ఆమే అధికం... అందులో ఆంధ్రప్రదేశ్ ఆరోస్థానం!
అవును... ఆంధ్రప్రదేశ్ లో స్త్రీ పురుష నిష్పత్తిలో మహిళలే ఎక్కువ అని తాజా నివేదికలు చెబుతున్నాయి.
By: Tupaki Desk | 13 Oct 2023 3:00 PM GMTచట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ బిల్లు నూతన పార్లమెంట్ తొలి సమావేశాల్లో పాస్ అయ్యింది! యావత్ మహిళా లోకం హర్షం వ్యక్తం చేసింది. అంతవరకూ బాగానే ఉంది కానీ... ఇప్పటికీ ఆడపిల్లలని తెలిస్తే జరుగుతున్న భ్రూణ హత్యలు తగ్గడం లేదని అంటున్నారు. దేశం మొత్తం మీద స్త్రీ పురుష నిష్పత్తిలో వ్యత్యాసానికి అదే కారణం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ సమయంలో ఏపీలోమాత్రం మహిళల నిష్పత్తి ఎక్కువగా ఉందని తాజా నివేదికలు వెల్లడించాయి.
అవును... ఆంధ్రప్రదేశ్ లో స్త్రీ పురుష నిష్పత్తిలో మహిళలే ఎక్కువ అని తాజా నివేదికలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా ఏపీలో ఇక్కడ ప్రతి వెయ్యి మంది పురుషులకు.. 1,030 మంది మహిళలు ఉన్నారని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక వెల్లడిస్తోంది. దీంతో... దేశంలో అత్యధిక మహిళలున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో ఉంది.
దీనికి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు అనే వ్యత్యాసం ఏమీ పెద్దగా లేకపోవడం మరో విశేషం. ఆంధ్రప్రదేశ్ లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ స్త్రీ, పురుష నిష్పత్తిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. తాజాగా విడుదలైన లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం... 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది.
అదే సమయంలో... మిగతా రాష్ట్రాల్లో పురుషుల సంఖ్యే ఎక్కువగా ఉంది. ఇక ఓవరాల్ కంట్రీ మొత్తం చూస్తే... భారత దేశంలో ప్రతి 1,000 మంది పురుషులకు 943 మంది స్త్రీలు ఉన్నారు. ఇందులో పట్టణ ప్రాంతాల విషయానికొస్తే... ఇక్కడ ప్రతీ 1000 మంది పురుషులకూ 947 మంది స్త్రీలు ఉండగా... గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 1,000 మంది పురుషులకు 941 మంది స్త్రీలు ఉన్నారు.
ఇక ఏపీ విషయానికొస్తే... ఓవరాల్ గా రాష్ట్రంలో ప్రతి 1,000 మంది పురుషులకు 1,030 మంది స్త్రీలు ఉన్నారు. ఇందులో... పట్టణ ప్రాంతాల్లో ప్రతి 1,000 మంది పురుషులకు 1,017 మంది స్త్రీలు ఉండగా... గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 1,000 మంది పురుషులకు 1,035 మంది స్త్రీలు ఉన్నారు.