కేంద్రనికి ఉత్తరప్రదేశ్ ఎలానో...ఏపీకి గోదావరి జిల్లాలు ఆలా...!
దాంతో వైసీపీ సోలో ఫైటి ఇస్తూంటే కూటమి ఒక్కటిగా ముందుకు వస్తోంది. దాంతో ఈసారి గోదావరి తీర్పు ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తిని పెంచుతోంది.
By: Tupaki Desk | 29 April 2024 1:30 PM GMTకేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడాలన్నా ఉత్తర ప్రదేశ్ జనాలు ఇచ్చే మద్దతు అత్యంత ప్రధానం. ఇది దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి సాగుతూ వస్తున్న విధానం. దేశానికి కేంద్రానికి యూపీ గుండె కాయ లాంటిది అని అంతా అంటారు. దానికి కారణం దేశంలో ఎక్కడా లేనన్ని ఎక్కువ సీట్లు ఒక్క యూపీలోనే ఉన్నాయి. మొత్తం 543 లోక్ సభ సీట్లలో ఎనభై సీట్లు ఒక్క యూపీలోనే ఉన్నాయి. అంటే 15 శాతం సీట్లు అన్న మాట.
ఈ సీట్లలో ఎవరికి ఎక్కువ వస్తే వారే దేశానికి రాజు అవుతారు. అలా గతంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇపుడు బీజేపీ కూడా యూపీ మద్దతుతోనే అధికారంలోకి రెండు సార్లు వచ్చింది. ఇపుడు కూడా యూపీ వైపే ఆశగా బీజేపీ చూస్తోంది.
అదే విధంగా చూసుకుంటే ఉమ్మడి ఏపీ నుంచి విభజన ఏపీ వరకూ ఎవరు అధికారం చేపట్టాలన్నా కూడా గోదావరి జిల్లాలు అత్యంత ముఖ్యం. గోదావరి జిల్లాలలో ఎవరికి మెజారిటీ వస్తే వారిదే రాష్ట్రంలో అధికారం. ఈ ఆనవాయితీ కూడా ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తోంది.
గోదావరి జిల్లాలలో చూస్తే 2014లో టీడీపీకి పట్టం కట్టారు. దాంతో ఏపీకి సీఎం గా చంద్రబాబు అయ్యారు. ఇక 2019లో వైఎస్ జగన్ కి జై కొట్టారు. దాంతో ముఖ్యమంత్రిగా ఆయన అయ్యారు. గోదావరి జిల్లా వాసుల తీర్పులో కూడా ఒక ప్రత్యేకత విలక్షణత ఉంది. వారు వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఒకే పార్టీకి మొగ్గుతారు. ఆ పార్టీకి మొత్తం ఓట్లు సీట్లూ ఇస్తారు.
రెండవ వైపు చూడరు. వారు మిశ్రమ ఫలితాలు కూడా అందించరు. తమకు నచ్చింది అంటే ఆ వైపే ఉంటారు. ఇదే గోదావరి జిల్లాల ఓటర్ల స్వభావం. అది ప్రతీ ఎన్నికల్లోనూ ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఉమ్మడి ఏపీలో వైఎస్సార్ రెండు సార్లు గెలిచి సీఎం అయినా కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది.
దాంతో గోదావరి జిల్లాల తీర్పు ఎలా ఉంటుంది అన్న ఉత్కంఠ అయితే అందరిలో ఏర్పడింది. గోదావరి జిల్లాల రాజకీయం ఎలా సాగుతుంది అన్నది కూడా చర్చకు దారి తీస్తోంది. 2014లో వైసీపీ ఒక వైపు ఉంటే టీడీపీ జనసేన బీజేపీ రెండవ వైపు ఉన్నాయి. కూటమికే నాడు జనాలు పట్టం కట్టారు.
అదే కూటమి చీలిపోయి 2019 ఎన్నికల్లో పోటీ చేసింది. వార్ వన్ సైడ్ అయింది. వైసీపీకి మొత్తం 34 అసెంబ్లీ సీట్లకు గానూ 27 సీట్ల దాకా దక్కాయి. అలా ఫ్యాన్ పార్టీ బంపర్ విక్టరీని కొట్టింది. ఈసారి అలా కాకుండా టీడీపీ జనసేన బీజేపీ కూటమి కట్టాయి. ఈసారి జనసేన పోటీలో కూడా ఉంది.
దాంతో వైసీపీ సోలో ఫైటి ఇస్తూంటే కూటమి ఒక్కటిగా ముందుకు వస్తోంది. దాంతో ఈసారి గోదావరి తీర్పు ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తిని పెంచుతోంది. రెండు పార్టీలకు సగం సగం సీట్లు అని సర్వేలు కొన్ని వస్తున్నాయి. అలా కాకుండా వైసీపీకి ఎక్కువ అని కొన్ని సర్వేలు చెబుతూంటే కూటమికి ఎక్కువ సీట్లు అని మరికొన్ని చెబుతున్నాయి.
ఈ సర్వేలు అంచనాలు పక్కన పెడితే గోదావరి జిల్లాల ఓటర్లు ఎపుడూ తాము అనుకున్నది అనుకున్నట్లుగా ఈవీఎం మీట నొక్కి తీర్పు ఇస్తారు. వారు రెండవ ఆలోచన చేయరు. వారిలో మార్పు వచ్చినంటే అది ఏపీ మొత్తం వచ్చినట్లుగా భావించాల్సి ఉంటుంది. అందుకే ప్రభుత్వాలు కూడా మారిపోతూంటాయి. ఇక గడచిన రెండు మూడు ఎన్నికలు చూస్తే ఒక ప్రభుత్వాన్ని ఒకసారికి మించి ఉంచడం లేదు. మార్పు కోరుతున్నారు అని అంటున్నారు.
దాంతో టీడీపీ కూటమిలో కొత్త ఆశలు రేగుతున్నాయి. తాము అధికారంలోకి వస్తున్నాం, గోదావరి తీరం సాక్షి గా అని వారు అంటున్నారు. అయితే వైసీపీ నేతల ఆలోచనలు వేరుగా ఉన్నాయి. 2004, 2009లలో వరసగా రెండు సార్లు వైఎస్సార్ ని గెలిపించారు. ఇదే గోదావరి జిల్లాలు ఆనాడు పెద్దాయనకు జెండా ఎత్తారు అని గుర్తు చేస్తున్నారు. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని జగన్ కి కూడా రెండో చాన్స్ గోదావరి జిల్లాలు ఇవ్వబోతున్నాయని చెబుతున్నారు. మరి ఎవరి అంచనాలు ఎవరి నమ్మకాలు ఎవరి ధీమా నెగ్గుతుంది అంటే వెయిట్ అండ్ సీ.