. దాంతోనే పల్లెలు మూగపోతున్నాయని అంటున్నారు. క్యాడర్ సైతం దిగాలు పడుతోంది అని అంటున్నారు. దీంతోనే రచ్చబండ చర్చలూ లేవు రాజకీయ గోల అంతకంటే కనిపించడం లేదు అని అంటున్నారు.మరో పది రోజులలో పోలింగ్ ముగుస్తుంది. ఇప్పటికే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అయినా ఈ కీలక సమయంలో సైలెంట్ గా సీన్ ఉంది అంటే ఎక్కడో తేడా కొడుతోంది భయ్యా అని అంతా అనుకునే పరిస్థితి. చూడాలి మరి రానున్న రోజులలో ఏమైనా మారుతుందో ఏమో.