Begin typing your search above and press return to search.

జనంలోని వైసీపీ...టీడీపీ జనసేన సంగతేంటి...?

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఎన్నికలు అంటే ప్రతిపక్షాలే ముందుగా మేలుకోవాల్సి ఉంటుంది.

By:  Tupaki Desk   |   12 Nov 2023 4:16 AM GMT
జనంలోని వైసీపీ...టీడీపీ జనసేన సంగతేంటి...?
X

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఎన్నికలు అంటే ప్రతిపక్షాలే ముందుగా మేలుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అధికార పక్షానికి ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ప్రతీ క్షణమూ పబ్లిసిటీగానే ఉంటుంది. పైగా అంగబలం అర్ధబలంతో పాటు అధికార బలం కూడా తోడు అవుతాయి.

దాంతో ఉరుకులు పరుగులు తీయాల్సింది విపక్షమే. అలాంటి ప్రతిపక్షం ఇపుడు ఏపీలో ఏమి చేస్తోంది అన్నది ప్రశ్నగా ఉంది. వైసీపీ చూస్తే జనంలోకి వెళ్తోంది. ఒక దాని తరువాత మరి ఒకటి అన్నట్లుగా కార్యక్రమాలను చేపడుతోంది. జనంలోకి ఎమ్మెల్యేలను ప్రజా ప్రతినిధులను పార్టీ నేతలను పంపుతోంది.

వైసీపీ ప్రచారం ఇంటింటికీ వెళ్తోంది. వైసీపీకి సొంత బలం ఉంది. పార్టీ క్యాడర్ ఉన్నారు. పంచాయతీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ సభ్యుడు దాకా నూటికి తొంబై శాతం వారి పార్టీ నేతలే ఉన్నారు. ఇక ప్రభుత్వ పరంగా చూసుకుంటే వాలంటీర్ల వ్యవస్థ కడు బలంగా ఉంది. గ్రామ సచివాలయాలు వైసీపీని సదా గుర్తుకు తెస్తాయి.

నిన్న గడప గడపకు మన ప్రభుత్వం అన్నారు. ఆ తరువాత సామాజిక సాధికారిక బస్సు యాత్ర అన్నారు. ఇపుడు వై ఏపీ నీడ్స్ జగన్ అంటున్నారు. ఇలా జనంతో ప్రతీ నిత్యం అధికార పార్టీ ఉంటోంది. తాము చేసినది చెబుతోంది. అధికారికంగా వివరిస్తోంది. తమ వైపునకు జనాలను పూర్తి స్థాయిలో ఉంచుకునే ప్రయత్నం చేస్తోంది.

మరి ఆ జోరు హుషార్ విపక్షంలో కనిపించడంలేదు. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. విపక్షం చేపడుతున్న ప్రతీ యాత్ర అసంపూర్తిగా ముగుస్తోంది. అదే అధికార పక్షం చేపట్టే ప్రతీ కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతం అవుతోంది.

అదే టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన యాత్రలు మధ్యలో ఆగిపోయాయి. నారా లోకేష్ పంతం మీద చేపట్టిన యువగళం నిలిచిపోయింది. అలాగే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సినిమా సినిమాకు మధ్య విరామం అన్నట్లుగా సాగుతోంది. గట్టిగా చేసినవి గోదావరి జిల్లాలు తప్పించి మరో చోట లేదు.

జనసేన టీడీపీ పొత్తు అన్నారు. జాయింట్ యాక్షన్ అన్నారు. జనంలోకి వెల్తామని అన్నారు. కానీ ఆచరణలో మాత్రం అది ఇంకా ఆలస్యం అవుతోంది. అదే టైం లో వైసీపీ మాత్రం స్పీడ్ పెంచేస్తోంది. జగన్ నెలలో కనీసం వారం పది రోజులు అయినా జిల్లాల టూర్లతో సభలో జనంలో ఉంటున్నారు. మరి వైసీపీ ప్రచారం అయితే ఒక పద్ధతి ప్రకారం సాగుతోంది.

చాలా స్పీడ్ గా చాలా దూకుడుగా విగరస్ గా చేయాల్సిన విపక్ష ప్రచారం ఇలా ఎన్నికలు ముందర పెట్టుకుని చతికిలపడడం అన్నది ఏ రకమైన సందేశాన్ని ఇస్తుంది అన్నది చూడాలని అంటున్నారు. ఇప్పటికైనా విపక్షం ఒక కార్యాచరణతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. జనాభిప్రాయాన్ని బిల్డప్ చేసి దాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఈ కొద్ది నెలల సమయం చాలా కీలకం. అందువల్లనే వైసీపీ స్పీడ్ చేస్తోంది. మరి విపక్షం సంగతేంటి అన్నదే ప్రశ్నగా ఉంది.