Begin typing your search above and press return to search.

ఆర్‌-5 జోన్‌ లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే!

అమరావతి ప్రాంతంలో ఆర్ 5 జోన్ లో జగనన్న ఇళ్ల నిర్మాణం పై ఏపీ హైకోర్టు స్టే విధించింది

By:  Tupaki Desk   |   3 Aug 2023 7:02 AM GMT
ఆర్‌-5 జోన్‌ లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే!
X

అమరావతి ప్రాంతంలో ఆర్-5 జోన్ లో "జగనన్న ఇళ్ల నిర్మాణం"పై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఈమేరకు జస్టిస్‌ డీ.వీ.ఎస్‌.ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌, జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరితో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

అవును... అమరావతిలోని ఆర్‌ 5 జోన్‌ లో ఇళ్ల నిర్మాణాన్ని నిలువరించాలంటూ దాఖలైన వ్యాజ్యాలకు సంబంధించి హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇరువైపుల వాదనలు ముగియడంతో అనుబంధ పిటిషన్లపై నిర్ణయాన్ని వెల్లడించింది!

అమరావతిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, ఇళ్ల నిర్మాణం వ్యవహారం చాన్నాళ్లుగా కోర్టుల్లో నలుగుతోన్న సంగతి తెలిసిందే. అమరావతి కోసం తాము భూములు ఇచ్చామని... అక్కడ స్థలాలయినా, ఇళ్లయినా తమకే కేటాయించాలని రాజధాని రైతులు చెబుతున్నారంటూ కథనాలొచ్చిన సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో అందులో పేదలకు కూడా అవకాశం ఇవ్వాలంటూ వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సుప్రీంకోర్టు పట్టాల పంపిణీకి అనుమతి ఇస్తూనే.. తుది తీర్పుకి లోబడి ప్రవర్తించాలంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఆ మేరకు పట్టాల పంపిణీ కూడా నిర్వహించింది ఏపీ సర్కర్. అనంతరం రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల నిర్మాణం కూడా మొదలు పెట్టింది.

ఈ నేపథ్యంలో పట్టాల పంపిణీ విషయంలోనే తుది తీర్పు ఇంకా రాకుండానే.. ఇళ్ల నిర్మాణం ఎలా మొదలు పెడతారంటూ రైతులు మళ్లీ హైకోర్టుని ఆశ్రయించారు.

ఇందులో భాగంగా... స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అమరావతిలో ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు, 1402 ఎకరాల కేటాయింపు అధికారాలను గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్లకు బదిలీ చేస్తూ ఇచ్చిన జీవోలు, ఇళ్ల నిర్మాణ ప్రక్రియను సవాలు చేస్తూ.. రాజధాని ప్రాంత గ్రామాల రైతు సంక్షేమ సంఘాలు, రాయపూడి దళిత బహుజన సంక్షేమ జేఏసీ హైకోర్టులో పిటిషన్లు వేశాయి.

ఈ నేపథ్యంలో... రాజధాని అమరావతిలో ఆర్‌-5 జోన్‌ ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ఇళ్ల నిర్మాణాలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో... ప్రతిపక్షాల వల్లే ఇక్కడ పేదలకు ఇళ్లు అందుబాటులోకి రాకుండా పోయాయంటూ టీడీపీని వైసీపీ బోనెక్కించే ఛాన్స్ ఉందని అంటున్నారు పరిశీలకులు!