Begin typing your search above and press return to search.

ఏపీలో డ‌బ్బుల గోల‌.. ఒక‌రిపై ఒక‌రు కామెంట్లు.. నిజం ఏంటి?

సీఎం జ‌గ‌న్‌, చంద్ర‌బాబు, నారా లోకేష్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, వైఎస్ ష‌ర్మిల‌లు.. ఓటుకు డ‌బ్బులు పంచే విష‌యాన్ని ప్ర‌చారాల్లోనే చెబుతున్నారు. చిత్రం ఏంటంటే.. వీరిలో ఎవరు డ‌బ్బులు పంచుతున్నారో తెలియ‌దు.

By:  Tupaki Desk   |   10 May 2024 2:30 AM GMT
ఏపీలో డ‌బ్బుల గోల‌.. ఒక‌రిపై ఒక‌రు కామెంట్లు.. నిజం ఏంటి?
X

ఏపీలో అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల ప్ర‌చారానికి మ‌రో 48 గంట‌ల్లో తెర‌ప‌డ‌నుంది. దీంతో పార్టీలు ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశా యి. ఈ స‌మ‌యంలో పార్టీల అధినేత‌ల నుంచి కీల‌క నాయ‌కుల వ‌ర‌కు కూడా.. డ‌బ్బుల ప్ర‌స్తావ‌న తెస్తున్నారు. వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన‌, కాంగ్రెస్‌.. ఈ నాలుగు పార్టీల నాయ‌కులు కూడా త‌మ త‌మ ప్ర‌చారాల్లో డ‌బ్బుల పంపిణీ అంశాల‌ను ప్ర‌స్తావిస్తున్నారు. సీఎం జ‌గ‌న్‌, చంద్ర‌బాబు, నారా లోకేష్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, వైఎస్ ష‌ర్మిల‌లు.. ఓటుకు డ‌బ్బులు పంచే విష‌యాన్ని ప్ర‌చారాల్లోనే చెబుతున్నారు. చిత్రం ఏంటంటే.. వీరిలో ఎవరు డ‌బ్బులు పంచుతున్నారో తెలియ‌దు.

కానీ, ఒక‌రిపై ఒక‌రు మాత్రం కామెంట్లు చేసుకుంటున్నారు. ''టీడీపీ డ‌బ్బులు పంచుతుంది.. తీసుకోండి. కానీ ఓటు మాత్రం నాకే వేయండి. నేను డ‌బ్బులు పంచ‌లేను. నా ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవు'' అని సీఎం జ‌గ‌న్ ప‌దే ప‌దే త‌న ఎన్నిక‌ల ప్రచారంలో చెబుతున్నారు. అంటే... టీడీపీ డ‌బ్బులు పంచుతోంద‌ని సీఎం జ‌గ‌న్ చెబుతున్నారు. పోనీ.. ఇదేనిజ‌మ‌ని అనుకుంటే. టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు పార్టీ కీల‌క నాయ‌కుడు నారా లోకేష్ ఏం చెబుతున్నారంటే..''వైసీపీ వాళ్లు డ‌బ్బులు క‌ట్ట‌లు క‌ట్ట‌లుగా రెడీ చేసుకున్నారు. ఓటుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వ‌ర‌కు ఇస్తారు తీసుకోండి. కానీ, ఓటు మాత్రం సైకిల్ గుర్తుకే వేయండి. మా వాళ్లు డ‌బ్బులు పంచే స్థాయిలో లేరు. ఐదేళ్లుగా అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు'' అని వారు చెబుతున్నారు.

అంటే.. ఇక్క‌డ వైసీపీ నాయ‌కులు డ‌బ్బులు పంచుతున్నారు.. తీసుకోండ‌ని టీడీపీ నేత‌లు ప్ర‌చారంలో చెబుతున్నారు. క‌ట్ చేస్తే.. వైఎస్ ష‌ర్మిల మ‌రో అడుగు ముందుకు వేశారు. ''వైసీపీ వాళ్లు, టీడీపీవాళ్లు బాగా డ‌బ్బున్నోళ్లు. వారు మీ ద‌గ్గ‌ర‌కు వ‌స్తారు. డ‌బ్బులు ఇస్తారు తీసుకోండి. కానీ, ఓటు మాత్రం హ‌స్తం గుర్తుకే వేయండి. మ‌మ్మ‌ల్ని గెలిపించండి. మా ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవు'' అని ఆమె సెల‌విస్తున్నారు. ఇక‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కూడా.. ఒక‌టి రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించిన ప్పుడు.. త‌న ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవ‌ని.. సేవ చేసేందుకు వ‌చ్చాన‌ని.. వైసీపీ నేత‌లు డ‌బ్బులు ఇస్తే తీసుకుని కూట‌మి అభ్య‌ర్థుల ను గెలిపించాల‌ని కోరుతున్నారు. ఇలా.. ఒక‌రిపై ఒక‌రు డ‌బ్బుల పంపిణీపై కామెంట్లు చేసుకుంటున్నారు.

మ‌రి నిజం ఏంటి?

ఇలా.. కీల‌క‌నేత‌లు డ‌బ్బుల‌పై ప్ర‌చారం చేసుకుంటున్నా.. క్షేత్ర‌స్థాయిలో మాత్రం ఎన్నిక‌ల సంఘం మ‌ఫ్టీ పోలీసుల‌ను భారీ సంఖ్య‌లో పెట్టేసింది. చీమ చిటుక్కుమ‌న్నాప‌ట్టేసేలా.. ఈ యంత్రాంగం ప‌నిచేస్తుండ‌డంతో డ‌బ్బులు బ‌య‌ట‌కు తీయాలంటేనే (ఇవ్వాల‌ని అనుకునేవారు) హ‌డ‌లి పోతున్నారు. అందుకే.. వారి వారి అనుచ‌రుల ద‌గ్గ‌ర పెడుతున్నారు. కానీ, వాటిని కూడా పోలీసులు, ఎన్నిక‌ల అధికారులు ప‌ట్టేసుకుంటున్నారు. సో.. ఇప్ప‌టి వ‌ర‌కు అయితే.. ఏదో చిన్న చిన్న కానుక‌లు అది కూడా.. కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనే పంపిణీ చేసే ప్ర‌య‌త్నం చేశారు త‌ప్ప‌.. పూర్తిగా పంపిణీ కూడా చేయ‌లేదు. సో.. ఇప్ప‌టి వ‌ర‌కు అయితే డ‌బ్బుల పంపిణీ ఎవ‌రూ చేప‌ట్ట‌లేదు. పంపిణీ చేయాల‌ని అనుకున్నా.. వైసీపీని ప‌ట్టించేందుకు టీడీపీ, టీడీపీని ప‌ట్టించేందుకు వైసీపీ కూడా .. త‌మ త‌మ కార్య‌క‌ర్త‌ల‌ను నిఘాకు పెట్టాయి. సో.. మొత్తంగా ఇదీ.. సంగ‌తి! కానీ.. ఇవి తెలియ‌ని కొంద‌రు ఓట‌ర్లు.. డ‌బ్బుల పంపిణీ చేస్తున్నార‌ని, ఇది నిజ‌మేన‌ని అనుకోవ‌డం గ‌మ‌నార్హం.